అర్ధరాత్రి ఒంటిగంట దాటింది.గాడనిద్రలో ఉన్నారు వెంకట్,సుభద్ర.సెల్ ఫోన్ మోగడంతో ఉల్లిక్కిపడి లేచాడు వెంకట్.ఎందుకో వేళ కాని వేళ ఫోన్ వస్తే,అతనికి చాలా కంగారుగా ఉంటుంది.ఇండియాలో అందరు క్షేమంగా ఉన్నారో,లేదో అని గాబరా పడుతు ఉంటాడు.సెల్ నంబర్ చూస్తే లోకల్ నంబరే!ఎవరో ఇంత రాత్రి వేళ ఫోన్ చేసింది అనుకుంటూ,"హెల్లో.."అన్నాడు.ఇంతలో సుభద్ర లేచి,"ఎవరు వెంకట్?ఇంత రాత్రి వేళ?"అని అడిగింది.మాట్లాడదన్నట్ట్లు సైగ చేస్తూ,వెంటనే తను బయలుదేరి వస్తున్నానని,ఫోన్ చేసిన వారితో చెప్పి ఫోన్ పెట్టేసాడు వెంకట్.విషయం అర్ధం కాక సుభద్ర ఆందోళనగా చూసింది భర్త వంక."ఎక్కడికి ఇంత రాత్రి వేళ? Is everything alright?"అని అడిగింది."నేను అర్జెంట్ గా వెళ్ళాలి.ఫోన్ చేస్తాను నీకు ఒక అరగంటలో,భయపడకు,కంగారు పడాల్సినది ఏమీ లేదులే"అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయాడు వెంకట్.విషయం ఏమై ఉంటుందా అని అలోచిస్తూ,పడుకున్న సుభద్రకి కొంచెంసేపటికే నిద్ర పట్టేసింది.ఉదయం నిద్ర లేచేటప్పటికి సమయం ఏడు దాటింది.ఆ రోజు శనివారం అన్న విషయం గుర్తు వచ్చి,మళ్ళీ బద్దకంతో కళ్ళు మూసుకుంది.
అంతలో రాత్రి ఫోన్ రావడం,వెంకట్ హడావిడిగా బయటికి వెళ్ళడం అన్ని గుర్తొచ్చాయి.అప్పుడు మొదలయ్యింది సుభద్రలో కంగారు.తనకి భర్త ఫోన్ చెయ్యలేదన్న విషయం గ్రహించి,వెంకట్ కి కాల్ చేసింది సుభద్ర.వెంకట్ ఫోన్ ఎత్తగానే,కొంచెం కోపంగా"ఏమయిపోయావు,రాత్రి హట్టాత్తుగా వెళ్ళిపోయావు,ఫోన్ కూడా చెయ్యలేదు.ఎక్కడ ఉన్నావు ఇప్పుడు?"అని అడిగింది.వెంకట్ నెమ్మదిగా చెప్పాడు,నువ్వు కాలకృత్యాలు తీర్చుకుని సందీప్ ఇంటికి రా,తరువాత మాట్లాడుకుందాము"అన్నాడు వెంకట్.ఆశ్చర్యపోయింది సుభద్ర."అదేంటి, సందీప్ ఇంటికా ఎందుకు? బుజ్జిగాడు బాగున్నాడా?ఏమయ్యింది వెంకట్?"అని కంగారుగా అడిగింది సుభద్ర.నువ్వు వీలైనంత తొందరలో వచ్చెయ్యి,ఫోన్ లో నేను ఏమి చెప్పలేను"అని ఫోన్ పెట్టేసాడు వెంకట్.
ఒక్కసారిగా దిగాలు పడిపోయింది సుభద్ర.సందీప్ సుభద్ర పిన్ని కొడుకు.వయస్సులో చాలా తేడా ఉన్నపటికి,వారిద్దరి మధ్య చనువెక్కువ.తమ్ముడంటే ప్రాణం సుభద్రకి.వెంకట్ కూడా సందీప్ అంటే చాలా అభిమానంగా ఉంటాడు.సందీప్ కి పెళ్ళి అయ్యి మూడు సంవత్సరాలయ్యింది.ఇండియాలో మెడిసిన్ చేసి ఇక్కడ రెసిడెన్సి ఆఖరి సంవత్సరం చేస్తున్నాడు.అతని భార్య గీత పక్కనే ఉన్న ఇంకో స్టేట్ లో ఉద్యోగం చేస్తుంది.మూడు నెలెల బుజ్జిగాడు వారి తొలి సంతానం.ప్రతి వీకెండ్ తప్పనిసరిగా ఒక్కసారైనా వెళ్ళి వాడిని ముద్దాడడం సుభద్రకి,వెంకట్ కి మామూలే!బుజ్జిగాడికేమన్నా ఒంట్లో బాగోలేదా?నేను కంగారు పడతానని నాకు చెప్పలేదా?ఇండియా నుంచి వచ్చిన గీత తల్లితండ్రులకు ఆరోగ్యం బానే ఉంది కదా..అని ఇలా రక రకాల అలోచనలతో హడావిడిగా స్నానం చేసి,సందీప్ ఇంటికి బయలుదేరింది సుభద్ర.
