Showing posts with label స్వగతం. Show all posts
Showing posts with label స్వగతం. Show all posts

Thursday, July 25, 2013

దాంపత్యం



సుఖదుఖాలను పంచుకుంటూ,
సమస్యలను కలిసి ఎదురీడుతూ,
నిత్య కలహాలతో,
శ్రుతి మించని అలకలతో,
ప్రేమానురాగ ఆప్యాయతలతో,
ఒకరికొకరు తోడు-నీడ గా,బాసటగా,
ప్రాణస్నేహితులైన స్త్రీ, పురుషుల మధ్య బంధమే కదా...

కొన్ని వసంతాలు నిండిన దాంపత్యం!

Friday, July 5, 2013

ఆశ్చర్యం..తెలుగు సినిమా కూడా బాగుంటుందా?



రోజూ వర్షాలు, అప్పుడప్పుడు తూఫానులతో  ఈ వేసవి ఒక ఊపు ఊపుతుంది  మా స్టేట్ ని....దానికి తోడు వేసవి సమయంలో అతిధుల రాక పోకలు. మాకోసమైతే వంట తప్పించుకునేందుకు ఎన్నో కారణాలు వెదికే నేను, అతిధులు వస్తే మాత్రం, రోజుకి మూడుసార్లు తప్పదు  కదా మరి వంట గదితో స్నేహం? ఇకపోతే  యంత్రాల మీదే కాక అప్పుడప్పుడు రోడ్డు మీద పకృతిని చూస్తూ పరిగెడుతూనో లేక నడుస్తూనో వేసవి కాలం గడపడం కూడా నాకు ఇష్టం. బ్లాగ్స్ చూసి, రాసి నెల పైనే అయ్యిందా అనిపించింది నాకు. ఇకపోతే ఈ వేసవి కాలం, కొద్దిగా సినిమాల జోరు కూడా బానే ఉందని చెప్పాలి. హిందీ లో ఒక అర డజన్ సినిమాలు,  ఇంగ్లీష్లో కొన్ని అవేశం గా చూసేసాను. ఇంటికి వచ్చిన అతిధులతో మరీ 24 గంటలు మాట్లాడాలి అంటే కూడా ఇబ్బంది కదండి. పదండి సినిమాకి, అని చెప్పి వరుసగా హిందీ , ఇంగ్లీష్ సినిమాలు చూపించేసాను. తెలుగు మాత్రం ఊహు... నా వల్ల కాదు అని ఒక్కటి కూడా చూడలేదు, చూపించలేదు. 

ఇదిలా ఉండగా, అతిధులు వెళ్లాక, మాకు ఈ స్వాతంత్ర దినోత్సవం సెలవలు వచ్చేసాయి. ఈ సంవత్సరం చాలామందికి 4 రోజులు సెలవలు వచ్చాయి. సాధారణం గా ఇలాంటి సెలవలు వస్తే నాకు  హాయిగా న్యు యార్క్ - Time square  వీధుల్లో ముఖ్యం గా రాత్రి సమయంలో నడుస్తూ గడపడం అంతే మహా ఇష్టం. ఇంకేంటి అడ్డం? మరి వెళాదామా అని ఇంట్లో ప్రశ్న...ఊహూ..లేదు ఈ నాలుగు రోజులు వర్షం లేకుండా ఉంటే  నాకిక్కడే  గడపాలని ఉంది అని సమాధానమిచ్చాను. ఇంతలో స్నేహితురాలు ఒక సినిమా trailer పంపింది చూడమని...అది తెలుగు సినిమాది అని చూసి, పెదవి విరిచి, చూసాలే అని స్నేహితురాలికి సమాధానమిచ్చాను. నచ్చలేదా trailer అని మళ్ళీ ప్రశ్న. సరిగ్గా చూడలేదు, చూసి చెపుతానని దాటేసాను సమాధానం. తప్పకుండా చూడు అని చెప్పి ఫోన్ పెట్టేసింది. 


అంతగా చెప్పింది కదా అని సినిమా పేరేమిటా  అని వివరంగా చూసాను. ఒక చిన్న shock! "మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు" ....ఇదేంటి ఇలాంటిదే మొన్నీమధ్య ఒక తల తిక్క సినిమా "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" అని కదా వచ్చింది? ఆ సినిమాకి వచ్చిన హైప్ చూసి వెళ్ళి ఎంతో నిరుత్షాహపడడం నాకింకా గుర్తే....ఆ సినిమాకి పేరడీ అయ్యి ఉంటుంది, అని విరక్తి కలిగి, తెలుగు డైరక్టర్లను , వారు ఎంచుకుంటున్న ఈ సినిమా టైటిల్స్ కి ఒక నమస్కారం పెట్టి ఆ trailer చూడకుండా కసిగా స్నేహితురాలు పంపిన ఇమైల్ మూసేసాను. 

మళ్ళీ మరునాడే ఫోన్..."సినిమా కి వస్తావా , వెళదాము ఈ రాత్రి"  అని. "అయ్యబాబోయి నా వల్ల కాదు తల్లీ , నీకో దండం నన్ను ఒదిలెయ్యి ఈ సారి"అని బతిమాలాను. "అర్ధం అయ్యింది.. తమరు trailer చూడలేదు .....ముందు వెళ్ళి trailer చూడు. నీకు నచ్చుతుంది అని నాకు గొప్ప నమ్మకం" అంది. తప్పేట్టు లేదురా భగవంతుడా అని trailer చూసాను. నిజమే చాలా బాగుంది అనిపించింది. ముగ్గురి వ్యక్తుల కథ లా అనిపించింది. మనసులో చిన్న ఆశ, బాగుంటుందేమో అని...,వెంటనే తెలుగు సినిమాల మీద అంతకు ముందు ఏర్పరుచుకున్న బలమైన అభిప్రాయం ముందు ఆ చిన్న ఆశ సన్నగిల్లిపోయింది. అసలు ఏమాత్రం ఆశించకుండా, స్నేహితురాలి బలవంతం మీద వెళ్ళి ఈ రోజు చూసాను ఆ సినిమా.... "మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు" 

                   http://www.youtube.com/watch?v=LDCj7Zxs-y0
సినిమా పూర్తయ్యేటప్పటికి, మనసంతా ఆనందం... ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక "అందమైన కవిత" అని చెప్పాలి. ఈ సినిమా కథ మూడు ముక్కల్లో చెప్పొచ్చు... కాని సినిమా తీసిన విధానం, పాటల చిత్రీకరణ,సినిమాలో ప్రతి ఫ్రేం ఎంతో అందం గా ఒక చక్కటి గ్రీటింగ్  కార్డ్ లా ఉంటుంది. సున్నితమైన సంభాషణలు, సున్నితమైన భావాలు ఎంత అందంగా తెరకెక్కించాడో ఆ దర్శకుడు. ఇది అని చెప్పలేని భావమేదో నన్ను ఊపేసింది. వెరసి ఈ రోజు నేను చూసిన సినిమా ఒక గొప్ప కావ్యం అని అంటే అతిసయోక్తి కాదేమో!!!!!



ఇకపోతే ఈ సినిమా విజయవంతమయ్యే అవకాశం చాలా, చాలా తక్కువ. మగవారు  80% ఈ సినిమా లో ఎక్కువ సేపు కూర్చోలేరు...ఎందుకంటే  సున్నితమైన మనసున్న మగవారు చాలా తక్కువ కదండి? అమ్మాయి తన మానసిక సంఘర్షణ, తన ప్రేమ, తన భర్త గురించి మనకి చెపుతుంటే .......అలా రెండు గంటలు ఎలా గడిచాయో తెలియలేదు నాకు. పాటలన్ని ఎంతో బాగున్నాయి. పాత్రలు పోషించిన వారందరు చాలా బాగా చేసారు. ముఖ్య పాత్రలు మూడు. తండి పాత్ర, అక్క పాత్ర వేసిన వారు కూడా చాలా బాగా చేసారు. సినిమా అంతా కథ మీదే ఉంటుంది. Absolutely no commercial elements at all. అసలు deviation అన్నది లేదు story line నుండి..... నాకు effective gaa చెప్పటం చేతకాలేదనిపిస్తుంది...కాని మొత్తానికి తెలుగు సినిమా కూడా బాగుందండోయి అని గర్వం గా చెప్పుకోగలను అనిపించింది. మీరెవ్వరైనా ఈ సినిమా చూస్తే మరి మీ అభిప్రాయాలు పంచుకోవడం మరచి పోకండి. ఇంకెవ్వరైనా ఈ సినిమా రివ్యు  అందం గా రాస్తే చదవాలని కూడా ఉందండోయి.

Tuesday, June 18, 2013

ఒక సాయంత్రం!

Pic source : Google images

సాయం సమయం. వర్షం జోరుగా పడుతుంది.ఈ మధ్య చెప్పా పెట్టకుండా ముంబాయి మహానగరం లో వాన కురిసినట్టు,మా ఊరిలో కూడా ఎప్పుడు వాన పడుతుందో,ఎప్పుడు సూర్య భగవానుడు కరుణిస్తాడో చెప్పడం కష్టం గా ఉంది.అలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాను.రేడియో లో ఏదో చెత్త ప్రోగ్రాం వస్తుంది.ఈ మధ్య కొన్ని అంతర్జాల రేడియో ప్రొగ్రాంస్ వింటుంటే ఎందుకో అసలు నచ్చటం లేదు. RJ చేసేవారు,వారికి కాల్ చేసేవారు కూడా...అయినా మధ్యలో నాకెందుకు,రేడియో ఆపేస్తే పోలా?అనుకుని ఆపేసాను. అలోచనలు మళ్ళీ నన్ను చుట్టిముట్టాయి.వర్షం అంటే చిన్నపటి నుంచి నాకు చాలా ఇష్టం. వర్షంలో తడుస్తూ,బాల్యం లో ఆడుకున్న ఆటలు మరచిపోగలమా?

