Friday, July 5, 2013

ఆశ్చర్యం..తెలుగు సినిమా కూడా బాగుంటుందా?



రోజూ వర్షాలు, అప్పుడప్పుడు తూఫానులతో  ఈ వేసవి ఒక ఊపు ఊపుతుంది  మా స్టేట్ ని....దానికి తోడు వేసవి సమయంలో అతిధుల రాక పోకలు. మాకోసమైతే వంట తప్పించుకునేందుకు ఎన్నో కారణాలు వెదికే నేను, అతిధులు వస్తే మాత్రం, రోజుకి మూడుసార్లు తప్పదు  కదా మరి వంట గదితో స్నేహం? ఇకపోతే  యంత్రాల మీదే కాక అప్పుడప్పుడు రోడ్డు మీద పకృతిని చూస్తూ పరిగెడుతూనో లేక నడుస్తూనో వేసవి కాలం గడపడం కూడా నాకు ఇష్టం. బ్లాగ్స్ చూసి, రాసి నెల పైనే అయ్యిందా అనిపించింది నాకు. ఇకపోతే ఈ వేసవి కాలం, కొద్దిగా సినిమాల జోరు కూడా బానే ఉందని చెప్పాలి. హిందీ లో ఒక అర డజన్ సినిమాలు,  ఇంగ్లీష్లో కొన్ని అవేశం గా చూసేసాను. ఇంటికి వచ్చిన అతిధులతో మరీ 24 గంటలు మాట్లాడాలి అంటే కూడా ఇబ్బంది కదండి. పదండి సినిమాకి, అని చెప్పి వరుసగా హిందీ , ఇంగ్లీష్ సినిమాలు చూపించేసాను. తెలుగు మాత్రం ఊహు... నా వల్ల కాదు అని ఒక్కటి కూడా చూడలేదు, చూపించలేదు. 

ఇదిలా ఉండగా, అతిధులు వెళ్లాక, మాకు ఈ స్వాతంత్ర దినోత్సవం సెలవలు వచ్చేసాయి. ఈ సంవత్సరం చాలామందికి 4 రోజులు సెలవలు వచ్చాయి. సాధారణం గా ఇలాంటి సెలవలు వస్తే నాకు  హాయిగా న్యు యార్క్ - Time square  వీధుల్లో ముఖ్యం గా రాత్రి సమయంలో నడుస్తూ గడపడం అంతే మహా ఇష్టం. ఇంకేంటి అడ్డం? మరి వెళాదామా అని ఇంట్లో ప్రశ్న...ఊహూ..లేదు ఈ నాలుగు రోజులు వర్షం లేకుండా ఉంటే  నాకిక్కడే  గడపాలని ఉంది అని సమాధానమిచ్చాను. ఇంతలో స్నేహితురాలు ఒక సినిమా trailer పంపింది చూడమని...అది తెలుగు సినిమాది అని చూసి, పెదవి విరిచి, చూసాలే అని స్నేహితురాలికి సమాధానమిచ్చాను. నచ్చలేదా trailer అని మళ్ళీ ప్రశ్న. సరిగ్గా చూడలేదు, చూసి చెపుతానని దాటేసాను సమాధానం. తప్పకుండా చూడు అని చెప్పి ఫోన్ పెట్టేసింది. 


అంతగా చెప్పింది కదా అని సినిమా పేరేమిటా  అని వివరంగా చూసాను. ఒక చిన్న shock! "మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు" ....ఇదేంటి ఇలాంటిదే మొన్నీమధ్య ఒక తల తిక్క సినిమా "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" అని కదా వచ్చింది? ఆ సినిమాకి వచ్చిన హైప్ చూసి వెళ్ళి ఎంతో నిరుత్షాహపడడం నాకింకా గుర్తే....ఆ సినిమాకి పేరడీ అయ్యి ఉంటుంది, అని విరక్తి కలిగి, తెలుగు డైరక్టర్లను , వారు ఎంచుకుంటున్న ఈ సినిమా టైటిల్స్ కి ఒక నమస్కారం పెట్టి ఆ trailer చూడకుండా కసిగా స్నేహితురాలు పంపిన ఇమైల్ మూసేసాను. 

మళ్ళీ మరునాడే ఫోన్..."సినిమా కి వస్తావా , వెళదాము ఈ రాత్రి"  అని. "అయ్యబాబోయి నా వల్ల కాదు తల్లీ , నీకో దండం నన్ను ఒదిలెయ్యి ఈ సారి"అని బతిమాలాను. "అర్ధం అయ్యింది.. తమరు trailer చూడలేదు .....ముందు వెళ్ళి trailer చూడు. నీకు నచ్చుతుంది అని నాకు గొప్ప నమ్మకం" అంది. తప్పేట్టు లేదురా భగవంతుడా అని trailer చూసాను. నిజమే చాలా బాగుంది అనిపించింది. ముగ్గురి వ్యక్తుల కథ లా అనిపించింది. మనసులో చిన్న ఆశ, బాగుంటుందేమో అని...,వెంటనే తెలుగు సినిమాల మీద అంతకు ముందు ఏర్పరుచుకున్న బలమైన అభిప్రాయం ముందు ఆ చిన్న ఆశ సన్నగిల్లిపోయింది. అసలు ఏమాత్రం ఆశించకుండా, స్నేహితురాలి బలవంతం మీద వెళ్ళి ఈ రోజు చూసాను ఆ సినిమా.... "మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు" 