సందీప్ ఇంటి దగ్గర నాలుగు కార్లు వరకు కనిపించడంతో కంగారు ఇంకా ఎక్కువయ్యింది సుభద్రకి.సందీప్ ఇంట్లోకి అడుగుపెడుతూనే లివింగ్ రూంలో కూర్చుని ఉన్న గీత నాన్నగారిని,వెంకట్ ని,గీత పెదన్నాన్న కొడుకు సురేష్ ని,సందీప్ ప్రాణస్నేహితుడైన రాహుల్ ని చూసింది సుభద్ర.అంతమందిని అక్కడ చూసిన సుభద్రకి ఎందుకో బుజ్జిగాడికి ఏమన్నా అయ్యిందేమో అన్న అందోళన కలిగింది.అక్కడ వారందరి మధ్య సందీప్ లేకపోవడం గమనించి,భర్త వంక బేల గా చూసింది సుభద్ర.లోపలికి పదమంటూ సైగ చేసి,వెనకనే తను వచ్చాడు వెంకట్."సందీప్ ఏడి?బుజ్జిగాడు బాగున్నాడా?గీత ఎక్కడ?"అని ప్రశ్నల వర్షం కురిపించింది సుభద్ర.పై ఫ్లోర్ లో ఉన్న బెడ్రూం లొకి తీసుకెళ్ళాడు సుభద్రని వెంకట్.అక్కడ సందీప్ ఒక్కడే బెడ్ మీద పడుకుని ఉన్నాడు.అలికిడి వినిపించి కళ్ళు తెరిచి చూసాడు.సందీప్ కళ్ళు ఎర్రగా చూడడానికే భయపడేట్టు ఉన్నాయి.సుభద్రని చూడగానే,కళ్ళలో నీళ్ళు తిరిగి,అవి కనపడతాయేమో అన్నట్టు,కళ్ళు వెంటనే మూసుకుని బెడ్ మీద ఇంకో పక్కకి తిరిగి పడుకున్నాడు.
వెంకట్ అక్కడ ఉన్న కుర్చిలో కూర్చుని నెమ్మదిగా సుభద్రతో అన్నాడు,"రాత్రి సందీప్ ని కాప్స్ అర్రెస్ట్ చేసారు.మూడు గంటల క్రితమే ఇంటికి తీసుకొచ్చాము"అని."ఎందుకు?సందీప్ ఏమయ్యిందిరా? ఇటు చూడు"అంటూ తమ్ముడి భుజం పట్టుకుని కుదిపేసింది సుభద్ర.సందీప్ నుండి సమాధానం ఏమీ రాలేదు.వెంకట చెప్పసాగాడు."రాత్రి గీత మీద చెయ్యి చేసుకున్నాడు.గీత కాప్స్ కి ఫోన్ చేసింది. వాళ్ళు వచ్చితీసుకెళ్ళారు" అని.హతాశురాలయ్యింది సుభద్ర.అసలు చెయ్యి చేసుకోవాల్సిన అవసరం ఏమోచ్చింది వీడికి?గీత కాప్స్ ని ఎందుకు కాల్ చేసింది?ఏది గీత?గీతా,గీత అని గట్టిగా పిలవసాగింది సుభద్ర."గీత ఇక్కడ లేదు,వాళ్ళ అమ్మ,బుజ్జిగాడు అందరు సురేష్ ఇంట్లో ఉన్నారు."అని సమాధానమిచ్చాడు వెంకట్.అప్పటికే సుభద్రకి జరగరానిదేదో వారిద్దరి మధ్య జరిగిందని,దాని పర్యవసానం కూడా చాలా త్రీవ్రంగా ఉంటుందని అర్ధం అయిపోయింది."ఏమి జరిగిందో గీత వాళ్ళ నాన్నగారు చెప్పటమే కాని వీడు మాత్రం ఎంత అడిగినా నోరు మెదపటం లేదు.నువ్వు మాట్లాడు"అని ఆ రూం లోంచి బయటికి వెళ్ళిపోయాడు వెంకట్.