ఇంటికి చేరుకునేసరికి వాన తగ్గు ముఖం పట్టింది.ఇంట్లోకి వస్తూనే వేడి గా టీ పెట్టుకుని అలా సన్నటి వాన తుపర పడుతుంటే,కిటికిలో నుండి ి చూస్తూండిపోయాను.Gym ఎలాగు ఎగ్గొట్టాను కదా అని, అమ్మాయిని పిలిచి "వాక్ కి వెళదామా" అని అడిగాను."అమ్మో, నువ్వు వాక్ అని నన్ను కనీసం మూడో నాలుగో  మైల్స్  నడిపించేస్తావు..నేను రాను పో"అని సమాధానం వచ్చింది."అలా కాదు రా...నా మాట వినవు?ఈ రోజు నాకు తోడు ఎవ్వరు లేరు..ప్లీస్ రావా"అని బతిమాలడం మొదలుపెట్టాను.విసుగ్గా నా వైపు ఒక చూపు చూసి"నా వల్ల కాదమ్మా..ప్లీస్"అంది.అలోచించాను,టాలివుడ్ సినిమాలు చూడకపోయినా, తనకి ఉన్న బాలివుడ్ సినిమా మోజు నాకు ఆ క్షణం లో గుర్తుకు రావడంతో, నన్ను నేనే మెచ్చుకుని,ఇదిగో ఆ "జవాని..." అని ఏదో సినిమా ఈ శుక్రువారం వెళ్ళాలని అన్నావు కదా..నువ్వు ఇప్పుడు వాక్ కి రాకపోతే నేను సినిమాకి రాను...అంతే ఫైనల్...డిసైడ్ చేసుకో"అని వార్నింగ్ ఇచ్చేసాను.నా పాచిక తప్పక పారుతుందని వాకింగ్ షూస్ వేసుకోసాగాను."నువ్వేమి రానక్కర్లా..నా ఫ్రెండ్ జేనీ వస్తానని చెప్పింది..నువ్వు వెళ్ళు, నేను రాను" అని తెగేసి చెప్పింది. "ఔరా...ఆ జేనీకి ఏమర్ధమవుతుంది?డబ్బు దండగ"అని విసుక్కున్నాను.ముసి ముసి నవ్వులు నవ్వుతూ,"సబ్ టైటిల్స్ ఉంటాయిగా...అయినా పిచ్చి అమ్మా...ప్రేమ చిత్రానికి భాషతో సంబంధం ఉండదుగా...అలా అర్ధమయ్యి పోతుందంతే!"అని సమాధానం వచ్చింది.

 


ఇప్పుడెలా? ఒంటరిగా వెళ్ళచ్చు...కాని  ఎవరిదన్నా బుర్ర  తింటూ నడవటం లో ఆ హాయి వేరే కదా?స్నేహితురాలిని పిలవనా అనుకుంటు,ఇంతలో నా పెద్దరికం నన్ను ప్రశ్నించింది,"తల్లి మాటకు ఎదురు చెపుతుందా?రమ్మంటే కిక్కురుమనకుండా రావాలా వద్దా?మా చిన్నపుడు పెద్దవారు చెప్పిన మాటకి ఎదురు చెప్పామా?(అంటే డూ డూ బసవన్నలా తలాడిస్తూనే,ఎదురు చెప్పకుండా..వారు చెప్పినట్టు కాక, నా మనస్సు కి నచ్చినట్టే చాలా సార్లు నడుచుకున్నాననుకోండి.అయినా అవన్ని బయటికి చెప్పము కదా...). ఆఖరి అస్త్రం ప్రయోగించాను."అయినా ఈ మధ్య నువ్వు నా మాట వినటం లేదు,నా దగ్గర ఉండేదే మొక్కుబడిగా  మూడు లేదా రెండు వారాలు..ఆ కొద్ది రోజులు కూడా నాతో సమయం గడపవా..పోన్లే నీ ఇష్టం" అంటూ,వీధి గుమ్మం తలుపు తీసాను.నాకు తెలుసు విసవిసలాడుతూ నా వెనకాలే వస్తుందని.అనుకున్నట్టుగానే"వస్తున్నానుండు"అని ఒక అరుపు అరిచింది నా చెవులు చిల్లులు పడేలా.విజయగర్వంతో నవ్వుకున్నాను.ఈ తరం పిల్లలు మాట విననట్టే వుంటారు, కాని ప్రేమకి లొంగకుండా ఎక్కడికి పోతారు? 

ఇద్దరము జంటగా వీధిలో కి అడుగు పెట్టాము.ఇంతలో వాన చినుకులు మా మీద పడ్డాయి. వెంటనే అమ్మాయి "వాన పడుతుంది, వెనక్కి వెళదాము పద"అంది.ఆకాశం వైపు చూస్తూ నేను"లేదు,ఈ వాన ఎంతో సేపు ఉండదు, పైగా ఇంతకంటే జోరుగా కూడా కురవదు.నువ్వేమి మొక్క మొలిసిపోవు ,పద నడుద్దాము" అన్నాను. "నీకేమన్నా పిచ్చా?ఎవరన్నా వానలో వాకింగ్ చేస్తారా"అంటూ ప్రశ్నించింది.ఎవరు చేసినా,చెయ్యకపోయినా మనం చేద్దాము,వాన చినుకులు ఇలా మనల్ని చక్కగా ముద్దాడుతుంటే హాయిగా లేదు?"అన్నాను ఆ వాతావరణానికి మైమరిచిపోతు.వెంటనే సమాధానమోచ్చింది,"జలుబు చేస్తుంది, I don't want to catch cold" అని."ఈ మాత్రానికి జలుబు చెయ్యదు, ఛలో" అని తన చెయ్యి పట్టుకుని వాకింగ్ కి వెళ్ళిన ఇద్దరము గంటన్నర తరువాత ఇల్లు చేరుకునేసరికి మా బట్టలు వర్షం వలన పూర్తిగా తడిచిపోయాయి.ఇంట్లో శ్రీవారిని చూసి కబుర్లలో పడిపోయింది అమ్మాయి.నాకు మాత్రం ఆ వర్షం లో తడుస్తూ,అమ్మాయితో చిన్ననాటి కబుర్లు చెబుతూ,జీవితాన్నిఇప్పుడిప్పుడే చూస్తున్నా దాని మాటలు వింటూ,అపుడప్పుడు కొన్ని ఉచిత సలహాలేవో పాడేస్తూ,ఇరువరం కలిసి నడిచిన ఆ వాక్ మాత్రం గుర్తుండిపోతుంది.

Monday, March 18, 2013

లేడీ బాస్-ఆఖరి భాగం



ఇద్దరి లేడీబాస్ లతో నిత్యం ట్రెడ్ మిల్ల్ మీద పరిగెట్టిన అనుభవేమో,మా కొత్త బాస్ గారు నడిస్తే చాలు,పరిగెట్టద్దు అనడం చాలా వింతగా అనిపించింది.అదేనండి ప్రతి చిన్న దానికి హడావిడి పడుతుంటే,ఫర్వాలేదు నెమ్మదిగా చెయ్యమనేవారు.ఇలా అలోచించటం తప్పేమో కాని,"భగవంతుడా,ఇకపై నాకు ఎప్పుడు మగ బాసులనే ప్రసాదించు స్వామి" అని పైకి ఎవ్వరికి వినపడకుండా దేవుడిని కోరుకున్నాను కూడా."రాక్షషి,నువ్వు స్త్రీవే కదా,ఇలా అలోచించడం తగునా?"అని అంతరాత్మ మందలించిందనుకోండి,అది వేరే విషయం.నాతో పని చేసేవారందరితో కలివిడిగా ఉంటు,వారు ఇచ్చిన పని సరిగ్గ చేసారా,లేదా అన్న ఒక్క విషయం తప్ప ఇంకేమి పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు.చాలా మందికి నేను నచ్చాను,ముఖ్యంగా అంతకు ముందున్న వాళ్ళ బాస్ చండశాసనుడు అని పేరు గడించడటం కూడా దానికి కారణం అవ్వచ్చు.

నాతో పని చేసే అరుణ ఒక నెల రోజులు లీవ్ మీద వెళుతూ,నాతో ఒక అరగంట ముచ్చటించింది.ఆ సంభాషణలో తను ఎందుకు సెలవు పెట్టాల్సొచ్చిందో అన్న విషయం షేర్ చేసుకుంటూ,తొందరలో వీలైతే ఉద్యోగం మానేస్తాను అని కూడా అంది.అరుణ తన పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి చేసే ఉద్యోగం ఆటంకమౌతుందని,అది తనకి బాధ కలిగిస్తుందని చెప్పింది.యధాలాపంగా అడిగాను,ఎంత వయస్సు పిల్లలకి అని.ఇద్దరు కవలలు-ఇద్దరికి పదమూడు సంవత్సరాలు అని చెప్పగానే అనాలోచితంగానే అనేసాను,"Are you out of your mind?You don't need to sit at home now,after working all these years.This is the time,teen hormones kick in and you will go thru hell mentally.ఈ టైంలో  పిల్లలే ఒక వ్యాపకంగా ఇంకే వ్యాపకం లేకుండా ఉండడం అన్నది అంత తెలివైన పని కాదు అన్నాను.నా లెక్చర్ పూర్తవకముందే "అలాంటి అనుభవం నాకు ఉండకపోవచ్చు.My kids love my company"అని సమాధానమిచ్చింది.కొద్దిగా ఆ విషయం మీద డిబేట్ చేదామన్న అలోచన కలిగింది కాని,అంతకంటే ఎక్కువ తనతో ఆ విషయం పొడిగించటానికి నాకు తనతో అంత చనువు లేని మూలాన,ఆ సంభాషణ అంతటితో ఆపేసాను.నేను అనవసరంగా తన వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకున్నానేమో అన్న రవ్వంత బాధ నాలో కలిగింది.నెమ్మదిగా నా అలోచనలు గతం లోకి పరుగులు తీసాయి.

డోన్నాకి నాకు మధ్య ఒకనాడు లంచ్ లో జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది.ఆ రోజు డోన్నా ఎందుకనో ఎప్పుడు ఉండే మూడ్ లో లేదు. ఏమిటి విషయం అని నేను యధాలాపంగా అడిగాను."విసిగిపోతున్నాను ఇద్దరి అమ్మాయిలతో.ఒకరు నా మేకప్ వాడేస్తారు నా అనుమతి లేకుండా.ఇంకొకరు నా బట్టలు వాడుతున్నారు అనుమతి లేకుండా.ప్రతి చిన్న విషయానికి వాదనకు దిగుతారు.నాకు చాలా పెద్ద తలనొప్పిగా తయారయ్యారు ఇద్దరు.ఎప్పుడు ఇంట్లోంచి పోతారా అని ఎదురు చూస్తున్నాను.ఇంకో రెండు సంవత్సరాలు ఆగడం నా వల్ల కాదు.ఇప్పటికే విసిగిపోయి ఉన్నాను." అని అంది.ముద్దుగా, నా చుట్టూ తిరిగే అమ్మాయి రూపమే నాకు తెలుసు ఆ రోజుల్లో.అసలు డోన్నా తల్లేనా?నవమాసాలు మోసి కన్నది ఈమేనా? ఎలా మాట్లాడుతుంది ఇలా?ఇద్దరి కూతుళ్ళు ఎప్పుడు ఇల్లు వదిలి పోతారో అంటుందా?నా దిగ్బ్రాంతిని అణుచుకుంటూ అడిగాను అమాయకంగా"You don't love them? How can you talk like this?"అని.వెంటనే సమాధానం"Love does not mean clinging to them for life long.I have my own life.They should understand their limits.I just can't take them anymore." పిల్లలతో సంబంధం లేని పెర్సనల్ లైఫ్ ఏంటి ఈవిడకి? మతి ఏమన్నా పోయిందా అని ఆశ్చర్యపోతు నెమ్మదిగా అడిగాను."Once they leave your house for higher studies,don't you feel the void in your life"అని."Are you kidding?I have so many things lined up to do for the rest of my life." అంది. ఇక ఆవిడ నా దృష్టిలో మమతానురాగాలు లేని ఒక మనిషి గానే కాని తల్లిగా కనిపించలేదు.ఆ నిమిషంలో ఆవిడ వాడిన పదజాలం కాని,తనకంటూ ఒక లైఫ్ లేకుండా పోతుంది అని వాపోవడం చూసాక ఆవిడ మీద అప్పటివరకు ఉన్న ఆరాధ్యభావం పోయి,ఆవిడ మీద విముఖత కలిగింది.

