Wednesday, March 27, 2013

Happy woman is a myth!! Really?


Youtube link for this video: http://www.youtube.com/watch?v=p6AyQiH7d_A
Scroll down this page  and click on pause button to stop the song which is playing by default.

Tuesday, March 26, 2013

ప్రేమలేఖ


చిత్రం: బాపు బొమ్మ
పుస్తకాలెన్ని నే చదివినా..
ఉప్పొంగిన భావాలెన్నింటికో నే అక్షరరూపం ఇచ్చినా..
అర్ధంకానిది ఒక్కటే!
నా మనస్సునే లేఖ గా రాసి నాకందించావు..
నన్ను నాకే కొత్తగా చూపించావు..
ఇదేనా ప్రేమంటే?

కోనసీమ-వేసవి సెలవులు-2

అన్నపూర్ణమ్మ గారి కంట్లో పడితే తమకి బడిత పూజ తప్పదని తెలిసిన ఆ అరుగురు గప్ చిప్ గా ఇంట్లోకి దూరి పడుకున్నట్లు నటించసాగారు.లక్ష్మి బయట పని ముగించుకుని ఇంట్లోకి వస్తూ పడుకున్నట్లు నటిస్తున్న శేఖర్ ని చూసి ముసి ముసి నవ్వులు నడుచుకుంటూ వంట గదిలోకి వెళ్ళింది.

అన్నపూర్ణమ్మ గారికి ఒక్కగానొక్క కూతురు సత్యవతమ్మ.సత్యవతిని తన పిన్నమ్మ కొడుకు విశ్వనాధంకి ఇచ్చి పెళ్ళి చేసింది ఆవిడ.విశ్వనాధంకి,సత్యవతికి ఆరుగురు సంతానం.మొదటి సంతానం అబ్బాయి,మిగతా ఐదుగురు అమ్మాయిలే.విశ్వనాధంగారు ఊరిలో పేరున్న పెద్దమనిషి.నలభై ఎకరాల భూమికి ఆసామి కావడమే కాక,ఆ ఊరికి పంచాయితి ప్రెసిడంట్ కూడా.ఊరిలో ఎవరికి తగువులు వచ్చినా విశ్వనాధంగారి దగ్గరికే తీర్పు కోసం వచ్చేవారు.ముక్కు సూటి మనిషి,నిజాయితికి మారు పేరు ఆయన.ఊరిలో అందరికి అయనంటే ఎంతో గౌరవం.ఎప్పుడు వేసే విస్తరి,తీసే విస్తరి అని అన్నపూర్ణమ్మ ఎంతో విసుక్కుంటూ ఉండేది.సత్యవతి మాత్రం భర్త చెప్పినట్టు నడుచుకునేది.విశ్వనాధంగారికి కొబ్బరి తోటలు ఉండేవి.ఏటా కొబ్బరి దిగుబడి బాగా వచ్చేది.చెరుకు పండించి బెల్లం తయ్యారు చేసి అమ్మేవారు.ఊడ్పు భూమిలో ధాన్యం పండించేవారు.వీటన్నిటితో పాటు సిగరెట్టు కూడా తెగ కాల్చేస్తూ,రాత్రైయితే కొద్దిగా పుచ్చుకోవటం లాంటి వ్యసనాలు కూడా ఆయనకి ఉండేవి.

విశ్వనాధంగారు కాంగ్రెస్స్ వాది.ఆ ఊరిలో,జిల్లాలో కాంగ్రెస్స్ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు.ఒక్కగానొక్క కొడుకు మాత్రం విధ్యార్ధి దశలోనే కమ్యునిస్ట్ పార్టి సిద్ధాంతాలకు ఆకర్షింపబడి కమ్యునిస్ట్ పార్టిలో సభ్యత్వం తీసుకున్నాడు.విషయం తెలిసిన తరువాత విశ్వనాధంగారి కోపానికి గురైనా తను మాత్రం నమ్మిన సిద్ధంతాలను,పార్టీను వదలలేదు ఆయన కొడుకు.కొడుకుతో పాటు ఐదుగురు కూతుర్లు కూడా నెమ్మదిగా అన్నగారి బాటలోనే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలనే ఇష్టపడేవారు.ఐదుగురు కూతుర్లకు పెళ్ళిల్లు చేసి గోదావరి జిల్లా అల్లుల్లనే తెచ్చుకున్నారు విశ్వనాధం గారు.కొడుకు ఆదర్శ వివాహం,కానీ కట్నం లేకుండా పెళ్ళి చేసుకుని తండ్రితో పాటు వ్యవసాయం చేసుకుంటూ అదే ఊరిలో తల్లితండ్రి,అమ్మమ్మతో నివసించేవాడు.

విశ్వనాధంగారి కొడుకు సంతానమే వంశీ.శేఖర్,రూప,రమ్య,రవి,గోపాల్ విశ్వనాధంగారి ఐదుగురు అమ్మాయిల సంతానం.వీరందరు ప్రతి వేసవి సెలవలకు కలుసుకుంటారు.కలుసుకున్న ఆ రెండు నెలలలో వారి అల్లరికి అంతు ఉండేది కాదు.విశ్వనాధంగారికి,సత్యవతిగారికి మనవలంటే ప్రాణం.వారు ఆడింది ఆట,పాడింది పాటగా గడిచేది ఆ రెండు నెలలు.అన్నపూర్ణమ్మ మాత్రం ఎప్పుడు విస్సుకుంటూ,వారి అల్లరి మితి మీరినప్పుడల్లా వారి మీద చెయ్యి చేసుకోడానికి కూడా వెనకాడేది కాదు.అందుకే ఆ ఆరుగురికి అన్నపూర్ణమ్మగారంటే  గారంటే మాత్రం చాలా భయ్యం.

పదమూడేళ్ళ లక్ష్మి తల్లీతండ్రి ఆ ఊరిలో మగ్గాల మీద వస్త్రాలను నేసేవారు.చేదోడు వాదోడు గా ఉంటుందని అన్నపూర్ణమ్మ గారి ఇంట్లో పనికి పంపించేవారు.దాదాపు అదే వయస్సు ఉన్నవారు ఆ ఇంటి మనవలందరు.అందుకే వారందరితో కలిసి ఎన్నో ఆటాలు ఆడేది లక్ష్మి.తెల్లవారుఝామునే వచ్చి అన్ని పనులు చక్కబెట్టే లక్ష్మిని చూస్తే ఆ ఆరుగురికి చాలా ఆశ్చర్యంగా ఉండేది.ఒక్క రోజైనా తాము లక్ష్మి కంటే ముందుగా లేచి లక్ష్మి కోసం వీధి అరుగు మీద కూర్చుని ఎదురు చూస్తామని పందెం కట్టారు ఆ ఆరుగురు.పందెం ఆరుసార్లు ఓడిపోయారు.పందెం గెలిసినప్పుడల్లా వారు ప్రతి వారం పొలం వెళ్ళి తాగే ముంజి కాయ నీరు తనకే ఇచ్చెయాలనేది  లక్ష్మి.