                   http://www.youtube.com/watch?v=LDCj7Zxs-y0
సినిమా పూర్తయ్యేటప్పటికి, మనసంతా ఆనందం... ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక "అందమైన కవిత" అని చెప్పాలి. ఈ సినిమా కథ మూడు ముక్కల్లో చెప్పొచ్చు... కాని సినిమా తీసిన విధానం, పాటల చిత్రీకరణ,సినిమాలో ప్రతి ఫ్రేం ఎంతో అందం గా ఒక చక్కటి గ్రీటింగ్  కార్డ్ లా ఉంటుంది. సున్నితమైన సంభాషణలు, సున్నితమైన భావాలు ఎంత అందంగా తెరకెక్కించాడో ఆ దర్శకుడు. ఇది అని చెప్పలేని భావమేదో నన్ను ఊపేసింది. వెరసి ఈ రోజు నేను చూసిన సినిమా ఒక గొప్ప కావ్యం అని అంటే అతిసయోక్తి కాదేమో!!!!!



ఇకపోతే ఈ సినిమా విజయవంతమయ్యే అవకాశం చాలా, చాలా తక్కువ. మగవారు  80% ఈ సినిమా లో ఎక్కువ సేపు కూర్చోలేరు...ఎందుకంటే  సున్నితమైన మనసున్న మగవారు చాలా తక్కువ కదండి? అమ్మాయి తన మానసిక సంఘర్షణ, తన ప్రేమ, తన భర్త గురించి మనకి చెపుతుంటే .......అలా రెండు గంటలు ఎలా గడిచాయో తెలియలేదు నాకు. పాటలన్ని ఎంతో బాగున్నాయి. పాత్రలు పోషించిన వారందరు చాలా బాగా చేసారు. ముఖ్య పాత్రలు మూడు. తండి పాత్ర, అక్క పాత్ర వేసిన వారు కూడా చాలా బాగా చేసారు. సినిమా అంతా కథ మీదే ఉంటుంది. Absolutely no commercial elements at all. అసలు deviation అన్నది లేదు story line నుండి..... నాకు effective gaa చెప్పటం చేతకాలేదనిపిస్తుంది...కాని మొత్తానికి తెలుగు సినిమా కూడా బాగుందండోయి అని గర్వం గా చెప్పుకోగలను అనిపించింది. మీరెవ్వరైనా ఈ సినిమా చూస్తే మరి మీ అభిప్రాయాలు పంచుకోవడం మరచి పోకండి. ఇంకెవ్వరైనా ఈ సినిమా రివ్యు  అందం గా రాస్తే చదవాలని కూడా ఉందండోయి.

51 comments:

  1. మీరు రాసాక నాకు చూడాలనిపించింది. నేను కూడా ట్రైలర్ చూసాను. అందులోనే నాకు కొంచెం భావుకత్వం కనిపించింది. మిగతాది చూసి రాస్తాను.
    థాంక్స్ ఫర్ షేరింగ్ ది లింక్ వెన్నెలగారు

    ReplyDelete
    Replies
    1. పూర్వ ఫల్గుణి గారు, తప్పకుండా ఆలశ్యం చెయ్యకుండా చూసెయ్యండి మరి. మీకు 100% నచ్చుతుంది. నేను ఈ సినిమా చూసినప్పుడు , 300 మంది చూడగలిగే ధియేటర్ లో ఉన్నది నలుగురు మాత్రమే!:)ధన్యవాదాలండి.

      Delete
  2. Appudappudu ala pushkaraaniki okasari telugu lo manchi cinemaalu vastuntaayi ,natini tappakunda chudandi

    ReplyDelete
    Replies
    1. ఆ పుష్కరం ఎప్పుడా అని ఎదురుచూసానండి చాలా కాలం నుండి. మధ్య మధ్యలో ఆశపడి చూసి కొన్ని సినిమాలు, నిరుత్సాహపడ్డాను. అందుకే ఆనందం తట్టుకోలేక ఈ పోస్ట్. ధన్యవాదాలు.

      Delete
  3. enduku director kuda magavade

    ReplyDelete
    Replies
    1. May be critic cheppinatlu, athi thakkuvagaa unde sunnithamayina manasu gala magavadu ayivundavachu...

      Delete
    2. శ్రవణ్ గారు, నిజమేనండి. తప్పే అలా రాయకుండా ఉండాల్సిందేమో!

      Delete
    3. @Mind digger, 20% లో ఆ డైరక్టర్ గారు ఉన్నారు,అంతే అంతే :)

      Delete
  4. but finally cool movie i like it

    ReplyDelete
    Replies
    1. I am so glad you liked it. మీది అందమైన మనసు అనమాట!