అదే సంభాషణ మా మధ్య ఈనాడు జరిగితే,అలాంటి అనుభవాలు పూర్తిగా నాకు లేకపోయినా,నా అనుభవాలకి ఆవిడ అనుభవాలకి వ్యత్యాసం ఉన్నా, ఆవిడను నేను ఆ రోజుల్లో జడ్జ్ చేసినట్టు చేసేదాన్ని కాదేమో!అది మొదటిసారి,ఆఖరిసారి కాదు,నేను నా చుట్టూ ఉన్నవారిని జడ్జ్ చెయ్యడం.జేన్ విషయంలో కూడా అదే జరిగింది. జేన్ ఒక రోజు నాతో,ఇంకొందరితో అంది "నేను చాలా సంతోషంగా ఉన్నాను ప్రస్తుతం.నా భర్త, నేను,మా పనులు వీటితో తీరిక ఉండదు.నాకు నా పిల్లలిద్దరు చాలా దూరం గాఉన్నారు.Thank God!చీటికి మాటికి వాళ్ళు నా ఇంటికి రావడం నాకు నచ్చదు."అని.పిల్లల నీడ పడకూడదు అనుకుంటుంది ి అసలు ఈవిడ మనిషేనా అన్న ఏహ్య భావం అప్పట్లో నాకు కలిగింది.తనని కూడా జుడ్జ్ చేసాను.

మనం మన తల్లితండ్రులను చూసి నేర్చుకున్నది కావచ్చు,మన సంస్కృతి కావొచ్చుకాని చాలామంది భారతీయులు పిల్లలే జీవితం,వారే లోకంగా బ్రతికేవారే!అన్నీ వారికోసమే అని నిరంతరము వారి సుఖం,వారి సౌఖ్యానికి ఎక్కువగా పాటు పడేవారే. పాశ్చాత్య సంస్కృతిలో ఆడవారైనా కాని ,మగవారైనా కాని వారికంటూ ఉన్న అభిరుచులు, వారి హాబీలు,వారి ఇష్టాలు సాధారణంగా చంపుకోరు.బాధ్యతగా పిల్లలని పెంచి మంచి పొరులుగా తీర్చిదిద్దుతారు కూడా.కాని ఆ ప్రహసనంలో వారు తమని తాము అంకితం చేసేసుకోరు.అలాగే పిల్లల మీద మనకున్నంత ఇమోషనల్ డిపెండన్స్ కూడా ఉండదు వారికి.కొవ్వొత్తుల్లా కరిగిపోరు పిల్లల కోసం.చరమ దశలో వృద్దులైన వారిని చూడటానికి పిల్లలు రావటం లేదే అన్న బాధ కూడా తక్కువే వారికి.

ఆ మధ్య చూసిన"Amour"అనే సినిమాలో సన్నివేశం గుర్తొచ్చింది.ఇద్దరు వృద్దులైన భార్యాభర్తలు ఒకరికి ఒకరు తోడుగా నివసిస్తూ ఉంటారు.భార్యకి పక్షవాతం వచ్చి కదలలేని పరిస్థితి.ఒక్కగానొక్క కూతురుకి ఈ విషయం తెలిసి వచ్చి చూసి బాధపడుతుంది,తరువాత వెళ్ళిపోతుంది.కొన్ని రోజులకి తిరిగి వచ్చి తండ్రి మీద మండిపడుతుంది.నేను లెక్కలేనన్ని సార్లు ఫోన్ చేసాను,అమ్మ ఎలా ఉందో కనుకుందామని,నువ్వు ఒక్కసారి కూడా నాకు జవాబు ఇవ్వలేదు,నా కాల్ రిటర్న్ చెయ్యలేదు అని.I was so worried"అని బాధ పడుతుంది.అప్పుడు తండ్రి ఇలా జవాబు ఇస్తాడు."Your worries are of no use to me.Don't get me  wrong.I am not criticizing  you.I just don't have time to deal with your worries.That is all.మీ అమ్మ తను ఉన్న ఈ స్టేట్ లో ఎవ్వరిని చూడాలనుకోవడం లేదు,నేను కూడ.నీకంటూ ఒక పెర్సనల్ లైఫ్ ఉంది కదా,అలాగే మాకు ఉంది, దయచేసి మమ్మల్ని విసిగించకు."అని అంటాడు.

చేతన్ భగత్ తన బ్లాగ్ లో Woman's day రోజు రాసిన ఒక అర్టికల్"Five things women need to change about themselves"చదివాను.అతను రాసినవన్నిటితో నేను ఏకిభవించకపోయినా ఒక్క పాయింట్ మాత్రం ఎందుకో నన్ను బాగా అలోచింపచేసింది."The first behaviour that needs to end is the constant desire to judge other women---Women are hard on themselves.They are harder on each other. An overweight woman enters the room. Most women are thinking 'how fat is she?' A working mother misses a PTA meeting due to an office deadline, others think 'what a terrible mother she is'. A pretty woman's promotion makes other women wonder what she had been up to to get the job.From an ill-fitting dress to a badly cooked dish,you are ready to judge others.This, despite knowing, you yourselves are not perfect.As a woman, it is tough enough is to survive in a male dominated world. Why be so hard on each other? Can you let each other breathe?"

నేను నా లేడి బాస్ లను జడ్జ్ చెయ్యడం కూడా చేతన్ భగత్ చెప్పిన పాయింట్ కి సరిగ్గా సరిపోయే ఉదాహరణే కదా?ఇన్ని పోస్ట్స్ రాసి,ఇంత ఎనాలిసిస్ చేసిన నేను పూర్తిగా మారిపోతానంటారా?ఏమో? ఒకవేళ మళ్ళీ ఎవరన్నా నేను జడ్జ్ చెయ్యడం చూసి నన్ను నిలదీసారే అనుకోండి,నా దగ్గర సమాధానమొకటి రెడి గా ఉందండోయి....నా సమాధానం "ఫీమేల్ DNA ప్రాబ్లం. I can't help it. sorry" అని

Thursday, March 14, 2013

లేడీ బాస్-3


క్రమంగా నాకు  ఉద్యోగ బాధ్యతలు పెరిగి, జేన్ తో  రోజుకి కనీసం ఆరు గంటలు,ఒక్కోసారి ఏడు గంటలు కలిసి పనిచెయ్యాల్సివచ్చేది.జేన్ భర్తకి కేన్సర్ అని ఒక రోజు నాతో చెప్పింది.అతను క్రిటికల్ గానే ఉన్నాడని తను ఎలాంటి వార్త వచ్చినా నిలదొక్కుకోడానికి  సిద్దంగానే ఉన్నట్టు చెప్పింది.ఆ వార్త విన్న రోజు నాకు చాలా దిగులు వేసింది.మనస్సులో ఎంత బాధ ఉన్నా,ఎప్పుడు నవ్వుతూ,ధైర్యంగా కనపడే జేన్ ని  చూసి చాలా నేర్చుకోవచ్చు అనిపించింది.

25, 27 సంవత్సరాల కొడుకు, కూతురు ఉన్నారు జేన్ కి.జేన్ కొడుకు కూడా మా ఆఫీస్ లోనే పనిచేసేవాడు.వారివురూ ఎక్కువగా మాట్లాడుకునే వారు కాదు.వాళ్ళ లాస్ట్ నేంస్ కలవడం చూసి నేను ఒక రోజు జేన్ తో నీ లాస్ట్ నేం ఫలానా అబ్బాయికి ఉంది కదా అని అడిగితే,అతను నా కొడుకు అని చెప్పింది.ఆశ్చర్యపోయాను.ఈ విషయం తను నాతో ఎప్పుడు ప్రస్తావించకపోవడం కొద్దిగా వింతగా అనిపించింది.కూతురు గురించి అడిగితే,భర్త నుంచి విడాకులు తీసుకుందని న్యూయార్క్ లో ఉద్యోగం చేస్తుందని చెప్పింది.నన్ను కూడా అప్పుడప్పుడు నా కూతురి గురించి అడిగేది."టీనేజ్ అమ్మాయి ఇంట్లో ఉందంటే నువ్వు అనుభవించే మానసిక సంఘర్షణ నేను అర్ధం చేసుకోగలను"అని ఒక రోజు అంది.ఒక్క నిమిషం ఉల్లిక్కిపడి "అలాంటిదేమి లేదే ...నాకూతురుకేంటి బంగారం"అని మాట దాటేసాను.లేడీ బాస్ లు(డొన్నా,జేన్)ఇద్దరిని చూసి నేను స్పూర్తి చెంది నేర్చుకున్నది ఎంతో ఉన్నా,కొన్ని సంధర్భాలలో వారితో సంభాషించినప్పుడు వారు వ్యక్తపరిచిన కొన్ని అభిప్రాయాలు విన్నాక నాకు వారి మీద ఒక రకమైన విముఖత కలిగింది.
ఎవ్వరి కోసము నేను ఆగనంటూ కాలచక్రం గిర్రున తిరిగింది.అమ్మాయి కాలేజ్ కి వెళ్ళాల్సిన రోజు దగ్గరపడింది.మనస్సులో అంతులేని దిగులు,ఒక రకమైన గుబులు.రోజు ఉదయాన్నే స్కూల్ బస్ వెళ్ళిపోతుంది అని హడావిడి పడటం ఉండదు.నాతో చీటికి మాటికి ప్రతిదానికి వాదనకు దిగేవారు ఉండరు.చేసిన వంట తినకుండా ఇంకేదో కావాలని అడిగే వారు ఉండరు.పిక్కప్ లు,డ్రాప్ లు  ఉండవు,రాత్రిళ్ళు తనతో పాటు మెలుకుని ఉండాల్సిన రోజులు ఉండవు.ఒక్కసారిగా ఎన్నో సంవత్సరాలుగా అలవాటైన దినచర్య పూర్తిగా మారిపోతుంది అన్న ఊహే భరించడానికి కష్టం గా ఉండేది. కొద్ది రోజులు సెలవు పెట్టి అమ్మాయితో నెల రోజులు గడిపాను.చిత్రంగా మా మధ్య గొడవలు చాలా మటుకు తగ్గిపోయాయి.అలా అని పూర్తిగా కాదు,కాని తను నవ్వుతూ,ఆనందంగా ఉండటం,ఇంతకు ముందులా ధుమ ధుమ లాడుతూ ఉండటం చాలా మటుకు తగ్గింది.నెలరోజుల తరువాత తను కాలేజీకి వెళ్ళిపోయింది.నా దినచర్యలో ఎంతో మార్పు.ఒకప్పుడు ఊపిరి పీల్చుకోడానికి కూడా సమయం ఉండేది కాదు,ఇప్పుడు అంతా తీరికే!రోజు అమ్మాయి ఒక టెక్ష్ట్ మెస్సేజ్ ఎప్పుడు పంపిస్తుందా,ఎప్పుడు ఫోన్ చేస్తుందా అని ఎదురుచూసేదాన్ని.
ఒక రోజు అమ్మాయి ఫోన్ చేసి రెండు రోజులయ్యిందని దిగులుగా ఉందని జేన్ తో చెప్పాను.తను నాతో "పిల్లల మీద విపరీతమైన ప్రేమను పెంచుకుంటాము మనము.రక్త సంభంధమే కాకుండా,వారు చిన్నతనంలో మన పట్ల వ్యక్తపరిచే ప్రేమను చూసి కూడా జీవితంలో ఇంతకంటే మధుర క్షణాలు ఉండవు కదా అనిపిస్తుంది.కాని నెమ్మదిగా వారు పెరుగుతున్న కొద్దీ,వారిలో చాలామార్పు వస్తుంది.దేవుడు టీనేజ్ అన్నది సృష్టించి,పిల్లల ఇంకో రూపం చూపుతాడు మనకి.ఆ మార్పు మనల్ని నెక్ష్ట్ స్టేజ్ కి బాగా ప్రిపేర్ చేస్తుంది.వాళ్ళు ఇల్లు వదిలి పైచదువులకని వెళ్ళిపోవడం-నెక్ష్ట్ స్టేజ్.ఒకవేళ వాళ్ళు మారకుండా చిన్నప్పుడు ఉన్నట్టే కనక ఉంటే,వారి దూరాన్ని/యడబాటుని తట్టుకుని తల్లులు జీవించలేరు.They make it so easy for us.."అని చెప్పింది. ఎందుకో ఈ సారి తను చెప్పింది నిజమే అనిపించింది.అయినా సరే,అంతకు ముందే జేన్,డోన్నా పట్ల నేనేర్పరుచుకున్న అభిప్రాయం మాత్రం మారలేదు.
కొన్ని సంవత్సరాలు అక్కడ పని చేసిన తరువాత,నేను మళ్ళీ ఉద్యోగం మారాను.కొత్త ఉద్యోగం,కొత్త మనుషులు,కొత్త వాతావరణం.నా బాస్ మాత్రం ఈ సారి లేడి కాదు."మొత్తానికి ఇన్నాళ్ళ తరువాత నీకు ఒక మగ బాస్ ..భలే!"అని శ్రీవారు నన్ను ఆటపట్టించారు."అయితే ఏంటట?ఇప్పుడు ఈ కొత్త ఉద్యోగంలో నేనయ్యాను కదా,కొంతమందికి లేడీబాస్" అని నవ్వుతూ సమాధానమిచ్చాను.
(ఎంత కుదించి రాయాలన్నా వీలుకాక,టపా పెద్దదైపోవడం వలన ముగించలేక పోయాను.ముగింపు తప్పకుండా తరువాయి పోస్ట్ లో)