"బారెడు పొద్దెక్కింది.ఇంక లెగుస్తారా"అంటూ అన్నపూర్ణమ్మ అందరిని తట్టిలేపింది.అందరు లేచి కాలకృత్యాలు తీర్చుకుని,ఇంట్లో చావిడి దగ్గర సమావేశం అయ్యారు.ఆ గ్రూప్ కి లీడర్ శేఖర్,వంశీలు.వారు చెప్పినట్టు మిగతావారందరు నడుచుకునే వారు."లక్ష్మి మీద పందెం మనం ఇంకెప్పుడు గెలవలేమా అన్నయ్యా"అని అడిగింది రూప.అలోచిస్తున్న శేఖర్ "నాకొక అద్భుతమైన ఇడియా వచ్చింది"అంటూ...బావ వంశీ చెవిలో ఏదో గుసగుస లాడాడు.వింటూనే వంశీ ఆనందంతో చిన్నగా విస్సిల్ వేసాడు.విషయం తమకి కూడా చెప్పమని మిగతావారందరు గొడవ చేసారు.వారందరికి నెమ్మదిగా లోగొంతులో వంశీ చెప్పసాగాడు ఆ రాత్రి తాము ఏమి చెయ్యదలచారో...

Thursday, March 21, 2013

కోనసీమ-వేసవి సెలవులు-1



సమయం రాత్రి ఒంటిగంట దాటింది.అమావస్య కావటం వలన,చిక్కటి చీకటి ఆ అరుగు అంతా వ్యాపించి ఉంది.ఆరుబయట అరుగు మీద ఆరు మంచాల మీద ఆ ఆరుగురు వళ్ళు మరచి హాయిగా నిదురపోతున్నారు.ఇంతలో ఆ వీధిలో కుక్క ఒకటి బాధగా మొరిగింది.పక్కనే ఉన్న మిగతా కుక్కలు కూడా "భౌ""భౌ"మంటూ మొరగసాగాయి.గదిలో పడుకున్న అన్నపూర్ణమ్మకి నిద్రాభంగం కలిగింది.ఇలా కునుకు పట్టిందో లేదో,ఇంతలోనే వెధవ గొడవ అని విసుక్కుంటూ,ఆ చీకట్లో తడుముకుంటూ నడచి వెళ్ళింది.వీధి గుమ్మం తలుపు తీసి,కర్ర ఒకటి తీసుకుని కుక్కలన్నింటిని గట్టిగా బెదిరించింది.కుక్కలు ఆ వీధి దాటి పారిపోయాయి.అన్నపూర్ణమ్మ అరుగు దాటి తన గదిలోకి వెళ్ళి,తలుపు దగ్గరగా వేసి పడుకుంది.

అదే సమయంలో అరుగు మీద పడుకున్న ఆరుగురిలో ఒకరైన వంశీకి చట్టుకున్న మెలకువ వచ్చింది.ఎవరో తన భుజం మీద చెయ్యి వేసి లేపినట్టుగా అనిపించింది.వంశీ వయసు పదకొండు సంవత్సరాలు.అర్ధరాత్రి ఉల్లిక్కిపడి లేవడం వలన,అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది.కళ్ళు పోడుచుకున్నా కనపడని చీకటిలో వంశీకి తన పక్కన పడుకున్న వారెవ్వరు కనపడలేదు.పక్కన కప్పుకోకుండా మడత పెట్టి ఉన్న దుప్పటి లాక్కొని మొఖ్ఖం మీదగా పూర్తిగా కప్పేసుకుని,భయ్యంతో వణికిపోతున్నాడు.అరగంట గడిచాక నెమ్మదిగా నిద్రలోకి జారిపోయాడు వంశీ.
 
"లెగు తొందరగా,లక్ష్మి వచ్చేస్తుంది.వినిపిస్తుందా?"అని తనని పట్టుకుని కుదిపేస్తున్న బావ శేఖర్ ని  చూసి,ఒక్క ఉదుటున మంచం మీద నుంచి కిందకు దూకాడు వంశీ.అప్పటికే శేఖర్,రవి,రమ్య,రూప,గోపాల్ అందరు లేచి తన మంచం చుట్టూ గుముకూడి ఉండటం చూసాడు వంశీ.అక్కడ ఉన్న అందరి వయసు 10-12లోపే ఉంటుంది.వారందరూ సెలవలకి పట్టణాల నుంచి అమ్మమ్మ,తాతయ్య నివసిస్తున్న కోనసీమలో ఒక పల్లెటూరికి వచ్చారు.వారి అల్లరికి అంతు లేదని మామ్మగారు అన్నపూర్ణమ్మ విసుక్కుంటుంటే,ఆవిడ కూతురు సత్యవతమ్మ నా మనవలకేంటి బంగారం అని మురిసిపోతూ ఉంటుంది.
 
చుట్టూ ఇంకా కొద్దిగా చీకటిగా ఉండడం చూసి "టైమెంత"అని అడిగాడు వంశీ బావ శేఖర్ ని."ఐదు గంటలు దాటింది.లెగు,ఈ రోజైనా మనం పందెం ఓడిపోకూడదు"అన్నాడు శేఖర్.అయినా ఇప్పటికే లక్ష్మి వచ్చేసిందో ఏమో?రూపా, బయట కల్లాపు జల్లి ముగ్గు పెట్టి ఉందేమో చూడు"అని ఆర్డర్ జారి చేసాడు శేఖర్."అలాగే ఉండు చూసేసి వస్తా"అని రెండు అడుగులు గుమ్మం వైపు వేసి,ఆగిపోయింది రూప."అమ్మో!ఈ చీకట్లో ఒక్కదాన్నే నేను వెళ్ళలేను.రమ్య,నువ్వు కూడా రా"అని చెల్లెలి చెయ్యి పట్టుకుంది రూప."వద్దు అందరం కలిసే వెళదాము"అని రూప బెరుకుగా అన్న రవి వైపు చూసింది."అంత పిరికితనం ఏంటీ అసలు మీ అందరికీ?సరే పదండి"అని శేఖర్ ముందు నడవగా మిగతా ఐదుగురు అడుగులో అడుగు వేస్తూ అతనిని అనుసరించారు. 
 
