Friday, July 20, 2012

తాళపత్ర గ్రంధాలు-నమ్మలేని నిజాలు



భవిష్యత్తు గురించి చెపుతారు జ్యోతిష్కులు అంటారు కదా?నేను ఇప్పటికి మరచిపోలేని సంఘటన ఒకటి జరిగింది నా జీవితం లో.చిన్నపుడు నన్ను ఎవరన్నా నువ్వు దేవుడిని నమ్ముతావా  అంటే నాకు తెలీదని చెప్పేదాన్ని.ఒక నిర్ధిష్టమైన అభిప్రాయం లేకుండా ఉండేదాన్ని.ఒక్కోసారి ఉన్నాడనిపించేది. ఒక్కోసారి లేడేమో అని సందేహము కలిగేది.అలోచిస్తూ మాత్రం ఉండేదాన్ని. అమ్మ ఎప్పుడూ చెప్పేది..మనుషులలో మంచితనమే దేవుడు...సమాజం లో మనుషులు తప్పులు చెయ్యకుండా ఎదో ఒక భీతికి కట్టుపడి ఉండాలని దేవుడు అన్నది సృష్టించారని చెప్పేది. 

ఒక రోజున విజయవాడ లో ఎవరో మడ్రాస్ నుంచి వచ్చి ఏవో తాళపత్ర గ్రంధాలు చూసి జ్యోష్యం చెపుతున్నారు అని తెలిస్తే,వినగానే కొట్టి పాడేసాను..కాని ఒక ఫ్రెండ్ చెప్పిన కొన్ని విషయాలు తెలుసుకున్నాక అవి నిజమో , కాదో తెలుసుకోవాలని ఆకాంక్ష కలిగింది.నేను కూడా అప్పాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాను.

ఒక పాత ఇంటిలో ముగ్గురు తమిల్ వాళ్ళు ఉన్నారు. అందరు మగవారే.ఫీస్ Rs.100.Date of birth అడిగారు. కొన్ని గ్రంధాలలోంచి ఒకటి తీసి,కొంచెం తిరగేసి..నీ పేరులో మూడు అక్షరాలు ఉన్నాయి.మొదటి అక్షరం "శ్రీ" తో మొదలౌతుంది కర్రెక్టేనా అని అడిగారు.తేరుకోడానికి సమయం పట్టింది..కాని ఇంతలో అనుకున్నా permutations and combinations ఎన్ని చేస్తారో చూదాము అని ఎదురుచూసాను. మరునిమిషంలో నా పూర్తి పేరు చెప్పారు.కాళ్ళ కింద భూమి కదిలిపోయిందా అనిపించింది..వెంటనే నా కుటుంభసభ్యుల పేర్లు కూడా చెప్పారు. ఇంక నాకు ముచ్చెమటలు పట్టి ,మొదటి సారిగా భయ్యం అంటే ఏంటో తెలిసింది..నా పరిస్థితి చూసి ఆయన అడిగారు...continue  చెయ్యనా అని, నాకు ధైర్యం లేదు ఇంక...అయినా సరే అని అక్కడే ఉండిపోయాను..ఒక అరగంట నా past, present, future గురించి చెప్పారు. అన్నీ record చేసి ఇచ్చారు. పాస్ట్ అంతా కళ్ళకు కట్టినట్టు అన్ని నిజాలే..ప్రెసెంట్ గురించి చెప్పినవి నిజాలే...అప్పటిలో future గురించి చెప్పినవి నిజమో కాదో తెలీదు కదా..కాని ఇప్పుడు చూస్తే చెప్పినవి జరగకపోవడం అన్నది లేదు.!! ఇప్పటికి నాలో ఉన్న తర్కం..నమ్మొద్దు అని చెపుతున్నా..కళ్ళతో చూసినది, అనుభవించినది ఎలా నమ్మకుండా ఉండగలను? అప్పుడే ఆయన చెప్పారు..నువ్వు దేవుడిని పూర్తిగా నమ్మటం లేదు..నీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన ఫలానా వారికి సంభందించి జరుగుతుంది..ఆ రోజు నువ్వే నమ్ముతావు..అని..కొట్టిపారేసాను ఆ రోజు..

నిజమయ్యింది తరువాత...

దేనిని నేను గుడ్డిగా నమ్మను.తరువాత అసలు నా వివరాలన్ని వాళ్ళకి ఎవరన్నా అందించిన వారున్నారేమో అని కూడా inquiry చేసాను..ఊహూ..ఆ chance లేదు... మరి ఎలా సంభవం అది? ఏమో!!! కాని నేను రాసిన ఏ ఒక్క సంఘటన కల్పితం కాదు. 