Tuesday, March 12, 2013

లేడీ బాస్-2

Artist: Mohan
ఫేర్వెల్ల్ పార్టీ ముగిసాక ఇంటికి చేరుకునే సరికి సమయం మధ్యానం మూడు గంటలు దాటింది.ఇంట్లోకి అడుగుపెట్టగానే హాయిగా ఊపిరి తీసుకున్నాను.రేపు ఆఫీస్ కి వెళ్ళక్కర్లేదు అన్న భావన ఎందుకో ఆ నిమిషం లో చాలా సంతృప్తినిచ్చింది నాకు.అమ్మాయి స్కూల్ నుంచి వచ్చే వేలయ్యింది అనుకుంటూ సోఫాలో అలా కూర్చుండిపోయాను.అరగంటలో కాలింగ్ బెల్ మోగడం తో లేచి తలుపు తీసాను.వస్తూనే ఆ స్కూల్ బాగ్ సోఫా లో విసిరేసి,"అమ్మా,ఆకలి" అంది అమ్మాయి."అలాగే కాని, ముందు నీ స్కూల్ బాగ్ తీసుకుని నీ రూం లో పెట్టి, కాస్త చేతులు , మొఖం కడుక్కుని రా.."అని అన్నాను. "ఓకే" అంటూనే అయిష్టంగా తన రూం వైపు అడుగులేసింది అమ్మాయి.

చూస్తుండగా ఎంత ఎదిగి పోయింది అమ్మాయి. ఒకప్పుడు "అమ్మా.." అంటూ ప్రతి చిన్న విషయానికి తన చుట్టు తిరిగేది కదా అని అనుకుంటూ అమ్మాయి రూం నుంచి వచ్చేసరికి తనకి వేడి వేడి గా తినటానికి వడ్డిస్తూ,ఎదురుగా కుర్చీలో కూర్చుని,"ఏమయ్యిందిరా ఈ రోజు స్కూల్ లో" అని అడిగాను. "నథింగ్" పొడిగా జవాబు."హోం వర్క్ ఎక్కువగా ఉందా"అని అడిగాను."ఆ మరి ఉండదా?అన్ని సబ్జెక్ట్స్ లో హోంవర్క్ ఉంది,పైగా రేపు రెండు పరీక్షలు కూడా ఉన్నాయి.నాకు నిద్రపోడానికి కూడా టైం ఉండదు" అని చెప్పింది అమ్మాయి."సరే తొందరగా తినేసి సమయం వృద్ధా చెయ్యకుండా వర్క్ చేసుకో,అలా అయినా ఒక నాలుగు గంటలు పడుకోవచ్చు అని అన్నాను అమ్మాయితో."నువ్వు చెప్పక్కర్లేదు,నాకు తెలుసు"అని విసురుగా వచ్చింది సమాధానం.వెంటనే కోపంతో "అలాగేనా అమ్మతో మాట్లాడేది?నువ్వు చదువుకున్నా,చదువుకోకపోయినా నాకు ఫర్వాలేదు కాని, పెద్దవారితో మాట్లాడే పద్దతి మాత్రం నేర్చుకోవాలి.నీ ఇష్టం వచ్చినట్టు ఎంత మాట పడితే అంత మాట అనేస్తావా?" కోపంగా అడిగాను.ఆ మాటకి అమ్మాయి కూడా ఊరుకోకుండా"నేనేమన్నా పాపాయిననుకున్నావా?నువ్వు అన్నీ చెపితే కాని నాకు తెలీదా?"అనేసి తన రూం లోకి వెళ్ళిపోయింది అమ్మాయి.మనస్సు చివుక్కుమన్నా,పద్నాలుగేళ్ళకే  వయస్సుకి మించి చదువులు, ఒక్క నిమిషం తీరిక లేకుండా ఒక దాని తరువాత మరోక యాక్టివీటీస్ తో సతమతమవుతున్న మూలాన ఉన్న స్ట్రెస్స్ అని సరిపెట్టుకుని పనిలో మునిగిపోయాను.


రెండు వారాల్లో కొత్త ఉద్యోగం లో చేరాలి నేను.ఈ రెండు వారాలు అమ్మాయికి నాకు మధ్య ఎన్నో వాగ్యుద్దాలు.ప్రతి చిన్న విషయానికి విస్సుకోవడం, ఎదిరించటం,మళ్ళీ వచ్చి "I did not mean it, sorry అని చెప్పటం.Stop treating me like a baby"అనటం..ఇలా ఎన్నో ఎన్నేన్నో.. ఒకప్పుడు అమ్మని నిమిషం వదిలిపేట్టకుండా,స్కూల్ కి ఎప్పుడన్నా వెళితే "My mom" అని ఫ్రెండ్స్ అందరిని పరిచయం చేసే తన గారాల పట్టేనా ఇది అని అనుకునేదాన్ని.ఇప్పుడు పొరపాటున ఎప్పుడన్నా, స్కూల్ కి వెళితే,  "ఎందుకొచ్చావు అమ్మా?You are embarrassing me"అని నన్ను తప్పించుకుని వెళ్ళడం లాంటి పనులు చేసినప్పుడు విపరీతంగా బాధ పడేదాన్ని. శ్రీవారు చాలా తేలిక గా "అబ్బా, నీ పని నువ్వు చేసుకోవోయి,అది మంచి అమ్మాయి,బుద్ధిగా చదువుకుంటుంది కదా,అంతకంటే ఏమి కావాలి నీకు,కాస్తా దాని గురించి పట్టించుకోవడం మానేస్తే బెట్టర్." అని సలహా ఇచ్చేసి ఆ టెన్నిస్ రాకెట్ ఊపుకుంటూ వెళ్ళిపోయారు.

అమ్మాయి రూం గురించి ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పాలి.శనివారం నాడు రూం క్లీనింగ్ అని మొదలుపెట్టి చక్కగా అద్దం లా సర్దుకుంటుంది. ఆదివారం తను పడుకునే మంచం ఖాలీగా ఉండటం మూలాన,హాయిగా పడుకుంటుంది.ఇక సోమవారం నుండి అమ్మాయికి మంచం మీద పడుకునే చోటు క్రమేనా తగ్గిపోతు ఉంటుంది.అలాగే సర్దుకుని,రోజు రోజుకి ఎంత వీలైతే అంత తక్కువ చోటులో పడుకుంటూ,శుక్రువారం రాత్రి అయ్యేసరికి,ఒక మూలగా మంచం మీద ముడుచుకుని ఏ నిమిషంలో అయినా పడిపోతుందేమో అని భయపడేలా పడుకుంటుంది.ఆ మంచం మీద 90% పుస్తకాలు,ఇంకా మిగతా వస్తువులతో మునిగి పోయి ఉంటుంది.ఇదెక్కడి చోద్యం, ఆ పుస్తకాలు తీసి టేబల్ మీద పెట్టి,సరిగ్గా పడుకోవచ్చుగా అంటే "నాకు టైం లేదు,నీకెందుకు?"అనేస్తుంది ఫట్ మని.పోన్లే కదా అని ఒకరోజున నేనే బుధవారం నాటికి మంచం పుస్తకాలతో మునిగిపోయి ఉంటే, చక చక అవన్ని తీసేసి, టేబుల్ మీద పెట్టి నీట్ గా పక్క సర్దేసాను. 