అప్పటికే అన్నపూర్ణమ్మ లేచి వంటగదిలో మజ్జిగ చిలకరిస్తుంది.మామ్మగారు చూస్తే ఎక్కడ తమ మీద విరుచుకుపడతారో అని ఆ అరుగురు శబ్ధం చెయ్యకుండా వీధిలోకి వెళ్ళారు.అక్కడ ముంగిట ముగ్గు లేదు.ఆనందంతో అందరు పొంగిపోయారు.మొత్తానికి ఇన్ని రోజులకి లక్ష్మి మా చేతిలో ఓడిపోయింది అనుకుని ఒకరినొకరు కౌగిలించుకుని,"భలే"అని సంతోషంతో ఉప్పొంగిపోతుండగా ఇంట్లోంచి బక్కెట్టు,చీపిరి కట్ట తీసుకుని లక్ష్మి బయటికి అడుగుపెట్టింది.లక్ష్మిని చూడగానే అందరి మొఖ్ఖాలు మాడిపోయాయి."నువ్వెప్ప్పుడొచ్చావు?"నోరు తెరుచుని లక్ష్మిని చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు శేఖర్.ఫక్కున నవ్వింది లక్ష్మి."ఎప్పుడా?కోడి మొదటి సారి కూసినప్పుడు"అని కొంటెగా జవాబు చెప్పింది.ఇది అరోసారి మీరందరు నాతో ఓడిపోవడం"అని అంది.ఇంతలో అన్నపూర్ణమ్మ గట్టిగా అరిచింది వంటగదిలోంచి"ఎవరితోనే లక్ష్మి,పొద్దునే ఆ ముచ్చట్లు నీకు?"."వద్దు వద్దు చెప్పొద్దు"అని బతిమాలసాగారు ఆ అరుగురు."ఎవరితోను లేదమ్మా",అని కల్లాపు వెయ్యడంలో నిమగ్నమైపోయింది లక్ష్మి.

Wednesday, March 20, 2013

Tolywood Minimalistic Posters -చెప్పుకోండి చూద్దాం !

ఈ కింద ఉన్న రెండు పోస్టర్స్ ని చూడండి.
ఏ తెలుగు సినిమా పోస్టర్స్ అన్నది గుర్తుపట్టగలరా?






Monday, March 18, 2013

లేడీ బాస్-ఆఖరి భాగం



ఇద్దరి లేడీబాస్ లతో నిత్యం ట్రెడ్ మిల్ల్ మీద పరిగెట్టిన అనుభవేమో,మా కొత్త బాస్ గారు నడిస్తే చాలు,పరిగెట్టద్దు అనడం చాలా వింతగా అనిపించింది.అదేనండి ప్రతి చిన్న దానికి హడావిడి పడుతుంటే,ఫర్వాలేదు నెమ్మదిగా చెయ్యమనేవారు.ఇలా అలోచించటం తప్పేమో కాని,"భగవంతుడా,ఇకపై నాకు ఎప్పుడు మగ బాసులనే ప్రసాదించు స్వామి" అని పైకి ఎవ్వరికి వినపడకుండా దేవుడిని కోరుకున్నాను కూడా."రాక్షషి,నువ్వు స్త్రీవే కదా,ఇలా అలోచించడం తగునా?"అని అంతరాత్మ మందలించిందనుకోండి,అది వేరే విషయం.నాతో పని చేసేవారందరితో కలివిడిగా ఉంటు,వారు ఇచ్చిన పని సరిగ్గ చేసారా,లేదా అన్న ఒక్క విషయం తప్ప ఇంకేమి పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు.చాలా మందికి నేను నచ్చాను,ముఖ్యంగా అంతకు ముందున్న వాళ్ళ బాస్ చండశాసనుడు అని పేరు గడించడటం కూడా దానికి కారణం అవ్వచ్చు.

నాతో పని చేసే అరుణ ఒక నెల రోజులు లీవ్ మీద వెళుతూ,నాతో ఒక అరగంట ముచ్చటించింది.ఆ సంభాషణలో తను ఎందుకు సెలవు పెట్టాల్సొచ్చిందో అన్న విషయం షేర్ చేసుకుంటూ,తొందరలో వీలైతే ఉద్యోగం మానేస్తాను అని కూడా అంది.అరుణ తన పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి చేసే ఉద్యోగం ఆటంకమౌతుందని,అది తనకి బాధ కలిగిస్తుందని చెప్పింది.యధాలాపంగా అడిగాను,ఎంత వయస్సు పిల్లలకి అని.ఇద్దరు కవలలు-ఇద్దరికి పదమూడు సంవత్సరాలు అని చెప్పగానే అనాలోచితంగానే అనేసాను,"Are you out of your mind?You don't need to sit at home now,after working all these years.This is the time,teen hormones kick in and you will go thru hell mentally.ఈ టైంలో  పిల్లలే ఒక వ్యాపకంగా ఇంకే వ్యాపకం లేకుండా ఉండడం అన్నది అంత తెలివైన పని కాదు అన్నాను.నా లెక్చర్ పూర్తవకముందే "అలాంటి అనుభవం నాకు ఉండకపోవచ్చు.My kids love my company"అని సమాధానమిచ్చింది.కొద్దిగా ఆ విషయం మీద డిబేట్ చేదామన్న అలోచన కలిగింది కాని,అంతకంటే ఎక్కువ తనతో ఆ విషయం పొడిగించటానికి నాకు తనతో అంత చనువు లేని మూలాన,ఆ సంభాషణ అంతటితో ఆపేసాను.నేను అనవసరంగా తన వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకున్నానేమో అన్న రవ్వంత బాధ నాలో కలిగింది.నెమ్మదిగా నా అలోచనలు గతం లోకి పరుగులు తీసాయి.

డోన్నాకి నాకు మధ్య ఒకనాడు లంచ్ లో జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది.ఆ రోజు డోన్నా ఎందుకనో ఎప్పుడు ఉండే మూడ్ లో లేదు. ఏమిటి విషయం అని నేను యధాలాపంగా అడిగాను."విసిగిపోతున్నాను ఇద్దరి అమ్మాయిలతో.ఒకరు నా మేకప్ వాడేస్తారు నా అనుమతి లేకుండా.ఇంకొకరు నా బట్టలు వాడుతున్నారు అనుమతి లేకుండా.ప్రతి చిన్న విషయానికి వాదనకు దిగుతారు.నాకు చాలా పెద్ద తలనొప్పిగా తయారయ్యారు ఇద్దరు.ఎప్పుడు ఇంట్లోంచి పోతారా అని ఎదురు చూస్తున్నాను.ఇంకో రెండు సంవత్సరాలు ఆగడం నా వల్ల కాదు.ఇప్పటికే విసిగిపోయి ఉన్నాను." అని అంది.ముద్దుగా, నా చుట్టూ తిరిగే అమ్మాయి రూపమే నాకు తెలుసు ఆ రోజుల్లో.అసలు డోన్నా తల్లేనా?నవమాసాలు మోసి కన్నది ఈమేనా? ఎలా మాట్లాడుతుంది ఇలా?ఇద్దరి కూతుళ్ళు ఎప్పుడు ఇల్లు వదిలి పోతారో అంటుందా?నా దిగ్బ్రాంతిని అణుచుకుంటూ అడిగాను అమాయకంగా"You don't love them? How can you talk like this?"అని.వెంటనే సమాధానం"Love does not mean clinging to them for life long.I have my own life.They should understand their limits.I just can't take them anymore." పిల్లలతో సంబంధం లేని పెర్సనల్ లైఫ్ ఏంటి ఈవిడకి? మతి ఏమన్నా పోయిందా అని ఆశ్చర్యపోతు నెమ్మదిగా అడిగాను."Once they leave your house for higher studies,don't you feel the void in your life"అని."Are you kidding?I have so many things lined up to do for the rest of my life." అంది. ఇక ఆవిడ నా దృష్టిలో మమతానురాగాలు లేని ఒక మనిషి గానే కాని తల్లిగా కనిపించలేదు.ఆ నిమిషంలో ఆవిడ వాడిన పదజాలం కాని,తనకంటూ ఒక లైఫ్ లేకుండా పోతుంది అని వాపోవడం చూసాక ఆవిడ మీద అప్పటివరకు ఉన్న ఆరాధ్యభావం పోయి,ఆవిడ మీద విముఖత కలిగింది.