Thursday, July 19, 2012

Tuesday, July 17, 2012

పుట్టిన రోజున తిట్లు-అవే దీవెనలు!


హడావిడిగా ఇంట్లో అడుగుపెడుతూనే స్కూల్ బాగ్ విసిరేసి.."అమ్మా..అమ్మా."అని గట్టిగా అరిచినంత పని చేసింది శ్రేయ."ఏంటా అరుపులు? కొంచెం గొంతు తగ్గించు"అంటూ లోపల నుంచి వచ్చింది ప్రియ."నేను వాలంటీరింగ్ కి వెళ్ళాలి, టైం లేదు, నాకు ఆకలిగా కూడా ఉంది"అని సమాధానం ఇచ్చింది శ్రేయ."ఐదు నిమిషాలు ఆగు,ఏదన్నా చేసిస్తాను."అని ఆ పనిలో పడింది ప్రియ.ఆ రోజు శ్రేయ పదహారవ పుట్టిన రోజైనా స్కూల్ కి, తరువాత ప్రతి బుధవారం చేసే వాలంటీరింగ్ కి వెళ్ళడం తప్పలేదు. ఒక్క రోజు స్కూల్ మానినా తరువాత కొన్ని రోజులుగా పెరిగే చదువు భారం తలచుకుని ఒక్క రోజు కూడా స్కూల్ మానడానికి ఇష్టపడదు శ్రేయ.అలాగే వాలంటీరింగ్ కూడా మానడానికి ఇష్టపడదు.శ్రేయ ని హాస్పిటల్ దగ్గర దించుతూ అంది ప్రియ"శ్రేయా,ఎనిమిదింటికల్లా వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాము నేను,నాన్న.డిన్నర్ కి వెళదాము"అని."సరే"అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది శ్రేయ.శ్రేయ రాకకై ఎదురుచూస్తూ గడిపింది ఆ సాయంత్రం ప్రియ.అందరు పదహారవ పుట్టిన రోజు ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు. శ్రేయ గట్టిగానే చెప్పింది తల్లితండ్రులిద్దరికి,తనకలాంటివి నచ్చవని.చేసేదేమి లేక ఆ రోజు డిన్నర్కి శ్రేయకి ఇష్టమైన రెస్టారంట్ కి తీసుకెళ్ళటానికి నిశ్చయించుకుంది ప్రియ.

హాస్పిటల్ దగ్గర అసహనంగా ఎదురుచూస్తుంది కూతురి కోసం ప్రియ.టంచనుగా ఎనిమిది కొట్టగానే బయటికి వచ్చే శ్రేయ ఆ రోజు ఇంకా బయటకు రాలేదు.అరగంట దాటినా శ్రేయ హాస్పిటల్ నుంచి బయటకు రాకపోవడంతో అసహనంగా ఒక టెక్ష్ట్ మెస్సేజ్ కొట్టింది శ్రేయ కూతురికి.రిప్లై రాలేదు.కొద్దిగా భయ్యం వేసింది ప్రియకి.ఇలా ఎప్పుడు జరగలేదే..ఇంత ఆలశ్యం ఎందుకయ్యిందా అని కారు దిగి,హాస్పిటల్ వైపు వడి,వడిగా  అడుగులు వేయసాగింది శ్రేయ.ఇంతలో సెల్ మోగింది.నంబర్ చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది."ఎందుకు ఇంత లేట్?వర్క్ ఇంకా ఉందా"అని అడిగింది ఫోన్ తియ్యగానే ప్రియ.తల్లి గొంతు వినగానే బావురుమంది శ్రేయ.విషయం అర్ధం కాక,కూతురు ఎందుకు ఏడుస్తుందో తెలియక కంగారు పడిపోయింది ప్రియ.ఇంటికి వెళ్ళిపోదాము,ఇంక డిన్నర్ కి వద్దు అని ఏడుస్తూనే చెప్పింది శ్రేయ.