ఆరోజు అమ్మాయి "నువ్వెందుకు నా పుస్తకాలు సర్దావు,నాకు ఏ పుస్తకం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలీదు"అంటుంటే,విస్తుపోయి,అన్ని పుస్తకాలు ఆ టేబుల్ మీదేగా పెట్టా..అంటే,అయినా వినకుండా నా మీద విరుచుకు పడిపోయింది.చేసిన తప్పు ఏమిటో అర్ధం కాక బిక్క మొఖం వేసి, నీ రూం వైపు కాని,నీ జోలికి గాని వస్తే మళ్ళీ చూడు అని బాధగా అక్కడ నుంచి వచ్చేసాను.సరిగ్గా అప్పట్లో రెండు సంవత్సరాల క్రితం రేవతి దర్శకత్వంలో ఒక సినిమా వచ్చింది."Mitr" అని.ఆ సినిమాలో కూడా ఇలాగే  తల్లి చిందరవందరగా ఉందని కూతురు రూం సర్దితే,చెడా మడా తల్లిని తిడుతుంది కూతురు.పాపం శోభన(తల్లి పాత్రధారి) తను చేసిన తప్పేమిటో తెలియక కుమిలిపోతుంది.మరీ శోభన లెవల్ లో కాకపోయినా, చాలా బాధ పడ్డాను నేను కూడా.మళ్ళీ శ్రీవారి సలహా.."అస్సలు నీకెందుకోయి?హాయిగా రెస్ట్ తీసుకోక,దాని రూం సర్దాల్సిన అవసరం నీకేంటి? అదే సర్దుకుంటుంది, ఇబ్బందైతే తనకి తెలుస్తుంది కదా" అని చిద్విలాసం గా ఒక నవ్వు.ఒళ్ళు మండిపోయింది ఆయన అలా నవ్వుతూ ఇచ్చిన సలహాకి.

చూస్తుండగానే రెండు వారాలు గడచిపోయాయి.కొత్త ఉద్యోగం లో జాయిన్ అయ్యాను.కొత్త వాతావరణం,కొత్త మనుషులు,అంతా కొత్తే.నాకు బాస్ మాత్రం ఈ సారి కూడా ఒక లేడీ. కొత్త లేడీ బాస్ పేరు జేన్. ఇంక రెండు సంవత్సరాలలో రిటైర్ అయ్యే వయస్సు ఆవిడ. శ్రద్దగా పని నేర్చుకుంటూ, చేసుకుంటూ, కొద్ది రోజులలోనే దగ్గరయ్యాను ఆవిడకి.ఇంతకు ముందు ఉన్న అనుభవంతో అసలు వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడం కాని,అడగటం లాంటివేవి జరగలేదు మా మధ్య.అలా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక శుభముహుర్తాన ఆవిడ నాతోనే కాక నా ఇద్దరి కొల్లీగ్స్ తో అన్న మాటలకి నేను విస్తుపోయాను.అసలు ఈ తెల్ల వాల్లందరు ఒకటేనా?వీళ్ళందరి అలోచనలు ఇలాగే ఉంటాయా?ఏదో పోడిచేద్దామని ఈ దేశం పరిగెట్టుకుని వచ్చింది ఇలాంటి వారి మధ్య జీవించడానికేనా లాంటి ప్రశ్నలు వేసుకున్నాను నన్ను నేనే!

(ఆఖరి భాగం రేపటి పోస్ట్ లో!)

Monday, March 11, 2013

లేడీ బాస్-1




పరాయి దేశంలో ఉద్యోగం లో చేరిన మొదటి సంవత్సరం అది.పనే దైవంగా,తిండి,తిప్పలు కూడా పట్టించుకోకుండా,కంప్యుటర్ ముందు ఉదయాన్నే దించిన తల బాస్ తో మాట్లాడుతున్నప్పుడు,మీటింగ్స్ లో తప్ప ఎత్తకుండా,రాత్రి,పగలు తేడా లేకుండా పని చేసిన రోజులవి.చేతిలో ఉన్న పని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకోకపొతే,తట్టా,బుట్టా సర్దుకోమని చిరునవ్వుతో మర్యాదగా చెప్పేస్తారని తెలుసు కాబట్టి,చిన్నప్పుడు చదువుకున్న సంత్/సాధువు కబీర్ గారు రాసిన "కల్ కరే సో ఆజ్ కర్,ఆజ్ కరే సో అబ్"అన్న దోహా/కవితాసారం అనుక్షణం గుర్తుకు తెచ్చుకుని ఆ విధంగానే నడుచుకునేదాన్ని.

తను చెప్పిన పని కంటే రెట్టింపు పని చేసే గాడిద దొరికిందన్న సంబరం తో మా (తెల్ల) లేడి బాస్ తెగ మెచ్చుకునేది నన్ను ఆ రోజుల్లో.మెచ్చుకోవడం వరకేనా...అంటే అబ్బే,కాదండోయి..ఆవిడ నాతో పాటు పని చేస్తున్న ఒక ఫిలిఫెన్స్ అబ్బాయికి ఒక రోజు తట్టా,బుట్టా సర్దుకోమని చెప్పేసింది.నేను చేసిన తప్పేంటి,నువ్వు చెప్పిందల్లా చేసా కదా అని బేలగా అడిగాడు మా లేడి బాస్ ని."చెప్పిన పని మాత్రమే చేస్తున్నావు,అదే అదే పాయింట్"అని నవ్వింది మా బాస్.ఆ నవ్వులో అంతరార్ధం ఏమిటో అర్ధం కాక,బిక్క మొఖం వేసుకుని అందరి దగ్గరా సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు నా సహుద్యోగి.
 
మా టీంలోనే నాకంటే ఉద్యోగానుభవం ఉన్న తోటి భారతీయునికి మాత్రం విషయం అర్ధమయ్యి,నన్ను ఒక రూం లోకి లాకెళ్ళి,"ఇదిగో అమ్మాయి,కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్న సామెత విన్నావా?"అని అడిగాడు.బిక్క మొఖం వేసుకుని తల అటు,ఇటు తిప్పాను."ఛల్ విసుగు తెప్పించకుండా చెప్పు,అర్ధం అయ్యిందా లేదా?అలా అడ్డంగా తల ఊపితే అర్ధం అయ్యిందనా,లేదనా?"అని గద్దించాడు.అయ్యిందన్నాను."నువ్వు ఉద్యోగం చేసుకో తప్పు లేదు.తోటి ఉద్యోగుల ఉద్యోగాలతో ఆడుకోకు,ఎంత పని చెపితే అంత పని చేసి ఇంటికి ఛల్!అంతే కాని తగుదునమ్మా అని నీ బాస్ చెప్పని పనులన్ని చేసావో,మర్యాద దక్కదు.నువ్వు గాడిదలా పని చేస్తున్నావని,అందరూ అలాగే చెయాలని లేదు కదా?ఇలా ఇంకోసారి ఇంకొకరి ఉద్యోగం తో ఆడుకోకు"అని ఇచ్చాడు వార్నింగ్.చిన్నప్పటి నుంచి చెప్పిన పని చెయ్యకపోతే తిట్ట్లు తినడం అలవాటు కాని,ఇలా మా బాస్ నోరు ఎత్తకుండానే రేపు నాకేమి పని చెపుతుందో తెలుసుకుని పని చెయ్యడం తప్పు అన్న ఆతోటి భారతీయుడంటే బొలెడంత కోపం ముంచుకొచ్చేసింది నాకు.అలా ఎందుకు చెప్పాడో ఆ పెద్దమనిషి అని కొద్దిగా అలోచించి ఉంటే గీత బోధిస్తున్న శ్రీ కృష్ణుడిలా అతను కనిపించేవాడేమో..కాని ఆ రోజుల్లో అందరి వలస పక్షుల్లాగే నా గూడు మాత్రమే నాకు ముఖ్యం అనుకుని,పెద్దగా అతని మాటలు నేను పట్టించుకోలేదు.

ఇక్కడ మా లేడి బాస్ గురించి కొంచెం చెప్పాలి.ఆవిడ పేరు డోన్నా-అమెరికన్, పెళ్ళి చేసుకున్నది జెర్మన్ని.ఆవిడకు ఇద్దరు కూతుళ్ళు.ఇద్దరు టీనేజర్లు-హైస్కూల్ లో చదువుకునే వారు.అద్భుతమైన అందగత్తె ఆవిడ.నలభయి ఐదు సంవత్సరాల వయసున్నా అలా కనిపించేది కాదు.ఎంతో చక్కగా డ్రెస్స్ చేసుకునేది.మేకప్ ఆవిడ అందాన్నిరెట్టింపు చేసేది.ఆవిడను ఆరాధనాపూర్వకం గా చూస్తూ,ఇలా హుందాగా చక్కగా ఉండాలి అని ఆ రోజుల్లో లెక్కలేనన్ని సార్లు అనుకునేదాన్ని.నాకు,ఆవిడకు కొద్ది రోజులకు చనువు పెరిగి,అప్పుడప్పుడు మధ్యానం లంచ్ కి కలిసి వెళ్ళడం జరిగేది.ఆఫీస్ లో,వర్క్ విషయంలో ఎంత కటువుగా ఉండేదో,ఆఫీస్ పార్టిస్ లో,లంచ్ కి వెళ్ళినప్పుడు అంతే సరదాగా ఉండేది.

అప్పుడే కిండర్గార్డెన్ లో అడుగుపెట్టిన నా కూతురి గురించి మురిపెంగా సమయం దొరికినప్పుడల్లా డొన్నా తో చెప్పేదాన్ని.నా కూతురు ఒక పిచ్చి గీత గీసినా,ఒక్క కొత్త పదం నేర్చుకున్నా,ఒక స్నేహితురాలి  గురించి మాట్లాడినా,ఆఖరికి స్కూల్ కి తీసుకెళ్ళిన లంచ్ బోక్ష్ లో లంచ్ మొత్తం తినేసినా అబ్బురమే నాకు.ఆ రోజుల్లో "అమ్మా,అయి లవ్ యు సో మచ్"అన్నప్పుడుల్లా మురిసిపోయేదాన్ని.డోన్నా తో లంచ్ కి వెళ్ళినప్పుడల్లా అవే కబుర్లు చెప్పేదాన్ని.పాపం చెప్పినవన్ని ఓపికగా వినేది, అప్పుడప్పుడు "lovely"," so cute" అని కూడా అనేది.తను మాత్రం భర్త గురించి అప్పుడప్పుడు కొన్ని విషయాలు చెప్పేది కాని,ఎప్పుడు తన కూతుళ్ళ గురించి మాట్లాడేది కాదు.ఎప్పుడన్నా నేను అడిగినా...నిట్టూర్చేది,కాని ఎక్కువగా ఏమి మాట్లేది కాదు వారి గురించి.

అలా ఒక మూడు సంవత్సరాలు గడిచిపోయాయి.ఒక శుక్రువారం రోజున డోన్నా లంచ్ కి వెలదామా అని అడిగింది,సరే అని ఇద్దరము వెళ్ళాము.ఆవిడ ఎప్పుడు తినే గడ్డి గాదం (salad) తెచ్చుకుని తింటూ,మాట్లాడసాగింది. ఆ రోజు మా సంభాషణ పూర్తి ఆయ్యాక,నాకు నోట మాట రాలేదు.మొదటి సారి నేనెంతో ఆరాధించే డోన్నా మీద అస్సయం వేసింది.అప్పటి వరకు ఆవిడకు మనస్సులో వేసిన పెద్ద పీట ని తీసేసాను.ఇచ్చిన పనులు చెయ్యడం తప్ప,నెమ్మదిగా ఆవిడతో మిగతా ఇంటెరాక్షన్ తగ్గించేసాను.