అదే సంభాషణ మా మధ్య ఈనాడు జరిగితే,అలాంటి అనుభవాలు పూర్తిగా నాకు లేకపోయినా,నా అనుభవాలకి ఆవిడ అనుభవాలకి వ్యత్యాసం ఉన్నా, ఆవిడను నేను ఆ రోజుల్లో జడ్జ్ చేసినట్టు చేసేదాన్ని కాదేమో!అది మొదటిసారి,ఆఖరిసారి కాదు,నేను నా చుట్టూ ఉన్నవారిని జడ్జ్ చెయ్యడం.జేన్ విషయంలో కూడా అదే జరిగింది. జేన్ ఒక రోజు నాతో,ఇంకొందరితో అంది "నేను చాలా సంతోషంగా ఉన్నాను ప్రస్తుతం.నా భర్త, నేను,మా పనులు వీటితో తీరిక ఉండదు.నాకు నా పిల్లలిద్దరు చాలా దూరం గాఉన్నారు.Thank God!చీటికి మాటికి వాళ్ళు నా ఇంటికి రావడం నాకు నచ్చదు."అని.పిల్లల నీడ పడకూడదు అనుకుంటుంది ి అసలు ఈవిడ మనిషేనా అన్న ఏహ్య భావం అప్పట్లో నాకు కలిగింది.తనని కూడా జుడ్జ్ చేసాను.

మనం మన తల్లితండ్రులను చూసి నేర్చుకున్నది కావచ్చు,మన సంస్కృతి కావొచ్చుకాని చాలామంది భారతీయులు పిల్లలే జీవితం,వారే లోకంగా బ్రతికేవారే!అన్నీ వారికోసమే అని నిరంతరము వారి సుఖం,వారి సౌఖ్యానికి ఎక్కువగా పాటు పడేవారే. పాశ్చాత్య సంస్కృతిలో ఆడవారైనా కాని ,మగవారైనా కాని వారికంటూ ఉన్న అభిరుచులు, వారి హాబీలు,వారి ఇష్టాలు సాధారణంగా చంపుకోరు.బాధ్యతగా పిల్లలని పెంచి మంచి పొరులుగా తీర్చిదిద్దుతారు కూడా.కాని ఆ ప్రహసనంలో వారు తమని తాము అంకితం చేసేసుకోరు.అలాగే పిల్లల మీద మనకున్నంత ఇమోషనల్ డిపెండన్స్ కూడా ఉండదు వారికి.కొవ్వొత్తుల్లా కరిగిపోరు పిల్లల కోసం.చరమ దశలో వృద్దులైన వారిని చూడటానికి పిల్లలు రావటం లేదే అన్న బాధ కూడా తక్కువే వారికి.

ఆ మధ్య చూసిన"Amour"అనే సినిమాలో సన్నివేశం గుర్తొచ్చింది.ఇద్దరు వృద్దులైన భార్యాభర్తలు ఒకరికి ఒకరు తోడుగా నివసిస్తూ ఉంటారు.భార్యకి పక్షవాతం వచ్చి కదలలేని పరిస్థితి.ఒక్కగానొక్క కూతురుకి ఈ విషయం తెలిసి వచ్చి చూసి బాధపడుతుంది,తరువాత వెళ్ళిపోతుంది.కొన్ని రోజులకి తిరిగి వచ్చి తండ్రి మీద మండిపడుతుంది.నేను లెక్కలేనన్ని సార్లు ఫోన్ చేసాను,అమ్మ ఎలా ఉందో కనుకుందామని,నువ్వు ఒక్కసారి కూడా నాకు జవాబు ఇవ్వలేదు,నా కాల్ రిటర్న్ చెయ్యలేదు అని.I was so worried"అని బాధ పడుతుంది.అప్పుడు తండ్రి ఇలా జవాబు ఇస్తాడు."Your worries are of no use to me.Don't get me  wrong.I am not criticizing  you.I just don't have time to deal with your worries.That is all.మీ అమ్మ తను ఉన్న ఈ స్టేట్ లో ఎవ్వరిని చూడాలనుకోవడం లేదు,నేను కూడ.నీకంటూ ఒక పెర్సనల్ లైఫ్ ఉంది కదా,అలాగే మాకు ఉంది, దయచేసి మమ్మల్ని విసిగించకు."అని అంటాడు.

చేతన్ భగత్ తన బ్లాగ్ లో Woman's day రోజు రాసిన ఒక అర్టికల్"Five things women need to change about themselves"చదివాను.అతను రాసినవన్నిటితో నేను ఏకిభవించకపోయినా ఒక్క పాయింట్ మాత్రం ఎందుకో నన్ను బాగా అలోచింపచేసింది."The first behaviour that needs to end is the constant desire to judge other women---Women are hard on themselves.They are harder on each other. An overweight woman enters the room. Most women are thinking 'how fat is she?' A working mother misses a PTA meeting due to an office deadline, others think 'what a terrible mother she is'. A pretty woman's promotion makes other women wonder what she had been up to to get the job.From an ill-fitting dress to a badly cooked dish,you are ready to judge others.This, despite knowing, you yourselves are not perfect.As a woman, it is tough enough is to survive in a male dominated world. Why be so hard on each other? Can you let each other breathe?"

నేను నా లేడి బాస్ లను జడ్జ్ చెయ్యడం కూడా చేతన్ భగత్ చెప్పిన పాయింట్ కి సరిగ్గా సరిపోయే ఉదాహరణే కదా?ఇన్ని పోస్ట్స్ రాసి,ఇంత ఎనాలిసిస్ చేసిన నేను పూర్తిగా మారిపోతానంటారా?ఏమో? ఒకవేళ మళ్ళీ ఎవరన్నా నేను జడ్జ్ చెయ్యడం చూసి నన్ను నిలదీసారే అనుకోండి,నా దగ్గర సమాధానమొకటి రెడి గా ఉందండోయి....నా సమాధానం "ఫీమేల్ DNA ప్రాబ్లం. I can't help it. sorry" అని

Thursday, March 14, 2013

లేడీ బాస్-3


క్రమంగా నాకు  ఉద్యోగ బాధ్యతలు పెరిగి, జేన్ తో  రోజుకి కనీసం ఆరు గంటలు,ఒక్కోసారి ఏడు గంటలు కలిసి పనిచెయ్యాల్సివచ్చేది.జేన్ భర్తకి కేన్సర్ అని ఒక రోజు నాతో చెప్పింది.అతను క్రిటికల్ గానే ఉన్నాడని తను ఎలాంటి వార్త వచ్చినా నిలదొక్కుకోడానికి  సిద్దంగానే ఉన్నట్టు చెప్పింది.ఆ వార్త విన్న రోజు నాకు చాలా దిగులు వేసింది.మనస్సులో ఎంత బాధ ఉన్నా,ఎప్పుడు నవ్వుతూ,ధైర్యంగా కనపడే జేన్ ని  చూసి చాలా నేర్చుకోవచ్చు అనిపించింది.