సుభద్రకి అప్పటికే కాళ్ళు,చేతులు వణకసాగాయి.నెమ్మదిగా తమ్ముడి పక్కన కూర్చుకుని అడిగింది. అసలు ఏం జరిగిందిరా సందీప్,చెప్పు.మీ ఇద్దరి మధ్య గొడవలేంటి?నాకసలు ఏమీ అర్ధం కావట్లేదు."సందీప్ ఏమీ మాట్లాడలేదు. "సందీప్ అలా కాదు, నా మాట విను. జరిగిన విషయం మాకు ఎలా తెలిసేది, నువ్వు ఇలా మౌనంగా ఉంటూ,నీలో నువ్వు బాధపడితే?దయచేసి చెప్పరా" అని బతిమాలింది సుభద్ర.వెంకట్ కాఫీ కప్పు తో రూం లో కి వచ్చి, సుభద్ర చేతికి ఇచ్చాడు, సందీప్ కి ఇవ్వమని సైగ చేస్తూ.అప్పటికి చలనం లేకుండా ఉన్న సందీప్ ని చూస్తే,సుభద్రకి ఒక్కసారిగా కోపం వచ్చి, కొద్దిగా గట్టిగానే, ఇదిగొ నువ్వు ముందు ఆ మంచం మీద నుంచి లెగు, వాష్ రూం లోకి వెళ్ళి మొఖం కడుక్కుని రా.." అని తమ్ముడి మీద మండిపడింది.అయిష్టం గా లేచి, వాష్ రూం కి వెళ్ళి, కొద్దిసెపట్లో బయటికి వచ్చాడు సందీప్. కాఫీ కప్పు చేతిలో పెట్టి ముందు కాఫీ తాగు అంది సుభద్ర.తమ్ముడి మొఖంలోకి చూస్తూ, కంట తడి పెట్టుకుంది సుభద్ర. "ఏమిట్రా ఇదంతా? ఎలా అయిపోయావో తెలుసా? ఎలా జరిగింది ఇదంతా?" అని మళ్ళీ ప్రశ్నించింది. జరిగింది చెప్పసాగాడు సందీప్.
గీత డెలివరీ కి గీత తల్లితండ్రులు ఇద్దరు,నాలుగు నెలల క్రితమే అమెరికా కి వచ్చారు.గీతకి బాబు పుట్టాక,రెండు నెలల తరువాత,తను ఉద్యోగంలో చేరాల్సిన రోజు రావడంతో అయిష్టంగానే కొడుకుని వదలలేకపోయినా,తప్పని సరి పరిస్థితులలో ఉద్యోగం లో జాయిన్ అయ్యింది.ఇంకో స్టేట్ లో ఉద్యోగం కాబట్టి, వీకెండ్ మాత్రమే ఇంటికి వచ్చేది. భర్త సందీప్ ని,తల్లితండ్రులను,బుజ్జిగాడిని అందరిని వదిలి ప్రతి సోమవారం జాబ్ కి వెళ్ళడానికి మనస్సు అంగీకరించకపోయినా,తప్పదు ఇంకో ఉద్యోగం దొరికేదాకా అనుకుంటూ వెళ్ళేది.సందీప్ రోజులో ఒక్కోసారి 15 గంటల వరకు పని చేసి ఇంటికి అలసి వచ్చేవాడు.కొడుకుతో సమయం గడపలేకపోతున్నానే అని బాధపడుతూనే,ఇంకెంతలే,కొద్దిరోజులే కదా,తను ప్రాక్టిస్ పెట్టుకునే వరకే కదా,అని సర్దిచెప్పుకునే వాడు.గీత తల్లితండ్రులు బుజ్జిగాడిని చాలా ఓపికగా పెంచేవారు.ఒకసారి హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చేసరికి అత్తగారు,పంపులో వచ్చే నీరు బాటిల్ లో పోసి, పట్టించటం చూసిన సందీప్,అత్తగారితో అలా చెయ్యొద్దని, ఫిల్టర్ చేసిన నీళ్ళు కాని, కాచిన నీళ్ళు కాని ఇవ్వమని చెప్పాడు.సరే అంది గీత తల్లి.ఇంకో రెండు సార్లు కూడా అలా జరగడంతో, సందీప్ గట్టిగానే చెప్పాడు అత్తగారితో, దయచేసి ఆ నీళ్ళు పట్టకండి.వాడికేమన్నా చేస్తే,తరువాత హాస్పిటల్ చుట్టూ తిరగాలంటే మాటలు కాదు అని.ఆవిడ అలాగేనని చెప్పింది.