అలా కొన్ని సంవత్సరాల తరువాత,ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఇంకో ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి నిశ్చయించుకుని అదే విషయం డోన్నాకి చెప్పాను.సహజంగానే బాధపడింది,ఉండిపొమ్మని అడిగింది...లేదు, నిర్ణయించుకున్నా..ఇక్కడ పెద్ద ఎదుగుదల లేదు అని చెప్పాను.సరే అంది,ఫేర్వెల్ల్ లంచ్ కి వచ్చింది.అప్పుడు కూడా పొడి పోడిగా మాట్లాడాను తప్ప,అసలు డోన్నా తో సరిగ్గా మాట్లాడకలేకపోయాను.ఆ రోజు ఒక కోలీగ్ అడిగింది."ఒకప్పుడు నాలుగు మాటలు మాట్లాడితే అందులో మూడు నీబాస్ గురించి మాట్లాడేదానివి,ఇప్పుడు ఏమయ్యింది? డోన్నా  నిన్ను  మెత్తగా చివాట్లు పెట్టిందా?"అని కూపీ లాగాలని ప్రయత్నించింది. విషయం దాటేసి,గుడ్ బై చెప్పి ఆ ఆఫీస్ తో రుణం తీరిపోయింది అనుకుని ఇంటి ముఖం  పట్టాను.

(తరువాయి నెక్ష్ట్ పోస్ట్ లో)

Friday, July 20, 2012

తాళపత్ర గ్రంధాలు-నమ్మలేని నిజాలు



భవిష్యత్తు గురించి చెపుతారు జ్యోతిష్కులు అంటారు కదా?నేను ఇప్పటికి మరచిపోలేని సంఘటన ఒకటి జరిగింది నా జీవితం లో.చిన్నపుడు నన్ను ఎవరన్నా నువ్వు దేవుడిని నమ్ముతావా  అంటే నాకు తెలీదని చెప్పేదాన్ని.ఒక నిర్ధిష్టమైన అభిప్రాయం లేకుండా ఉండేదాన్ని.ఒక్కోసారి ఉన్నాడనిపించేది. ఒక్కోసారి లేడేమో అని సందేహము కలిగేది.అలోచిస్తూ మాత్రం ఉండేదాన్ని. అమ్మ ఎప్పుడూ చెప్పేది..మనుషులలో మంచితనమే దేవుడు...సమాజం లో మనుషులు తప్పులు చెయ్యకుండా ఎదో ఒక భీతికి కట్టుపడి ఉండాలని దేవుడు అన్నది సృష్టించారని చెప్పేది. 

ఒక రోజున విజయవాడ లో ఎవరో మడ్రాస్ నుంచి వచ్చి ఏవో తాళపత్ర గ్రంధాలు చూసి జ్యోష్యం చెపుతున్నారు అని తెలిస్తే,వినగానే కొట్టి పాడేసాను..కాని ఒక ఫ్రెండ్ చెప్పిన కొన్ని విషయాలు తెలుసుకున్నాక అవి నిజమో , కాదో తెలుసుకోవాలని ఆకాంక్ష కలిగింది.నేను కూడా అప్పాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాను.

ఒక పాత ఇంటిలో ముగ్గురు తమిల్ వాళ్ళు ఉన్నారు. అందరు మగవారే.ఫీస్ Rs.100.Date of birth అడిగారు. కొన్ని గ్రంధాలలోంచి ఒకటి తీసి,కొంచెం తిరగేసి..నీ పేరులో మూడు అక్షరాలు ఉన్నాయి.మొదటి అక్షరం "శ్రీ" తో మొదలౌతుంది కర్రెక్టేనా అని అడిగారు.తేరుకోడానికి సమయం పట్టింది..కాని ఇంతలో అనుకున్నా permutations and combinations ఎన్ని చేస్తారో చూదాము అని ఎదురుచూసాను. మరునిమిషంలో నా పూర్తి పేరు చెప్పారు.కాళ్ళ కింద భూమి కదిలిపోయిందా అనిపించింది..వెంటనే నా కుటుంభసభ్యుల పేర్లు కూడా చెప్పారు. ఇంక నాకు ముచ్చెమటలు పట్టి ,మొదటి సారిగా భయ్యం అంటే ఏంటో తెలిసింది..నా పరిస్థితి చూసి ఆయన అడిగారు...continue  చెయ్యనా అని, నాకు ధైర్యం లేదు ఇంక...అయినా సరే అని అక్కడే ఉండిపోయాను..ఒక అరగంట నా past, present, future గురించి చెప్పారు. అన్నీ record చేసి ఇచ్చారు. పాస్ట్ అంతా కళ్ళకు కట్టినట్టు అన్ని నిజాలే..ప్రెసెంట్ గురించి చెప్పినవి నిజాలే...అప్పటిలో future గురించి చెప్పినవి నిజమో కాదో తెలీదు కదా..కాని ఇప్పుడు చూస్తే చెప్పినవి జరగకపోవడం అన్నది లేదు.!! ఇప్పటికి నాలో ఉన్న తర్కం..నమ్మొద్దు అని చెపుతున్నా..కళ్ళతో చూసినది, అనుభవించినది ఎలా నమ్మకుండా ఉండగలను? అప్పుడే ఆయన చెప్పారు..నువ్వు దేవుడిని పూర్తిగా నమ్మటం లేదు..నీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన ఫలానా వారికి సంభందించి జరుగుతుంది..ఆ రోజు నువ్వే నమ్ముతావు..అని..కొట్టిపారేసాను ఆ రోజు..

నిజమయ్యింది తరువాత...

దేనిని నేను గుడ్డిగా నమ్మను.తరువాత అసలు నా వివరాలన్ని వాళ్ళకి ఎవరన్నా అందించిన వారున్నారేమో అని కూడా inquiry చేసాను..ఊహూ..ఆ chance లేదు... మరి ఎలా సంభవం అది? ఏమో!!! కాని నేను రాసిన ఏ ఒక్క సంఘటన కల్పితం కాదు. 


Thursday, July 19, 2012

Saturday, June 23, 2012

కొతగా రెక్కలొచ్చేనా? లేదే!!


"వెలుగు నీడలు"  ఆదుర్తి సుబ్బా రావు గారు direct  చేసిన సినిమాలో శ్రీ శ్రీ గారు రాసిన పాట ఇది. ఒక్క సారి జాగ్రత్తగా అన్ని లైన్స్ చదవండి. ఇది 1961 లో రాసారు శ్రీ శ్రీ గారు. అంటే స్వాతంత్రం వచ్చాక 14 సంవత్సరాల తరువాత...

"స్వాతంత్రం వచ్చెనని సభలే చేసి సంబర పడగానే సరిపోదోయి..
సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయమనుకుంటే పొరపాటోయి...
ఆకాశం అందుకునే ధరలొక వైపు
అదుపులేని నిరుద్యోగముంకొక వైపు
అవినీతి, బంధుప్రీతి చీకటి బజారు 
అలుముకున్న ఏ దేశం ఎటు దిగజారు?
కాంచవోయి నేటి దుస్థితి, ఎదురించవోయి ఈ పరిస్థితి

పదవి వ్యామొహాలు కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు
ప్రతి మనిషి మరి ఒకని దొచుకునే వాడే
తన సౌఖ్యం, తన భాగ్యం చూసుకునే వారె!
స్వార్ధమే అనర్ధ దాయకం
అది చంపుకొనుటే క్షేమదాయకం
సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం
ఏక దీక్షతో గమ్యం చెరిననాడే లొకానికి మన భారత దేశం అందించునులే శుభ సందేశం"

సింధూరం సినిమా 1997 లో రిలీస్ అయ్యింది. "సింధూరం" క్రిష్ణవంశీ గారు   గారు direct  చేసిన సినిమాలో సిరివెన్నెల గారు రాసిన పాట ఇది.

"అర్ధశతాబ్దపు అఙానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా
శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సిందూరం
నీ పాపిటలొ భక్తిగదిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా !

కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే జనాలు తలలర్పిస్తారే
సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ మొత్తం దేశం తగలడుతోందని
నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే

తన తలరాతను తానే రాయగల అవకాశాన్నే వదులుకొని
తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని
ప్రజాస్వామ్యమని తలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని
కళ్ళు వున్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుండట అధికారం
కృష్ణుడు లేని కురుక్షేత్రముగ సాగే ఈ ఘోరం చితిమంటల సిందూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా ఓ విషాద భారతమా!"

1961 లో ఆనాడు దేశం లో ఉన్న పరిస్తితులకు, 1997 లో ఉన్న పరిస్తితులకు నాకైతే పెద్ద తేడా కనపడటం లేదు. అంటే అవినీతి, కులమతద్వేషాలు, స్వార్ధ పూరితమైన మనుషులు ఇప్పుడేమి పుట్టుకుని రాలేదు.మనం  అన్ని రంగాల్లోను ఎంతో అభివృద్దిని సాధించినట్టు పైన చెప్పిన వాటిలోను ఎంతో ముందుకు వెళ్ళాము. తప్పట్లు మనందరికి!!!!

అయితే ఇప్పుడొక సందేహం ..మరి ఇంక 30 సంవత్సరాల తరువాత, ఎలా ఉంటుందో మన దేశం ?  శ్రీ శ్రీ , సిరివెన్నెల లాంటి రచయతలు ఎలా రాస్తారో పాటలు. తెలుసుకోవాలని ఉంది!!!!

Tuesday, June 19, 2012

సుప్రభాతం



ఇకనైనా నీ వ్యసనాన్ని వదులుతావా?
ఎన్ని సార్లు చెప్పినా నీ చెవికెక్కదా?
ఆరోగ్యం దెబ్బ తింటుందని చెప్పినా ఫర్వా లేదా?
నిద్రలేమితో బాధపడుతున్నా దాన్ని మాత్రం వదలవా?
పైగా విడదీయలేని అనుబంధం అంటున్నావా ?
దాన్ని వదలేస్తే నీ జన్మ నిరర్ధకమంటున్నావా?
వ్యసనాలెవరికి లేవని ప్రశ్నిస్తున్నావా?
పదపదహారవ శతాబ్దం నాటిది, నేను కనిపెట్టలేదంటావా?
ఉదయం లేవగానే రోజు దానికోసం నీ వెంపర్లాటా?
రోజంతా దానితో లెక్కలేన్నన్ని సార్లు సావాసమా?
నువ్వు తొందర్లో నేను కావాలో ,అది కావాలో తేల్చుకో!!!


హమ్మయ్య! ఈ రోజుకి ఈ తిట్ల దండకం ముగిసింది..