25, 27 సంవత్సరాల కొడుకు, కూతురు ఉన్నారు జేన్ కి.జేన్ కొడుకు కూడా మా ఆఫీస్ లోనే పనిచేసేవాడు.వారివురూ ఎక్కువగా మాట్లాడుకునే వారు కాదు.వాళ్ళ లాస్ట్ నేంస్ కలవడం చూసి నేను ఒక రోజు జేన్ తో నీ లాస్ట్ నేం ఫలానా అబ్బాయికి ఉంది కదా అని అడిగితే,అతను నా కొడుకు అని చెప్పింది.ఆశ్చర్యపోయాను.ఈ విషయం తను నాతో ఎప్పుడు ప్రస్తావించకపోవడం కొద్దిగా వింతగా అనిపించింది.కూతురు గురించి అడిగితే,భర్త నుంచి విడాకులు తీసుకుందని న్యూయార్క్ లో ఉద్యోగం చేస్తుందని చెప్పింది.నన్ను కూడా అప్పుడప్పుడు నా కూతురి గురించి అడిగేది."టీనేజ్ అమ్మాయి ఇంట్లో ఉందంటే నువ్వు అనుభవించే మానసిక సంఘర్షణ నేను అర్ధం చేసుకోగలను"అని ఒక రోజు అంది.ఒక్క నిమిషం ఉల్లిక్కిపడి "అలాంటిదేమి లేదే ...నాకూతురుకేంటి బంగారం"అని మాట దాటేసాను.లేడీ బాస్ లు(డొన్నా,జేన్)ఇద్దరిని చూసి నేను స్పూర్తి చెంది నేర్చుకున్నది ఎంతో ఉన్నా,కొన్ని సంధర్భాలలో వారితో సంభాషించినప్పుడు వారు వ్యక్తపరిచిన కొన్ని అభిప్రాయాలు విన్నాక నాకు వారి మీద ఒక రకమైన విముఖత కలిగింది.
ఎవ్వరి కోసము నేను ఆగనంటూ కాలచక్రం గిర్రున తిరిగింది.అమ్మాయి కాలేజ్ కి వెళ్ళాల్సిన రోజు దగ్గరపడింది.మనస్సులో అంతులేని దిగులు,ఒక రకమైన గుబులు.రోజు ఉదయాన్నే స్కూల్ బస్ వెళ్ళిపోతుంది అని హడావిడి పడటం ఉండదు.నాతో చీటికి మాటికి ప్రతిదానికి వాదనకు దిగేవారు ఉండరు.చేసిన వంట తినకుండా ఇంకేదో కావాలని అడిగే వారు ఉండరు.పిక్కప్ లు,డ్రాప్ లు  ఉండవు,రాత్రిళ్ళు తనతో పాటు మెలుకుని ఉండాల్సిన రోజులు ఉండవు.ఒక్కసారిగా ఎన్నో సంవత్సరాలుగా అలవాటైన దినచర్య పూర్తిగా మారిపోతుంది అన్న ఊహే భరించడానికి కష్టం గా ఉండేది. కొద్ది రోజులు సెలవు పెట్టి అమ్మాయితో నెల రోజులు గడిపాను.చిత్రంగా మా మధ్య గొడవలు చాలా మటుకు తగ్గిపోయాయి.అలా అని పూర్తిగా కాదు,కాని తను నవ్వుతూ,ఆనందంగా ఉండటం,ఇంతకు ముందులా ధుమ ధుమ లాడుతూ ఉండటం చాలా మటుకు తగ్గింది.నెలరోజుల తరువాత తను కాలేజీకి వెళ్ళిపోయింది.నా దినచర్యలో ఎంతో మార్పు.ఒకప్పుడు ఊపిరి పీల్చుకోడానికి కూడా సమయం ఉండేది కాదు,ఇప్పుడు అంతా తీరికే!రోజు అమ్మాయి ఒక టెక్ష్ట్ మెస్సేజ్ ఎప్పుడు పంపిస్తుందా,ఎప్పుడు ఫోన్ చేస్తుందా అని ఎదురుచూసేదాన్ని.
ఒక రోజు అమ్మాయి ఫోన్ చేసి రెండు రోజులయ్యిందని దిగులుగా ఉందని జేన్ తో చెప్పాను.తను నాతో "పిల్లల మీద విపరీతమైన ప్రేమను పెంచుకుంటాము మనము.రక్త సంభంధమే కాకుండా,వారు చిన్నతనంలో మన పట్ల వ్యక్తపరిచే ప్రేమను చూసి కూడా జీవితంలో ఇంతకంటే మధుర క్షణాలు ఉండవు కదా అనిపిస్తుంది.కాని నెమ్మదిగా వారు పెరుగుతున్న కొద్దీ,వారిలో చాలామార్పు వస్తుంది.దేవుడు టీనేజ్ అన్నది సృష్టించి,పిల్లల ఇంకో రూపం చూపుతాడు మనకి.ఆ మార్పు మనల్ని నెక్ష్ట్ స్టేజ్ కి బాగా ప్రిపేర్ చేస్తుంది.వాళ్ళు ఇల్లు వదిలి పైచదువులకని వెళ్ళిపోవడం-నెక్ష్ట్ స్టేజ్.ఒకవేళ వాళ్ళు మారకుండా చిన్నప్పుడు ఉన్నట్టే కనక ఉంటే,వారి దూరాన్ని/యడబాటుని తట్టుకుని తల్లులు జీవించలేరు.They make it so easy for us.."అని చెప్పింది. ఎందుకో ఈ సారి తను చెప్పింది నిజమే అనిపించింది.అయినా సరే,అంతకు ముందే జేన్,డోన్నా పట్ల నేనేర్పరుచుకున్న అభిప్రాయం మాత్రం మారలేదు.
కొన్ని సంవత్సరాలు అక్కడ పని చేసిన తరువాత,నేను మళ్ళీ ఉద్యోగం మారాను.కొత్త ఉద్యోగం,కొత్త మనుషులు,కొత్త వాతావరణం.నా బాస్ మాత్రం ఈ సారి లేడి కాదు."మొత్తానికి ఇన్నాళ్ళ తరువాత నీకు ఒక మగ బాస్ ..భలే!"అని శ్రీవారు నన్ను ఆటపట్టించారు."అయితే ఏంటట?ఇప్పుడు ఈ కొత్త ఉద్యోగంలో నేనయ్యాను కదా,కొంతమందికి లేడీబాస్" అని నవ్వుతూ సమాధానమిచ్చాను.
(ఎంత కుదించి రాయాలన్నా వీలుకాక,టపా పెద్దదైపోవడం వలన ముగించలేక పోయాను.ముగింపు తప్పకుండా తరువాయి పోస్ట్ లో)