ఆ తరువాత వీకెండ్, గీత అలసిపోయి శుక్రువారం రాత్రి 11:30 గంటలకు ఇంటికి చేరుకుంది.ఆ వారం బుజ్జిగాడికి ఒంట్లో కొద్దిగా నలతగా ఉండటంతో గీత అమ్మగారు,నాన్నగారు కూడా బాగా అలసిపోయి ఉన్నారు.ఆ రోజు కూడా తల్లి వచ్చేవరకు బుజ్జిగాడు నిద్రపోలేదు.అలసి సొలసి ఇంటికి చేరుకున్న గీత కొడుకుని దగ్గరకి తీసుకుని ముద్దాడ సాగింది.అప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టాడు సందీప్."ఎంత సేపయ్యింది వచ్చి" అని గీతతో మాట్లాడుతుండగానే,గీత అమ్మగారు పంపులో నీరు బాటిల్ లో పట్టి, బుజ్జిగాడికి పట్టసాగింది. అది చూసిన సందీప్ గట్టిగా అరిచినంత పని చేసాడు.'ఎన్ని సార్లు చెప్పానండి మీకు?పంపులో నీరు బాబుకి పట్టద్దని? చెపితే మీకు అర్ధం కాదా?" అని విస్సుకున్నాడు సందీప్ గీత తల్లిని.అల్లుడు అలా మాట్లడితే ఆవిడకు కూడా కోపం వచ్చి "మాకు తెలీదా పిల్లలను పెంచడం?" అని ఎదురు చెప్పింది. విస్తుపోయి ఆవిడ వంక చూస్తూ,మీకు చాలా సార్లు నెమ్మదిగా చెప్పాను, అలా చెయ్యొద్దని..మీకు నా మాట అంటే లక్ష్యం లేదు.అయినా మిమ్మల్ని అని ఏమీ లాభం?మా పిల్లలను మేము పెంచుకోకపోవడం మా దురదృష్టం"అనేసి విసురుగా,బాబుని ఆవిడ చేతిలోంచి లాక్కొని తన రూం లోకి వెళ్ళిపోయాడు సందీప్.గీత తల్లి అల్లుడు ఇంత అవమానం చేస్తాడా అంటూ,ఏడవసాగింది."ఎవ్వరి చేత ఒక్క మాట అనిపించుకోలేదు నేను,ఈ రోజు నీ గురించి ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది"అని కూతురుని చూస్తూ, ఏడ్చింది ఆవిడ.తల్లి బాధపడుతుంటే, ఒక్కసారిగా గీతకు ఆవేశం వచ్చి సందీప్ దగ్గరికి వెళ్ళి బాబుని లాక్కుని, నీకసలు బుద్దుందా? పెద్దవాళ్ళతో మాట్లాడే పద్దతి అదేనా? మగవాడినన్న అహంకారం చూపిస్తున్నావా?అమ్మ అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఈ వయస్సులో బాబుని చూసుకుంటుంటే కృతజ్ఞతాభావం ఉండాల్సిన నీకు అది లేకుండా..మా అమ్మని విస్సుక్కుని కేకలు వేస్తావా అసలు నువ్వు మనిషివేనా?అంటూ కోపంతో ఊగిపోయింది.మాట,మాట పెరిగింది వారిద్దరి మధ్య.తల్లితండ్రులు వింటున్నారే అన్న తలంపు కూడా లేకుండా,ఆవేశం తో నోటికి వచ్చినట్లు మాట్లాడి,సందీప్ ని తిట్టసాగింది.బయటకి వచ్చి,మర్యాదగా తల్లికి క్షమాపణ చెప్పమని బెదిరించింది.అత్తగారు,మావయ్యగారి ముందు గీత తనని అలా నిలదీసి మాట్లాడడం సందీప్ కూడా సహించలేకపోయాడు.గీతని గదిలోంచి బయటికి నడవమని ఆదేశించాడు.వినలేదు గీత.గీత చెంప చెల్లుమనిపించాడు సందీప్.ఉక్రోషంతో చేతికి అందిన సరుకులన్ని సందీప్ మీద విసిరెయ్యసాగింది గీత."నన్ను కొడతావా"అని అవేశపడిపోతు.
ఇంతలో గీత తల్లితండ్రులు వచ్చి కల్పించుకుని తనని వేరే గదిలోకి లాక్కెళ్ళిపోయారు.గీత తండ్రి కూడా ఆవేశం తో ఊగిపోతు అల్లుడిని తిట్టసాగాడు."ఎంత ధైర్యం రా నీకు?అల్లారు ముద్దుగా పెంచుకున్నాను నా కూతురుని,కష్టపడి చదువుకుంది,విదేశాలకి వచ్చింది.నీకంటే ఎందులో తక్కువ?దాని ఒంటి నీద చెయ్యి వేస్తావా నువ్వు" అంటూ పట్టరాని అవేశం తో ఊగిపోయాడు అతను.డోర్ లాక్ చేసుకుని తల పట్టుకుని కూర్చుండిపోయాడు సందీప్.ఒక అరగంటలో సందీప్ ఇంటికి కాప్స్(పోలిసులు) రావడం,గీతని కొట్టావా అని ప్రశ్నించి తమతో తీసుకెళ్ళిపోయారు.గీత 911 కాల్ చేసి తనపై పిర్యాదు చేసినట్టు అర్ధం అయ్యింది సందీప్ కి.
(ముగింపు తరువాయి టపాలో)