ఇదండి నేను రోజు వినే సుప్రభాతం!
హాయిగా "కాఫీ" తాగుదాము, వస్తారా?
నాకు అమితానందాన్ని ఇచ్చే పదాలు.."కాఫీ రెడీ"


ఏ రోజైతే తాగానో కాఫీ...ఆ ఆ ఆ....పాట వినండి!
తెలుగులో కాఫీని ఏమంటారు చెప్మా? తెలిస్తే చెప్పండి ప్లీస్!

Thursday, June 14, 2012

ఔరా Celebrity Weddings !!!


మళ్ళీ ఇంకో celebrity wedding news! Photos, videos వీటిని చూడడం లో మా స్నేహితులందరు బిసీ!ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు చూసి latest fashions తెలుసుకుంటున్నా,అప్పుడప్పుడు వచ్చే celebrity marriages మాత్రం special!Latest fashion sarees,jewellery,పెళ్ళి మండపం decorations,అబ్బో కొన్ని రోజుల వరకు..ఇవే కబుర్లు..ఫలాన హీరోగారి అమ్మాయి కట్టుకున్న చీర,వేసుకున్న matching బంగారం set.ఫలానా హీరో తమ్ముడు కట్టుకున్న పంచె ని కూడా వదిలే ప్రసక్తి లేదు.

ఇంతవరకు బాగానే ఉంది. Window shopping లాగా ఊరికే చూసి ఆనందించటం వరకు,కాని దీని affect నెమ్మదిగా అందరి మీద ఎలా పడుతుందో చెపుతాను.Celebrity wedding అయిపోయిన 4 వారాలలోపే ఒక birthdayparty కి వెళ్ళాము అనుకోండి.అప్పుడు చూడాలి చీరల రెపరెపలు..అనుష్క మొన్న చిరంజీవి కొడుకు పెళ్ళిలో కట్టిన చీర లాంటిదే!అమ్మకి చెప్పి వెంటనే కొనమని చెప్పేసాను,matching jewellery set కోసం madras వెళ్ళింది అమ్మ అంటుంది ఒక ఫ్రెండ్. (వాళ్ళ అమ్మను నిజం గా మెచ్చుకోవాల్సిందే!) ఇంకో ఫ్రెండ్ వచ్చేసి,బానే ఉందిలే కాని, నేను కట్టుకున్న చీర మొన్న శ్రీదెవీ కట్టుకున్న చీర లాంటిదే! Online order చేసేసా!ఇలా కొంత మంది తము ధరించిన చీరలు, నగలు చూసుకుని celebrityల కంటే తమేమి తక్కువ కాదు అని సంతృప్తి చెందుతూ ఉంటారు.
ఇంతవరకు కూడా ఒకరకంగా ఫర్వాలేదు అనుకుందాము.ఆ మధ్య జరిగిన ఒక సంఘటన చెపుతాను.13 సంవత్సరాల నుంచి నాకు ఒక ఫ్రెండ్ తెలుసు.కూతురి పెళ్ళి చేదామని సంబంధాలు చూసి (arranged marriages) ఒక అబ్బాయిని select చేసారు.పెళ్ళి బాగా చెయ్యమన్నారు అబ్బాయి తరుపు వాళ్ళు.పెళ్ళికి ఆహ్వానం ఉంది కాబట్టి వెళ్ళాను. ఒక్క నిమిషం నాకు నేను అమెరికా లో ఉన్నానా , ఇండియా లో ఉన్నానా,లేక ఏదన్నా celebrity wedding లో ఉన్నానా అని అనుమానం వచ్చింది. పెళ్ళి మండపం అదేదో వరుడు సినిమాలో ఉన్న మండపం set అట! ఇక భొజనాలు, decorations అన్ని కలిపి 90,000 డాల్లర్లయ్యిందట! పెళ్ళి చీరలు కూడా ఒకసారి పెళ్ళి కూతురు అనుకున్నట్టు కుదరలేదు కాబట్టి, 25,000rs విలువ గల చీరను పక్కకు పెట్టి ఇంకో చీర తెప్పించుకుంది.25,000 rs మళ్ళీ ఖర్చు పెట్టారట! ఎందుకింత ఆర్భారం అని అంటే, ఇంకో ఫ్రెండ్ అంది కదా.. "పెళ్ళి రోజూ చేసుకుంటామా, ఈ నిమిషం మనం తృప్తి గా బతికామా అన్నది important. compromise ఎందుకు అన్నిట్లోను?" నాకైతే సినిమా dialogue లా అనిపించింది,కాని మారుమాట్లాడక నేను కూడా celebrity wedding లాంటి పెళ్ళిని ఎంజొయ్ చేసి వచ్చాను. దురద్రుష్టం కొద్దీ సంవత్సరం లోపు విడాకుల తంతు. ఎవరి దారీ వారి చూసుకున్నారు. నా కళ్ళకు మాత్రం 90,000$  బూడిదలో పోసిన పన్నీరైపోయిందే అని మనసు విల విల లాడి పోయింది. కనీసం గుడిలో పెళ్ళి చేసినా $10,000(ఇదే చాలా ఎక్కువ)లో అయిపోయేది కదా? మిగతా 80,000$ అమ్మాయికే ఉండేవి కదా?

ఒకప్పుడు అలోచనా తీరు ఎలా ఉండేది అంటే, అమెరికా లో ఉద్యోగాలు ఏ నిమిషంలో పోతాయో తెలీదు, అందుకని ముందుగా జీతం లేకపోయినా ఒక సంవత్సరం పాటు హాయిగా జీవించగలిగే (ఆ రోజుల్లో ఇల్లు అద్దె, కారు installment, నెలసరి ఇంటి ఖర్చు) అన్ని డాల్లర్స్ save చేసుకుని కాని, మనం ఊపిరి పీల్చుకోకూడదు అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఎంతైన long term savings గురించి అంతలా అలోచించేవారు కనపడడం లేదు. భార్య భర్త ఇలా ఉద్యోగాలలో చేరగానే అలా లంకంత ఇల్లులు కొనెయ్యడం పరిపాటి అయిపోయింది. చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, వీళ్ళకి రేపు ఉద్యోగాలు పోతే mortgage ఎలా కడతామనే అలోచనే రాదా అని. అలాంటప్పుడు చాలామంది bankrupcy file చేసి ఇల్లులు వదిలించుకున్నవాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఈ celebrity weddings వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు స్పూర్తి చెంది చేతులు కాల్చుకోవడం చూస్తూనే ఉన్నాను.ఈసారి ఎవరి భారియో!

Tuesday, May 22, 2012

బ్లాగింగ్ సందేహం!


ఈ రోజు ఉదయం నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే,ఒక విషయం చర్చకు వచ్చింది. అది నన్ను అలోచనకు గురిచేసింది.ఆఫీస్ లో పనిచేస్తున్నా, మధ్యాన్నం లంచ్ చేస్తున్నా,మీటింగ్ లో ఉన్నా అలోచిస్తూనే ఉన్నాను. చివరకు నా అలోచనలు తెగేటట్లు లేవు అని ఈ భారమంతా మీ అందరి మీద కొద్దిగా వేద్దామా అని ఒక కుట్ర పన్ని, ఇలా ఈ పోస్ట్ రాసేస్తున్నా..

ఇంతకీ మా చర్చాంశం ఏమిటంటే బ్లాగ్స్ లో అందరికీ ఉపయోగపడే విషయాలు కాని, కొద్దో గొప్పో మన బ్లాగ్స్ చదివిన వారికి మన ప్రతి పోస్ట్ ఎదో ఒక సందేశం కానీ, మంచి విషయం కాని, తెలియని విషయాలను తెలిపేటట్లు కాని ఉండాలి అనీ,లేదా కనీసం అలోచింపచేసేది గా ఉండాలని, మనమందరమూ బ్లాగ్స్ లో పోస్ట్ లు రాసేటప్పుడు ఒక స్టాండర్డ్ మెంటెయిన్ చెయ్యాలని చర్చ! ఇక కామెంట్స్ విషయానికి  వస్తే కూడా "నాం కె వాస్తే" (ఎదో కామెంట్స్ రాయలని రాయడమే కాని, ఇంకేమికాదు అన్నట్టు) లా కాక  మనం రాసే ప్రతి కామెంట్ లో కూడా అర్ధవంతం గా ఉండాలి అని.

ఈ చర్చ అయ్యాక, నాలో ఒక రకమైన గుబులు మొదలయ్యింది. ఏదో ఆ రోజు మనసులో ఏముంటే అది రాయడమే కాని, ఎప్పుడు..ఈ పోస్ట్ కి అర్ధం ఉందా, ఎవరికన్నా ఉపయోగపడుతుందా, ఇప్పుడు ఈ పోస్ట్ రాయడం వల్ల నేను ఎమన్నా సందేశం ఇస్తున్నానా అన్న అలోచన నాకు ఇంతవరకు రాలేదు.నా పోస్ట్ లో ఒకటో, రెండో తప్ప ఎవరికి ఉపయోగపడే పోస్ట్ లైతే లేవు. పోస్ట్ లన్నిటికీ కామెంట్స్ వస్తుంటే, హమ్మయ్య చదువుతున్నారు కదా అని సంబడం తప్ప,పెద్దగా అలోచించలేదు. నా మటుకు నేను నిజంగానే సరదా/fun కోసమే రాసుకుంటాను. ఎవరిని నొప్పించకుండా రాస్తే చాలు అని మాత్రం అనుకుంటాను. ఎప్పుడన్నా  నేను చూసిన, ప్రభావితమయిన సంఘటనలు ఉంటే వాటి గురించి కూడా రాస్తాను. రాజకీయలలో , సినిమాలలో, లేదా పురాణాలలో, కవిత్వంలో,అధ్యాత్మికం గా కూడా ఉన్నది మిడి, మిడి జ్ఞానమే! కొంతమంది బ్లాగ్ మిత్రులు రాసేవి చూసి అబ్బురపడుతూ ఉంటాను. ఎంత జ్ఞానవంతులో కదా అని.అలాంటి వారి బ్లాగ్స్ చూసినప్పుడు నిజమే ఏదో నేర్చుకున్నాము, తెలియని విషయాలు తెలుసుకున్నాము  అని అనిపిస్తుంది, చాలా సంతృప్తిగా ఉంటుంది కాని, నేను కూడా అలాగే రాయలనుకున్నా రాయలేనే!!

