Wednesday, October 31, 2012

మా ఇంటి పైకప్పు

తుఫాను వస్తుందంట...సాండి అని దానికి పేరు పెట్టారంట!

తగు జాగ్రత్తలు తీసుకోవాలని గత వారం బుధవారం నుండి ఒకటే ఇమైల్స్, ఫోన్లు గట్రాలు..

ప్రకృతి వికటిస్తే  మనం చెయ్యగలిగినది ఏమీ ఉండదు అని తెలిసినా...
అవసరార్ధం పాలు వగైరా ఆహారపదర్ధాలు తెచ్చుకోవాలి కదా..
అలాగే పవర్ పోతే ఫ్లాష్ లైట్స్,కాండిల్స్,లాంప్స్ వగైరా వస్తువులన్ని ఇంట్లో ఉన్నాయేమో అని చెక్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకున్నాను.


కిక్కిరిసిపోయిన డిపార్ట్ మెంటల్ స్టోర్స్, గ్రాసరి స్టోర్లలో నేను కూడా చొచ్చుకుని పోయి నావంతు షాపింగ్ కూడా చేసేసాను. 
స్నేహితులందరికి ఫోను  చేసేసి... "నా హరికేన్ షాపింగ్ అయిపోయింది..మరి మీదో?" లాంటి చెత్త సంభాషణలు అన్ని చేసేసి ...
యుద్దానికి సిద్దం గా ఉన్న సైనికుల్లాగా నేను కూడా తుఫాన్ రాకకి నా పరిధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని తీసుకుని రెడీ గా ఉన్నాను.


ఇంకో విచిత్రమైన సంఘటన జరిగిందండోయి...
ఒక స్నేహితురాలు ఫోన్ చేసి "మా ఇంట్లో కర్రంట్ పోతే బాకప్ గా మిమ్మల్ని పెట్టుకోవచ్చా?" అని అడిగింది.
మొదట అసలు తను  ఏమడుగుతుందో అర్ధం కాలేదు.
తరువాత నెమ్మదిగా వెలిగింది.
ఓహో! వాళ్ళింట్లో కర్రంట్ పోతే మా ఇంటికి రావచ్చా అని అడుగుతుందని..
"దానికేం భాగ్యం? భేషుగ్గా రండి" అని చెప్పాను.

అప్పుడు ఆ స్నేహితురాలు అడిగింది."నిన్ను ఇంకెవరన్నా ఫోన్ చేసి ఇలాగే అడిగారా "అని.
"లేదు..నువ్వే" అన్నాను. "హమ్మయ్య అయితే నేనే అనమాట నుంబెర్ 1.నువ్వు వేరెవ్వరికి హామి ఇచ్చినా నా తరువాతే సుమా" అని హెచ్చరించింది.

తను కనీసం ఇంకొక ఐదుగురికి ఫోన్ చేసి బాకప్ పెట్టుకుందట.
కాని వాళ్ళందరి దగ్గర తను నంబర్ 1 కాకపోవచ్చు అని చెప్పింది.
అమ్మో! మరీ ఇంతిలా ప్లాన్ చేసుకోవాలన మాట అని ఆశ్చర్య పోయాను.
అదే స్నేహితురాలిని అడిగాను. "మీ ఇంటికి నేను వస్తాను నాకు కర్రంట్ పోతే" అని .
"నీది నంబర్ 4 "అని చెప్పేసింది. "అంతేనా? నంబర్ బంప్ అప్ చెయ్యలేవా?" అని అడుగుదామని అనుకుని, మరీ అలా బతిమాలటం ఇష్టం లేక ఊరుకున్నాను.  