ఇంటిలోకి అడుగుపెట్టాక శ్రేయ కొంచెం శాంతించాక విషయం కనుక్కుందాము అని ఆగింది ప్రియ.శ్రేయ ఒక పేరు మోసిన హాస్పిటల్ లో పేషంట్ సప్పోర్ట్ సర్వీసెస్ విభాగంలో వాలంటీరింగ్ చేస్తుంది.వారానికి నాలుగు గంటలు పని చెయ్యాలి. పేషంట్స్ ని డిస్చార్జ్ చెయ్యడం..వాళ్ళకి పువ్వులు అవి ఇచ్చి,వారితో మాట్లాడడం,వారికి కావాల్సినవి తెచ్చి ఇవ్వడం.,లాబ్స్ కి పేషంట్స్ బ్లడ్ సాంపల్స్ తీసుకెళ్ళడం లాంటి పనులు చెయ్యాలి.ఒక్కో రోజు బాగా అలసిపోయి ఇంటికి వచ్చిన రోజులు కూడా ఉండేవి.హాస్పిటల్ చాలా పెద్దది కావున,ఒక్కొక్క విభాగం చాలా చాలా దూరం గా ఉంటాయి.నడిచి నడిచి కాళ్ళు నొప్పి అని కూడా అప్పుడప్పుడు తల్లికి చెపుతుంది శ్రేయ. అయితే ఏ రోజున నేను వెళ్ళను అనేది కాదు, ఎంతో ఇష్టం గా వెళ్ళేది.

నెమ్మదిగా తనను తాను సంభాలించుకుని జరిగింది చెప్పసాగింది శ్రేయ.ఆ రోజు సుమారుగా 7:30కి ఒక పేషంట్ ని డిస్చార్జ్  చెయ్యాల్సి రావడంతో పేషంట్ ని నర్స్ వీల్ చైర్ లో కూర్చోపెడితే అతనితో కబుర్లు చెబుతూ హాస్పిటల్ బయటికి తీసికెళ్ళింది శ్రేయ. పేషంట్ తాలూకా ఇద్దరు బంధువులు వచ్చి,కారు హాస్పిటల్ ద్వారానికి దగ్గరగా తెచ్చారు. చలి కాలం, స్నో పడుతుంది ఆ రోజు. పేషంట్ ని నెమ్మదిగా వీల్ చైర్ లోంచి లేపారు ఇద్దరు బంధువులు.ఇంతలో బంధువులలో ఒకరు కారు డోర్ అన్లాక్ చేసానా అని పేషంట్ ని వదిలి కారు డోర్ దగ్గరకి వెళ్ళగా పేషంట్ బరువైన మనిషి కావడం వలన జారిపోయి కింద పడిపోయాడు. రెప్ప పటులో జరిగిపోయింది అంతా! వెంటనే పేషంట్ ని పట్టుకున్న అతను శ్రేయ మీద విరుచుకు పడ్డాడు...అంతా నీ వల్లనే..పడిపోతున్న మనిషికి చేయూతను ఇవ్వలేదు అని గట్టిగా దుర్భాషలాడడం మొదలుపెట్టాడు.శ్రేయ పేషంట్ పడిపోతుంటే ఒక్క ఉదుటున ముందుకు ఉరికింది కాని,ఇంతలో ఎన్నోసార్లు హాస్పిటల్ మేనేజ్మెంట్ చెప్పిన రూల్స్ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. ఎట్టి పరిస్థితులలోను పేషంట్ ని వాలంటీర్స్ హాస్పిటల్ బయటికి వచ్చాక టచ్ చెయ్యకూడదు. పేషంట్ తరుపు వారు వుంటారు,వారిదే పూర్తి బాధ్యత పేషంట్ ఒక్కసారి హాస్పిటల్ బయటికి వచ్చాక. హాస్పిటల్ లో ఉన్నప్పుడు కూడా  పేషంట్ ని ఎక్కువగా ఫిసికల్ గా టచ్ చెయ్యకూడదు అన్నది చాలా ముఖ్యమైన రూల్ .మొట్టమొదటి వాలంటీరింగ్ మీటింగ్ లోనే చెప్పారు హాస్పిటల్ వారు.దేనినైనా సహిస్తారు కాని,ఒక్కసారి రూల్ అతిక్రమిస్తే మాత్రం చాలా త్రీవ్రంగా పరిణామాలు ఎదురుకోవల్సి వస్తుంది హాస్పిటల్ మేనేజ్మెంట్ నుంచి అని శ్రేయకి తెలుసు.