ఇప్పుడు ఇంక ఒకరకమైన సందిగ్ధం లో పడ్డాను.ఒకవేళ నిజంగా బ్లాగ్స్ లో పోస్ట్స్ కూడా జాగ్రత్తగా రాయాలి, ఏదో సరదాగా రాయకూడదు అన్నది నిజమైతే, నేను రాంగోపాల్ వర్మ లా అలోచిస్తున్నానా? ఎవరేమనుకుంటే నాకేంటి...నాకు నచ్చింది, నా మనసులో అనిపించింది మాత్రమే రాయాలి అన్న అలోచన తప్పా? సరదాగా కాలక్షేపానికి చదువుకుంటున్న, రాస్తున్న పోస్ట్స్ అన్నీ ఆపెయ్యాలా?అసలు నిజంగా బ్లాగ్స్ లో ఏమి రాయాలి? బ్లాగింగ్ మీద సరైన  అవగాహన లేకుండా బ్లాగింగ్ మొదలుపెట్టానా ...ఏంటో,అంతా అయోమయం...కొంచెం మీ అందరి అభిప్రాయలు తెలియచెయ్యండి...బ్లాగింగ్ మీద... నా బ్లాగింగ్ మీద కాదండోయి.! అసలు బ్లాగ్స్ రాసేటప్పుడు మనకి మనం  స్టాండర్డ్స్ ఇంపోస్ చేసుకోవాలా అన్న విషయం మీద!!!!!

Saturday, May 12, 2012

అమ్మదొంగా! నిన్ను చూడకుంటే..


కలతలు కష్టాలు నీ దరికి రాక..
కలకాలం నీ బ్రతుకు కలలదారి కావాలి!



Wednesday, April 25, 2012

ఫిజిక్స్ కష్టాలు



ఈ రోజు ఉదయం నిద్ర లేపుతూ శ్రీవారు నీకు ఒక వార్త చదివి వినిపించాలి  అని  "ఇంటర్ సెంకడియర్ ఫిజిక్స్ పేపర్‌ చాలా కష్టం గా ఉండటం మూలాన, అంధ్రాలో 31 శాతం విద్యార్థులు  ఫిజిక్స్‌లోనే ఫెయిల్ అయ్యారని....విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారని". "You must be kidding, కల ఎమన్నా కన్నావా?" అని అడిగాను.లేదు కావాలంటే చూడు, అని అంధ్రజ్యోతి online న్యూస్ పేపర్‌ చూపించారు. నా నిద్ర మత్తు అంతా ఒక్క నిమిషం లో ఎగిరిపోయింది.

అంధ్రాలో ఇంటర్ సెంకడియర్ ఫిజిక్స్ పేపర్‌ కష్టం గా ఉంటే మధ్య నాకెందుకు అంత కుతూహలం అనుకుంటున్నరా? గత మూడు వారాల నుండి నాకు, మా వారికి ఫిజిక్స్ అన్న ఒక్క పదం తెచ్చిన నిదుర లేని రాత్రులు గుర్తుకు వచ్చాయి.గత 3 నెలలుగా  కాలేజ్ ఫిజిక్స్ తో కుస్తీ పడుతున్న మా అమ్మాయి "అమ్మా,నాకు ఫిజిక్స్ లో 'A' రాదేమో" అని రోజూ గొడవ చేసేస్తుంది. "ఫర్వాలేదమ్మా, కష్టపడు  ఫలితం భగవంతుడికి వదిలెయ్యి" అని అంటే వినదు. ఎలాగన్నా సాధించి తీరాలన్న పట్టుదల ఉంది. కాని మొదట్లో కొన్ని టెస్ట్స్, quizzes లో తక్కువ మార్కులు రావడం తో బెదిరి పోయి మాకు ఫోన్లు.ప్రోబ్లెంసెట్స్ కష్టంగా ఉన్నాయంటూ కొన్ని సార్లు,ప్రొఫెస్సర్ అంత బాగ కాన్సెప్ట్స్ క్లియర్ చెయ్యటం లేదంటూ కొన్ని సార్లు,తను బాగా చదివాననుకున్నా ప్రొఫెస్సర్ ఎంతో కష్టమైన పేపర్ ఇచ్చారని కొన్నిసార్లు, ఇలా రాత్రి , పగలు ఒకటే ఫొన్లు. అమ్మాయి ఫోన్ అనగానే,గుండె గాబరా అనే స్థితికి వచ్చేసాము నేను ,మా శ్రీవారు.



అమ్మాయి బాధ పడుతుంది అంటే శ్రీవారికి అంతులేని బాధ." అమ్మా ఫిజిక్స్ drop చెసెయ్యి తల్లీ" అని అనగానే మా  అమ్మాయి  " I am not a looser " అంటూ ఎగిరిపడటం. పోనీ "How about one on one tutoring?" అంటే "No,why? నేను అలా నేర్చుకోలేను.అయినా ఎందుకు డబ్బులు దండగ? అంత డబ్బు ఖర్చు పెట్టి నేను "A" తెచ్చుకోవాలా? నాకు తృప్తి ఉండదు" అంటూ మళ్ళీ ఎగిరిపడటం. పొనీలేమ్మా "B+" or "B" కో settle అయిపో" అంటే  రుద్రమదేవిలా "అమ్మా!! నీకసలు ఎమన్నా తెలుస్తోందా?" అంటూ ఫోన్ కట్ చెయ్యడం.ఈ విధంగా "ఫిజిక్స్" అన్న మాట వింటేనే ఎదో బాంబు పడట్టు ఫీల్ అవుతున్న తరుణంలో అంతకు ముందు రోజు మా అమ్మాయి ఫోన్ చేసి, "అమ్మా, నాకు ఇంక ఒక 60% వస్తే నాకు "A" వచ్చినట్టే ఫైనల్ టెస్ట్ లో" అని చాలా సంబరంతో చెప్పింది."Good Job" అని పొగిడేసి మాకు ఫిజిక్స్ కష్టాలు తీరిపోయినట్టే అని సంబరపడిపోయి నేను, మా శ్రీవారు తప్పకుండా celebrate చేసుకోవాలి అని అనుకుని నిద్ర పోయాము. Celebrate చేసుకోవాలనుకున్నది మా అమ్మాయికి "A" వస్తుంది కదా అని కాదండోయి..మాకు ఫిజిక్స్ ఫోన్స్ ఇక రావు అన్న సంబరంతో. ఇంతలో ఉదయాన్నే ఈ వార్త పేపర్ లో...అందుకని...ఏమిటో అందరు ఫిజిక్స్ భాదితులేనా అని ఒక్క క్షణం అనిపించింది.

(తరువాయి పోస్ట్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టం గురించి కొన్ని వివరాలు పోస్ట్ చేస్తాను. నా అనుభవాలు మీలో చాలా మందికి ఎవేర్నెస్స్ కలిగించవచ్చు , ఇంకా చిన్న పిల్లలు ఉన్నవారికి ఉపయోగపడచ్చు. బోర్ అనుకున్న వారు బిందాస్ గా స్కిప్ చెయ్యవచ్చు)

Saturday, March 10, 2012

ఇవి కూడా నేర్పాలి...


నా చిరునవ్వుల దొంతరవి నువ్వే



"అమ్మా  అవనీ నేల తల్లీ అని ఎన్ని సార్లు పిలిచినా తనివి తీరదెందుకని.."
శివదత్త గారు రాసిన పాట సంగీతపరంగానే కాదు, సాహిత్యరీత్యా చాలా మంచి పాట.
రెండు నెలలతర్వాత ఇంటికి వచ్చిన నా కూతురు అమ్మా అమ్మా అని లెఖలేన్నన్ని సార్లు పిలుస్తూ నా వెంట తిరుగుతుంటే..
నిజమేనేమొ...అమ్మా అమ్మా అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదు కదా అనిపించింది...
తనకోసం చేసిన వంటలన్ని అద్భుతంగా ఉన్నాయని చెపుతూ ఆస్వాదిస్తూ తినటం చూస్తే చాలా త్రుప్తిగా కూడా అనిపించింది.
నా చెంత చేరి తన స్నేహితురాలందరి గురించి, ఇంటికి దూరంగాఉన్న ఈ రెండు నెలలలో జరిగినవన్ని పూసగుచినట్టు చెపుతూ మధ్యమధ్యలో "అమ్మా నీకు నిద్ర వస్తుందా..పోని రేపు మాట్లాడుకుందామా?" అని అడుగుతున్న నా చిట్టితల్లిని చూస్తే చిన్నప్పుడు తనకి కావల్సింది ఏదైనా అప్పటికప్పుడు ఇవ్వాలని మారం చేసినది ఈ అమ్మయేనా అనిపించింది.


నిండుగా నా కూతురు ఇంట్లో తిరుగుతుంటే మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది.
ఎల్లప్పుడూ తనకి విజయం తోడుగా ఉండాలని ,పరాజయపు అగాధాలు దరికి కూడా రాకూడదు అని మనస్పూర్తిగా దీవించా..

Monday, March 5, 2012

అమ్మా...ఇదిగో నా లిస్ట్


మొదటి సంవత్సరం ఇంటికి దూరంగా అమ్మ,నాన్నలను వదిలేసి చదువుకోడానికి వెళ్ళిన నా కూతురు...
ఈ రోజు ఒక టెక్ష్ట్ పంపించింది.
అమ్మా ...నేను వచ్చే వారం ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు చేసి పెట్టే వంటలు అన్నీ చెయ్యాలి అని.
ఇండియన్ ఫుడ్ రెండు నెలలుగా తినలేదు...ఇది ఏమి లైఫ్ అని చేసిన కామెంట్ కి నేను ఒక్క నిమిషం ఆశ్చర్యపోయాను. రోజు వండిపెట్టినప్పుడు ఎప్పుడు సరిగ్గా తినని నా కూతురు ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే ఆనందంగా కూడా అనిపించింది.
అన్ని అందుబాటులో, తేలిగ్గా దొరికినప్పుడు వాటి విలువ నిజంగానే తెలియదు ఏమో...

నా అభిమాన కవి సిరివెన్నెలగారు


"ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమొ..." సిరివెన్నెల గారు రాసిన "వాన" సినిమాలోని ఈ పాట రోజుకి నేను లెక్కలేనన్ని సార్లు వింటాను.
మనసుని స్పందించేట్లు పాటలు రాయడం లో ఆయనకి ఆయనే సాటి.
ఒక్కోసారి అనిపిస్తుంది "విరించినై విరచించితిని" అని రాసిన సిరివెన్నెల గారేనా వాన సినిమాలో పాట కూడ రాసింది అని...
వేటూరి గారి గురించి అందరు గొప్పగా మాట్లాడడం తెలుసు ,ఆయన ఎంత గొప్పగా రాస్తారో అందరికి తెలిసిన విషయమే.
నా అభిప్రాయంలో సిరివెన్నెల గారి పాటలు ఒక సామాన్య వ్యక్తిని కూడా స్పందింప చేసేంత గొప్పగా ఉంటాయి.
త్రివిక్రం గారు ఈ మధ్య జరిగిన ఒక ప్రోగ్రాం లొ సిరివెన్నెల గారి గురించి చాల బాగా చెప్పరు.
నిజంగా అలాంటి కవి మనమద్య నివసిస్తూ మనం చూసే సినిమాలలో పాటలు రాయడం మన తెలుగు వాళ్ళు చేసుకున్న అద్రుష్టం.
ఈ బ్లాగ్ లో నా మొదటి పోస్ట్ లో సిరివెన్నెల గారిని తలచుకోవాలి అనిపించింది.