Tuesday, March 12, 2013

లేడీ బాస్-2

Artist: Mohan
ఫేర్వెల్ల్ పార్టీ ముగిసాక ఇంటికి చేరుకునే సరికి సమయం మధ్యానం మూడు గంటలు దాటింది.ఇంట్లోకి అడుగుపెట్టగానే హాయిగా ఊపిరి తీసుకున్నాను.రేపు ఆఫీస్ కి వెళ్ళక్కర్లేదు అన్న భావన ఎందుకో ఆ నిమిషం లో చాలా సంతృప్తినిచ్చింది నాకు.అమ్మాయి స్కూల్ నుంచి వచ్చే వేలయ్యింది అనుకుంటూ సోఫాలో అలా కూర్చుండిపోయాను.అరగంటలో కాలింగ్ బెల్ మోగడం తో లేచి తలుపు తీసాను.వస్తూనే ఆ స్కూల్ బాగ్ సోఫా లో విసిరేసి,"అమ్మా,ఆకలి" అంది అమ్మాయి."అలాగే కాని, ముందు నీ స్కూల్ బాగ్ తీసుకుని నీ రూం లో పెట్టి, కాస్త చేతులు , మొఖం కడుక్కుని రా.."అని అన్నాను. "ఓకే" అంటూనే అయిష్టంగా తన రూం వైపు అడుగులేసింది అమ్మాయి.

చూస్తుండగా ఎంత ఎదిగి పోయింది అమ్మాయి. ఒకప్పుడు "అమ్మా.." అంటూ ప్రతి చిన్న విషయానికి తన చుట్టు తిరిగేది కదా అని అనుకుంటూ అమ్మాయి రూం నుంచి వచ్చేసరికి తనకి వేడి వేడి గా తినటానికి వడ్డిస్తూ,ఎదురుగా కుర్చీలో కూర్చుని,"ఏమయ్యిందిరా ఈ రోజు స్కూల్ లో" అని అడిగాను. "నథింగ్" పొడిగా జవాబు."హోం వర్క్ ఎక్కువగా ఉందా"అని అడిగాను."ఆ మరి ఉండదా?అన్ని సబ్జెక్ట్స్ లో హోంవర్క్ ఉంది,పైగా రేపు రెండు పరీక్షలు కూడా ఉన్నాయి.నాకు నిద్రపోడానికి కూడా టైం ఉండదు" అని చెప్పింది అమ్మాయి."సరే తొందరగా తినేసి సమయం వృద్ధా చెయ్యకుండా వర్క్ చేసుకో,అలా అయినా ఒక నాలుగు గంటలు పడుకోవచ్చు అని అన్నాను అమ్మాయితో."నువ్వు చెప్పక్కర్లేదు,నాకు తెలుసు"అని విసురుగా వచ్చింది సమాధానం.వెంటనే కోపంతో "అలాగేనా అమ్మతో మాట్లాడేది?నువ్వు చదువుకున్నా,చదువుకోకపోయినా నాకు ఫర్వాలేదు కాని, పెద్దవారితో మాట్లాడే పద్దతి మాత్రం నేర్చుకోవాలి.నీ ఇష్టం వచ్చినట్టు ఎంత మాట పడితే అంత మాట అనేస్తావా?" కోపంగా అడిగాను.ఆ మాటకి అమ్మాయి కూడా ఊరుకోకుండా"నేనేమన్నా పాపాయిననుకున్నావా?నువ్వు అన్నీ చెపితే కాని నాకు తెలీదా?"అనేసి తన రూం లోకి వెళ్ళిపోయింది అమ్మాయి.మనస్సు చివుక్కుమన్నా,పద్నాలుగేళ్ళకే  వయస్సుకి మించి చదువులు, ఒక్క నిమిషం తీరిక లేకుండా ఒక దాని తరువాత మరోక యాక్టివీటీస్ తో సతమతమవుతున్న మూలాన ఉన్న స్ట్రెస్స్ అని సరిపెట్టుకుని పనిలో మునిగిపోయాను.


రెండు వారాల్లో కొత్త ఉద్యోగం లో చేరాలి నేను.ఈ రెండు వారాలు అమ్మాయికి నాకు మధ్య ఎన్నో వాగ్యుద్దాలు.ప్రతి చిన్న విషయానికి విస్సుకోవడం, ఎదిరించటం,మళ్ళీ వచ్చి "I did not mean it, sorry అని చెప్పటం.Stop treating me like a baby"అనటం..ఇలా ఎన్నో ఎన్నేన్నో.. ఒకప్పుడు అమ్మని నిమిషం వదిలిపేట్టకుండా,స్కూల్ కి ఎప్పుడన్నా వెళితే "My mom" అని ఫ్రెండ్స్ అందరిని పరిచయం చేసే తన గారాల పట్టేనా ఇది అని అనుకునేదాన్ని.ఇప్పుడు పొరపాటున ఎప్పుడన్నా, స్కూల్ కి వెళితే,  "ఎందుకొచ్చావు అమ్మా?You are embarrassing me"అని నన్ను తప్పించుకుని వెళ్ళడం లాంటి పనులు చేసినప్పుడు విపరీతంగా బాధ పడేదాన్ని. శ్రీవారు చాలా తేలిక గా "అబ్బా, నీ పని నువ్వు చేసుకోవోయి,అది మంచి అమ్మాయి,బుద్ధిగా చదువుకుంటుంది కదా,అంతకంటే ఏమి కావాలి నీకు,కాస్తా దాని గురించి పట్టించుకోవడం మానేస్తే బెట్టర్." అని సలహా ఇచ్చేసి ఆ టెన్నిస్ రాకెట్ ఊపుకుంటూ వెళ్ళిపోయారు.

అమ్మాయి రూం గురించి ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పాలి.శనివారం నాడు రూం క్లీనింగ్ అని మొదలుపెట్టి చక్కగా అద్దం లా సర్దుకుంటుంది. ఆదివారం తను పడుకునే మంచం ఖాలీగా ఉండటం మూలాన,హాయిగా పడుకుంటుంది.ఇక సోమవారం నుండి అమ్మాయికి మంచం మీద పడుకునే చోటు క్రమేనా తగ్గిపోతు ఉంటుంది.అలాగే సర్దుకుని,రోజు రోజుకి ఎంత వీలైతే అంత తక్కువ చోటులో పడుకుంటూ,శుక్రువారం రాత్రి అయ్యేసరికి,ఒక మూలగా మంచం మీద ముడుచుకుని ఏ నిమిషంలో అయినా పడిపోతుందేమో అని భయపడేలా పడుకుంటుంది.ఆ మంచం మీద 90% పుస్తకాలు,ఇంకా మిగతా వస్తువులతో మునిగి పోయి ఉంటుంది.ఇదెక్కడి చోద్యం, ఆ పుస్తకాలు తీసి టేబల్ మీద పెట్టి,సరిగ్గా పడుకోవచ్చుగా అంటే "నాకు టైం లేదు,నీకెందుకు?"అనేస్తుంది ఫట్ మని.పోన్లే కదా అని ఒకరోజున నేనే బుధవారం నాటికి మంచం పుస్తకాలతో మునిగిపోయి ఉంటే, చక చక అవన్ని తీసేసి, టేబుల్ మీద పెట్టి నీట్ గా పక్క సర్దేసాను. 