అది గుర్తుకువచ్చి వెంటనే శ్రేయ వెనక్కి వెళ్ళిపోగా,పేషంట్ బంధువు కోపానికి బలి అయిపోయింది.అసలే నల్లవాడు(ఆఫ్రికన్) కావడంతో ఆజానుబాహుడైన అతను నోటికి వచ్చినట్టు తిట్టడంతో శ్రేయ కి ఏమిచెయ్యాలో తెలియక అలా నోట మాట రాక ఉండిపోయింది.అతను తిడుతూనే ఉన్నాడు.అసలే స్నో పడుతూ ఉండటం వలన,జారిపోయిన పేషంట్ కొద్దిసేపు వరకు కొలుకోలేక పోయాడు.జనం చేరారు,అతనిని మళ్ళీ హాపిటల్ లోకి తీసుకుని వెళ్ళారు.శ్రేయకి తను చేసినది తప్పో,ఒప్పో అని అలోచనే కాక,ఇప్పుడు ఆ పేషంట్ కి ఏమౌతుందా అన్న భయ్యం కూడా పీడించసాగింది.ఆ ఆఫ్రికన్ అతను శ్రేయను తిట్టడం మానలేదు.చాలా పెద్ద గొంతుతో హాస్పిటల్ అంతా వినిపించేలా కేకలు వేస్తూనే ఉన్నాడు.శ్రేయ బిక్కచిక్కిపోయి అందరి ముందు తిట్ట్లు తినడమే కాక,తప్పు చేసానా అని భయ్యం తో వణికిపోసాగింది.ఇంతలో గొడవంతా తెలిసి వాలంటీరింగ్ అధికారి ఒకరు వచ్చి,జరిగినదంతా చెప్పమని అడగగా శ్రేయ జరిగినది అంతా చెప్పింది.ఒక పుస్తకం తెచ్చి చెప్పినదంతా రాసి సంతకం పెట్టమన్నాడు ఆ అధికారి.ఇంటికి వెళ్ళు ప్రస్తుతానికి,రేపు నీకు కాల్ వస్తుంది వాలంటీరింగ్ హెడ్ దగ్గర నుంచి,అని చెప్పి పంపించేసాడు.అతను నువ్వు చేసినది సరి అయిన పనే,పర్వాలేదు వెళ్ళు, రేపు మాట్లాడుకోవచ్చు అన్నాడు.

జరిగినదంతా తల్లితండ్రులకు చెప్పి బోరుమని ఏడ్చింది శ్రేయ.ఎంతో అపురూపం గా ఒక్క మాట కూడా అనకుండా శ్రేయని పెంచారు తల్లితండ్రులిద్దరు.నెమ్మదిగా తనని ఊరుకోబెట్టారు.ఎంత బతిమాలినా భోజనం చెయ్యనని భీష్మించుకున్న అమ్మయిని చూసి శ్రేయ తండ్రి మనస్సు బాధతో విలవిలలాడింది.ఆ రోజు రాత్రి ప్రియ తొ ప్రియ భర్త,"ఎందుకు ప్రియా,శ్రేయకు ఈ వాలంటీరింగ్ అవి అవసరమా?బుధ్ధిగా చదువుకుంటుంది కదా?ఇవన్నీ ఏమిటసలు?"అని అడిగాడు.ఇక్కడ అందరు చిన్నపటి నుంచి ఎక్కడో ఒకచోట ఇలా తోచిన వాలంటీరింగ్ చెయ్యడం చూస్తూనే ఉన్నారు కదా? Giving back to the community concept మనకి తెలియనిదా? అందులోను శ్రేయ తనే ఇష్టపడి చేస్తుంటే వద్దు అని ఎలా చెపుతాము అని జవాబు ఇచ్చింది ప్రియ.