సోమవారం ఆఫీస్ లన్నిటికి సెలవు ప్రకటించారు. కాని పని చెయ్యగలిగిన వారు ఇంటి నుండి పని చెయ్యమని ఆదేశాలు కూడా జారి చేసారు. అనుకున్న రోజు రానే వచ్చింది.గాలి, వాన మొదలయ్యింది. టీవి లో వెదర్ చానల్ చూస్తూ ,రక రకాల తుఫాను కథలన్ని చెప్పేసుకున్నాము. చిన్నతనం లో చూసిన దివిసీమ తుఫాను నుండి, కత్రీన, ఐరీన్ వరకు...అలా ...అలా గుర్తుకు తెచ్చుకుంటూ సమయం గడిపేసాము.
సాయంత్రం టక్కున పవర్ పోయింది.
సరే అని ఫ్లాష్ లైట్ దగ్గర పెట్టుకుని, కాండల్ వెలిగించి..ఇంటిని చీకటి బారి నుండి కాపాడాను. ఇంతలో సెల్ మోగడం మొదలయ్యింది.
"మీ దగ్గర పవర్ పోయిందట కదా... అయ్యో ఎలా"అంటూ ఒక ఫ్రెండ్ పలకరింపు.
"ముందు నువ్వు ఫోన్ పెట్టు... అవసరం అయినప్పుడు ఈ ఫోన్ చార్జ్ లేకపోతే కష్టం" అని పెట్టేసాను.


ఈ పవర్ రేపటి వరకు రాకపోతే ఎలా? అసలే చలి కాలం...ఈ వాతావరణం లో పవర్ ఉన్న వారి ఇంటికి వెళ్ళాలన్నా కష్టమే..గాలి, వాన కలిసి భయంకరంగా ఉంది బయట....

ఒక గంట గడిచింది. నాకెందుకో వాన బయట కురుస్తున్న శబ్ధం చాలా దగ్గరగా వినిపించసాగింది. ఏదో నా పక్కనే పడుతున్నట్టు... టప టప శబ్ధం... ఆశ్చర్యపోతు... లివింగ్ రూం లోకి వచ్చాను. పది అడుగులు వెయ్యగానే కాళ్ళకు నీరు తగిలింది.. గుండె గుబేలుమంది... ఇదేమిటి ఇంట్లోకి నీరు అని ఆశ్చర్య పోతు..పైకి చూసా... రూఫ్ చిల్లు పడి పంపు లోంచి వచ్చే ధారలా
వర్షం చక్కగా ఇంట్లోనే కురుస్తుంది... కొయ్యబారిపోవడం తప్ప నేనేమి చెయ్యలేని పరిస్థితి. గబ గబా.. కింద హార్డ్ వుడ్ ఫ్లోర్  ని తుడిచేసి...ఇంట్లో ఉన్న టంబ్లర్ తేచ్చి సరిగ్గా వర్షం నీరు పడుతున్న చోట పెట్టి ఆ నీరు కింద పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. ఇది ఇంతటి తో ఆగేది కాదు అని మనస్సు చెపుతున్నా, ధైర్యం తెచ్చుకుని ఆ నీటి ధారను చూస్తూ కూర్చున్నాను. కొద్ది సెపటికి కనీసం ఇంకో నాలుగు చోట్ల రూఫ్ దెబ్బ తిని అదే విధం గా వర్షం నీరు ఇంట్లోకి కురవసాగింది... ఇంకో టంబ్లర్ తెచ్చి అక్కడ పెట్టి, కింద ఉన్న చెక్క ఫ్లోర్ ని కాపాడడానికి సత విధాల నా పాట్లు పడుతున్నాను. వర్షం రాత్రంతా కురుస్తూనే ఉంది.. నేను టంబ్లర్ లో
నీరు వంపేసి, మళ్ళీ పెడుతున్నాను. మొత్తానికి ఉదయం వర్షం ఆగింది..

దానితో పాటే నా ఇంట్లో రూఫ్ నుంచి కారుతున్న నీటి ధార కూడా ఆగిపోయింది.పవర్ రాగానే, మళ్ళీ ఫోనులు మోగాయి....ఇంతకి మా ఇంట్లోనే కాదు, చాలమంది స్నేహితుల ఇంట్లో ఇదే తంతు...
 


అమెరికా లో చెక్క ఇల్లు..కొనుక్కున్న 13/14 సంవత్సరాలకి ఇలాంటివి మామూలే! ఇలాంటి బాధలు తప్పవు అని చెప్పగా విన్నా...అనుభవించే వరకు తెలియలేదు.