ఆరోజు అమ్మాయి "నువ్వెందుకు నా పుస్తకాలు సర్దావు,నాకు ఏ పుస్తకం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలీదు"అంటుంటే,విస్తుపోయి,అన్ని పుస్తకాలు ఆ టేబుల్ మీదేగా పెట్టా..అంటే,అయినా వినకుండా నా మీద విరుచుకు పడిపోయింది.చేసిన తప్పు ఏమిటో అర్ధం కాక బిక్క మొఖం వేసి, నీ రూం వైపు కాని,నీ జోలికి గాని వస్తే మళ్ళీ చూడు అని బాధగా అక్కడ నుంచి వచ్చేసాను.సరిగ్గా అప్పట్లో రెండు సంవత్సరాల క్రితం రేవతి దర్శకత్వంలో ఒక సినిమా వచ్చింది."Mitr" అని.ఆ సినిమాలో కూడా ఇలాగే  తల్లి చిందరవందరగా ఉందని కూతురు రూం సర్దితే,చెడా మడా తల్లిని తిడుతుంది కూతురు.పాపం శోభన(తల్లి పాత్రధారి) తను చేసిన తప్పేమిటో తెలియక కుమిలిపోతుంది.మరీ శోభన లెవల్ లో కాకపోయినా, చాలా బాధ పడ్డాను నేను కూడా.మళ్ళీ శ్రీవారి సలహా.."అస్సలు నీకెందుకోయి?హాయిగా రెస్ట్ తీసుకోక,దాని రూం సర్దాల్సిన అవసరం నీకేంటి? అదే సర్దుకుంటుంది, ఇబ్బందైతే తనకి తెలుస్తుంది కదా" అని చిద్విలాసం గా ఒక నవ్వు.ఒళ్ళు మండిపోయింది ఆయన అలా నవ్వుతూ ఇచ్చిన సలహాకి.

చూస్తుండగానే రెండు వారాలు గడచిపోయాయి.కొత్త ఉద్యోగం లో జాయిన్ అయ్యాను.కొత్త వాతావరణం,కొత్త మనుషులు,అంతా కొత్తే.నాకు బాస్ మాత్రం ఈ సారి కూడా ఒక లేడీ. కొత్త లేడీ బాస్ పేరు జేన్. ఇంక రెండు సంవత్సరాలలో రిటైర్ అయ్యే వయస్సు ఆవిడ. శ్రద్దగా పని నేర్చుకుంటూ, చేసుకుంటూ, కొద్ది రోజులలోనే దగ్గరయ్యాను ఆవిడకి.ఇంతకు ముందు ఉన్న అనుభవంతో అసలు వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడం కాని,అడగటం లాంటివేవి జరగలేదు మా మధ్య.అలా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక శుభముహుర్తాన ఆవిడ నాతోనే కాక నా ఇద్దరి కొల్లీగ్స్ తో అన్న మాటలకి నేను విస్తుపోయాను.అసలు ఈ తెల్ల వాల్లందరు ఒకటేనా?వీళ్ళందరి అలోచనలు ఇలాగే ఉంటాయా?ఏదో పోడిచేద్దామని ఈ దేశం పరిగెట్టుకుని వచ్చింది ఇలాంటి వారి మధ్య జీవించడానికేనా లాంటి ప్రశ్నలు వేసుకున్నాను నన్ను నేనే!

(ఆఖరి భాగం రేపటి పోస్ట్ లో!)

Monday, March 11, 2013

లేడీ బాస్-1




పరాయి దేశంలో ఉద్యోగం లో చేరిన మొదటి సంవత్సరం అది.పనే దైవంగా,తిండి,తిప్పలు కూడా పట్టించుకోకుండా,కంప్యుటర్ ముందు ఉదయాన్నే దించిన తల బాస్ తో మాట్లాడుతున్నప్పుడు,మీటింగ్స్ లో తప్ప ఎత్తకుండా,రాత్రి,పగలు తేడా లేకుండా పని చేసిన రోజులవి.చేతిలో ఉన్న పని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకోకపొతే,తట్టా,బుట్టా సర్దుకోమని చిరునవ్వుతో మర్యాదగా చెప్పేస్తారని తెలుసు కాబట్టి,చిన్నప్పుడు చదువుకున్న సంత్/సాధువు కబీర్ గారు రాసిన "కల్ కరే సో ఆజ్ కర్,ఆజ్ కరే సో అబ్"అన్న దోహా/కవితాసారం అనుక్షణం గుర్తుకు తెచ్చుకుని ఆ విధంగానే నడుచుకునేదాన్ని.

తను చెప్పిన పని కంటే రెట్టింపు పని చేసే గాడిద దొరికిందన్న సంబరం తో మా (తెల్ల) లేడి బాస్ తెగ మెచ్చుకునేది నన్ను ఆ రోజుల్లో.మెచ్చుకోవడం వరకేనా...అంటే అబ్బే,కాదండోయి..ఆవిడ నాతో పాటు పని చేస్తున్న ఒక ఫిలిఫెన్స్ అబ్బాయికి ఒక రోజు తట్టా,బుట్టా సర్దుకోమని చెప్పేసింది.నేను చేసిన తప్పేంటి,నువ్వు చెప్పిందల్లా చేసా కదా అని బేలగా అడిగాడు మా లేడి బాస్ ని."చెప్పిన పని మాత్రమే చేస్తున్నావు,అదే అదే పాయింట్"అని నవ్వింది మా బాస్.ఆ నవ్వులో అంతరార్ధం ఏమిటో అర్ధం కాక,బిక్క మొఖం వేసుకుని అందరి దగ్గరా సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు నా సహుద్యోగి.
 