ఆ రోజు ఆ ఇంట్లో ఎవ్వరికి నిద్ర పట్టలేదు. అందులోను పదహారవ పుట్టిన రోజున శ్రేయకు ఇలా జరగడంతో ప్రియకెందుకో చాలా బాధగా అనిపించింది.మరునాడు ఆఫీస్ లో ఉండగా ప్రియకి ఫోన్ వచ్చింది హాస్పిటల్ నుంచి.ఫోన్ ఎత్తగానే వాలంటీరింగ్ హెడ్ మాట్లాడసాగింది.శ్రేయ తమ హాస్పిటల్ తరపున వాలంటీర్ గా పని చేస్తున్నందుకు గర్వపడుతున్నామని,రాత్రి జరిగిన సంఘటనలో తను రూల్స్ కి అనుగునంగా నడుచుకుందని, అవేశంతో ఉన్న పేషంట్ బంధువుకి ఎదురు ఒక్క మాట కూడా చెప్పకుండా మళ్ళీ హాస్పిటల్ కి వచ్చి జరిగింది జరిగినట్టు చెప్పి వెళ్ళిందని,పొగుడుతూనే ఉంది.భారమైన మనసుతో సరే అని చెప్పి ఫోన్ పెట్టేసింది ప్రియ.సాయంత్రం ఇంటికి రాగానే కూతురు మౌనంగా ఉండడం చూసి,దగ్గరగా వెళ్ళి తనకి వచ్చిన ఫోన్ కాల్ గురించి చెప్పింది ప్రియ కూతురికి.శ్రేయ ఒక చిన్న చిరునవ్వు నవ్వి,"నాకు కూడా మైల్ వచ్చిందమ్మా.You don't worry, I am alright" అని సమాధానం చెప్పింది.నవ్వుతున్న కూతురుని చూడగానే మనసులో బాధ అంతా ఎవరో తీసేసినట్లు అనిపించింది ప్రియకి.ఆ రోజు రాత్రి భోజనం చేస్తూ సరదాగా కబుర్లు చెపుతున్న కూతురిని చూసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు ప్రియ భర్త.మరి ఇంక మానేస్తావా వాలంటీరింగ్ అని తండ్రి అడిగితే "No way dad!! పాపం ఆ పేషంట్ వాళ్ళ బంధువు అతనికి ఏమయిపోతుందా అన్న కోపం లో నన్ను తిట్టాడు కాని, నా మీద అతనికేమి కోపం?"అని అంటున్న కూతురుని చూస్తూ ఉండిపోయింది ప్రియ.

తరువాత కొద్ది రోజుల్లోనే ఆ హాస్పిటల్ వాలంటీరింగ్ department మొత్తానికి student coordinator గా ఎన్నుకున్నారు శ్రేయని. గత ఐదు సంవత్సారలుగా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది శ్రేయ ఆ హాస్పిటల్ లో!ఈ తరం పిల్లలని చూసి గర్వ పడాల్సిందే అనుకుంది ప్రియ. 

Monday, July 2, 2012

ఈనాటి పెళ్ళిచూపులు



రాధకి, వేణుకి పెళ్ళిచూపులు
డేటింగ్  అని పెట్టుకున్నారు  పేరు దానికి వాళ్ళు!
ఏదో ఒకటి, ఒకరికి ఒకరు నచ్చితే చాలు ,అన్నారు పెద్దలు
ఆ విషయం తెలపాలంటే, ఆగాలన్నారు జంట ఇంకో పది నెలలు!



పది నెలలా.. అని విస విసలాడారు మధ్యవర్తులు
ఎదురు చెప్పలేక జంటకి, ఊపారు తలలు!
హోటల్లు, సినిమాలు అని జంట తిరిగారు షికార్లు
గంటలు గంటలు ఫొన్ లో చెప్పుకున్నారు వారు కబుర్లు!



మనస్సు ఊరుకోక అన్నారు తల్లితండ్రులు
పంతులుగారిని పిలిపించి చూస్తామని పెళ్ళిముహుర్తాలు!
తొందరేమిటని ప్రశ్నించారు రాధావేణులు
మా పరిచయం ఇప్పుడే అయ్యింది మొదలు!



ఔరా.. అని వేసుకున్నారు అందరు ముక్కున  వేళ్ళు
చెప్పొద్దన్నారు జంట, పాత చింతకాయ కబుర్లు!
కలిసాయో లెదో చూద్దామనుకున్నారు పెద్దలు జతాకాలు
పనిలో పనిగా తీరిపోతాయిగా అన్ని సందేహాలు!



కలిసిన జాతకాలను చూసి పెద్దలు మురిసి కన్నారు కలలు
చేసారు జంట వారు కన్న కలలు కల్లలు!
కలవలేదని తేల్చి చెప్పారు వారి అభిరుచులు
చేసేదేమి లేక మూసుకున్నారు పెద్దలు నోళ్ళు!



పరిచయం లేనప్పుడూ ఒకరినొకరు తెల్సుకోవాలన్న తెగులు
తెలుసుకున్నాక సరి అయినవారేనా సహజీవనానికి అన్న దిగులు!

నిర్ణయం తీసుకోలేక వారు పడే తర్జన బర్జనలు
అవసరమా పెళ్ళి చేసుకునే జంటలకు ఇన్ని అగచాట్లు!



అపార్ధం చేసుకోకండి నన్ను, ఓ పెళ్ళీడుకొచ్చిన పిల్లలూ
తీసుకోవాలి  మీరు సరి అయిన నిర్ణయాలు!
హాయిగా వేసుకుంటారు పెద్దలు అప్పుడు కాలు మీద కాలు
అలా జరగన్నప్పుడు పరిగెత్తిస్తారు కదా  పెద్దల గుండెల్లో మీరు రైల్లు!