మా టీంలోనే నాకంటే ఉద్యోగానుభవం ఉన్న తోటి భారతీయునికి మాత్రం విషయం అర్ధమయ్యి,నన్ను ఒక రూం లోకి లాకెళ్ళి,"ఇదిగో అమ్మాయి,కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్న సామెత విన్నావా?"అని అడిగాడు.బిక్క మొఖం వేసుకుని తల అటు,ఇటు తిప్పాను."ఛల్ విసుగు తెప్పించకుండా చెప్పు,అర్ధం అయ్యిందా లేదా?అలా అడ్డంగా తల ఊపితే అర్ధం అయ్యిందనా,లేదనా?"అని గద్దించాడు.అయ్యిందన్నాను."నువ్వు ఉద్యోగం చేసుకో తప్పు లేదు.తోటి ఉద్యోగుల ఉద్యోగాలతో ఆడుకోకు,ఎంత పని చెపితే అంత పని చేసి ఇంటికి ఛల్!అంతే కాని తగుదునమ్మా అని నీ బాస్ చెప్పని పనులన్ని చేసావో,మర్యాద దక్కదు.నువ్వు గాడిదలా పని చేస్తున్నావని,అందరూ అలాగే చెయాలని లేదు కదా?ఇలా ఇంకోసారి ఇంకొకరి ఉద్యోగం తో ఆడుకోకు"అని ఇచ్చాడు వార్నింగ్.చిన్నప్పటి నుంచి చెప్పిన పని చెయ్యకపోతే తిట్ట్లు తినడం అలవాటు కాని,ఇలా మా బాస్ నోరు ఎత్తకుండానే రేపు నాకేమి పని చెపుతుందో తెలుసుకుని పని చెయ్యడం తప్పు అన్న ఆతోటి భారతీయుడంటే బొలెడంత కోపం ముంచుకొచ్చేసింది నాకు.అలా ఎందుకు చెప్పాడో ఆ పెద్దమనిషి అని కొద్దిగా అలోచించి ఉంటే గీత బోధిస్తున్న శ్రీ కృష్ణుడిలా అతను కనిపించేవాడేమో..కాని ఆ రోజుల్లో అందరి వలస పక్షుల్లాగే నా గూడు మాత్రమే నాకు ముఖ్యం అనుకుని,పెద్దగా అతని మాటలు నేను పట్టించుకోలేదు.

ఇక్కడ మా లేడి బాస్ గురించి కొంచెం చెప్పాలి.ఆవిడ పేరు డోన్నా-అమెరికన్, పెళ్ళి చేసుకున్నది జెర్మన్ని.ఆవిడకు ఇద్దరు కూతుళ్ళు.ఇద్దరు టీనేజర్లు-హైస్కూల్ లో చదువుకునే వారు.అద్భుతమైన అందగత్తె ఆవిడ.నలభయి ఐదు సంవత్సరాల వయసున్నా అలా కనిపించేది కాదు.ఎంతో చక్కగా డ్రెస్స్ చేసుకునేది.మేకప్ ఆవిడ అందాన్నిరెట్టింపు చేసేది.ఆవిడను ఆరాధనాపూర్వకం గా చూస్తూ,ఇలా హుందాగా చక్కగా ఉండాలి అని ఆ రోజుల్లో లెక్కలేనన్ని సార్లు అనుకునేదాన్ని.నాకు,ఆవిడకు కొద్ది రోజులకు చనువు పెరిగి,అప్పుడప్పుడు మధ్యానం లంచ్ కి కలిసి వెళ్ళడం జరిగేది.ఆఫీస్ లో,వర్క్ విషయంలో ఎంత కటువుగా ఉండేదో,ఆఫీస్ పార్టిస్ లో,లంచ్ కి వెళ్ళినప్పుడు అంతే సరదాగా ఉండేది.

అప్పుడే కిండర్గార్డెన్ లో అడుగుపెట్టిన నా కూతురి గురించి మురిపెంగా సమయం దొరికినప్పుడల్లా డొన్నా తో చెప్పేదాన్ని.నా కూతురు ఒక పిచ్చి గీత గీసినా,ఒక్క కొత్త పదం నేర్చుకున్నా,ఒక స్నేహితురాలి  గురించి మాట్లాడినా,ఆఖరికి స్కూల్ కి తీసుకెళ్ళిన లంచ్ బోక్ష్ లో లంచ్ మొత్తం తినేసినా అబ్బురమే నాకు.ఆ రోజుల్లో "అమ్మా,అయి లవ్ యు సో మచ్"అన్నప్పుడుల్లా మురిసిపోయేదాన్ని.డోన్నా తో లంచ్ కి వెళ్ళినప్పుడల్లా అవే కబుర్లు చెప్పేదాన్ని.పాపం చెప్పినవన్ని ఓపికగా వినేది, అప్పుడప్పుడు "lovely"," so cute" అని కూడా అనేది.తను మాత్రం భర్త గురించి అప్పుడప్పుడు కొన్ని విషయాలు చెప్పేది కాని,ఎప్పుడు తన కూతుళ్ళ గురించి మాట్లాడేది కాదు.ఎప్పుడన్నా నేను అడిగినా...నిట్టూర్చేది,కాని ఎక్కువగా ఏమి మాట్లేది కాదు వారి గురించి.

అలా ఒక మూడు సంవత్సరాలు గడిచిపోయాయి.ఒక శుక్రువారం రోజున డోన్నా లంచ్ కి వెలదామా అని అడిగింది,సరే అని ఇద్దరము వెళ్ళాము.ఆవిడ ఎప్పుడు తినే గడ్డి గాదం (salad) తెచ్చుకుని తింటూ,మాట్లాడసాగింది. ఆ రోజు మా సంభాషణ పూర్తి ఆయ్యాక,నాకు నోట మాట రాలేదు.మొదటి సారి నేనెంతో ఆరాధించే డోన్నా మీద అస్సయం వేసింది.అప్పటి వరకు ఆవిడకు మనస్సులో వేసిన పెద్ద పీట ని తీసేసాను.ఇచ్చిన పనులు చెయ్యడం తప్ప,నెమ్మదిగా ఆవిడతో మిగతా ఇంటెరాక్షన్ తగ్గించేసాను.

అలా కొన్ని సంవత్సరాల తరువాత,ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఇంకో ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి నిశ్చయించుకుని అదే విషయం డోన్నాకి చెప్పాను.సహజంగానే బాధపడింది,ఉండిపొమ్మని అడిగింది...లేదు, నిర్ణయించుకున్నా..ఇక్కడ పెద్ద ఎదుగుదల లేదు అని చెప్పాను.సరే అంది,ఫేర్వెల్ల్ లంచ్ కి వచ్చింది.అప్పుడు కూడా పొడి పోడిగా మాట్లాడాను తప్ప,అసలు డోన్నా తో సరిగ్గా మాట్లాడకలేకపోయాను.ఆ రోజు ఒక కోలీగ్ అడిగింది."ఒకప్పుడు నాలుగు మాటలు మాట్లాడితే అందులో మూడు నీబాస్ గురించి మాట్లాడేదానివి,ఇప్పుడు ఏమయ్యింది? డోన్నా  నిన్ను  మెత్తగా చివాట్లు పెట్టిందా?"అని కూపీ లాగాలని ప్రయత్నించింది. విషయం దాటేసి,గుడ్ బై చెప్పి ఆ ఆఫీస్ తో రుణం తీరిపోయింది అనుకుని ఇంటి ముఖం  పట్టాను.

(తరువాయి నెక్ష్ట్ పోస్ట్ లో)

Thursday, March 7, 2013

Happy Women's day



అమ్మా,చెల్లి,అక్క,కూతురు,కోడలు,భార్య,స్నేహితురాలు,ప్రియురాలు,అమ్మమ్మ, నానమ్మ, అత్తయ్యా, వదిన, పిన్ని, పెద్దమ్మ ...

ఎలా పిలిచినా సరే....
అందరి జీవితాలలోను అందమైన రంగులు నింపేవారు స్త్రీలు.

మహిళా దినోత్సవం సంధర్భంగా మహిళలందరికి శుభాకాంక్షలు!