      Delete
  5. నిజమా? అయితే చూస్తాము.

    ReplyDelete
    Replies
    1. చూడండి బోనగిరి గారు.మనం చూసే ఎన్నో చెత్త సినిమాలతో పోల్చితే చూడతగ్గ సినిమా..మీరు నిరుత్షాహపడకపోవచ్చు.

      Delete
  6. "ఇకపోతే ఈ సినిమా విజయవంతమయ్యే అవకాశం చాలా, చాలా తక్కువ."
    రుద్రవీణ నుండీ చూద్తున్నాం కాబట్టి ఈ విషయం ఒప్పుకోక తప్పదు.

    "సున్నితమైన మనసున్న మగవారు చాలా తక్కువ కదండి?"
    హెంతమాట? మగాళ్ళు నిజానికి weaker sex (quotes మిస్సయానా?) అన్నవిషయం మీకు తెలుసా (నా సోర్సు Reader's Digest అండీ)? "తక్కువ" కంటే ఎక్కువ మగాళ్ళు మగాళ్ళు స్త్రీ హృదయంకనా సున్నితంగా ఉంటారన్న విషయం మీరెలా మర్చిపోయారు?

    ఏం జేస్తం? ఒట్ట్లు గట్ట్నబెట్టి సైన్మా జూస్తం. Thank you.

    ReplyDelete
    Replies
    1. Indian Minerva గారు...,అంతేనంటారు...నిజమేనంటారా? Weaker/Stronger sex గురించి పక్కన పెట్టేదాము.(మీ stats, sources మీద అనుమానం లేదండోయి నాకు. :) చూడండి సినిమా, మీరు కూడా ఓ గొప్ప అనుభూతికి లోనవుతారు అని నాకు నమ్మకం. Thank you so much for the comment.

      Delete
  7. http://www.123telugu.com/reviews/mallelateeram-lo-sirimalle-puvvu-a-poetic-saga.html,..చూసే ప్రయత్నం చేయాలిక,..

    ReplyDelete
    Replies
    1. భాస్కర్ గారు, లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.కవులందరు తప్పక చూడాలండి ఈ సినిమా.

      Delete
  8. శ్రీ గారు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మీ పోస్ట్. .చాలా హ్యాపీ !
    తప్పకుండా చూస్తాను. మీరు ఇంతగా చెప్పిన తర్వాత సినిమా చూడాలనిపిస్తుంది మరీ!

    ReplyDelete
    Replies
    1. వనజ గారు, నాదోక చిన్న కోరిక. మీరు ఈ సినిమా చూసి రివ్యు వ్రాయాలండి. తొందరగా చూసేసి త్వరగా ఒక టపా వ్రాసెయ్యండి.మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు

      Delete
  9. http://telugumirchi.com/te/reviews/mallela-theeram-lo-sirimalle-puvvu-review-ratings.html
    VEDULA SURYANARAYANA MURTY

    ReplyDelete
  10. జలతారు వెన్నెల గారూ,
    మీరన్నట్టు బహుశా నేను కూడా పాషాణ సదృశమైన హృదయం ఉన్న మగవాళ్ళాలో ఒకడ్ని కావడం వల్లనేమో, 'మల్లెలతీరంలో blah blah .... సినిమా చూసి (80 శాతం మా మొరటు మగ వారిలా మధ్యలో లేచిపోకుండా మొత్తం సినిమా చూశాక), చటుక్కున ఫేస్ బుక్ లో పెట్టిన comment ఇది. కొంచెం అసందర్భం అనిపించినా, ఓపిక చేసుకొని చూడగలరు...
    ----------------------------
    రాత్రి “మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు ప్రివ్యూ”కి వెళ్ళాను. ఫేస్ బుక్ లో దాని గురించి చూస్తూ ఉండటం వల్ల, బాగుందని చెబుతున్న వారిలో నేను ట్రస్ట్ అయ్యే Mahesh Kumar Kathi Venkat Siddareddy వంటి మిత్రులు ఉండటం వల్ల చూడాలని గట్టిగా అనుకున్నాను. వెంకట్ సిధారెడ్డి పుణ్యాన సినీమాక్స్ లో వెళ్ళాను.
    సినిమాని మొత్తం భరించాక, బైటకి వచ్చి, ముందు ఆలోచించింది మహేష్ కత్తి, వెంకట్ సిధారెడ్డి ల గురించే. వీళ్ళకి ఎందుకిది ఉన్నతమైన దృశ్యకావ్యంలా అనిపించింది? “చూడకపోతే ఏమీ కాదు ఒక మంచి అనుభవాన్ని కోల్పోవడంతప్ప. ఒక హృదయస్పందనని కాదనుకోవడంతప్ప...”. అంటూ subtle గా బెదిరించేంతగా ఎందుకు నచ్చింది చెప్మా అని సినిమా హాలు నుంచి, ఇంటి దాక (మా ఇల్లు విజయవాడ పక్కనే ఉండే దిల్ షుక్ నగర్) వరకూ ఆలోచిస్తూ వెళ్ళాను.
    ఇద్దరు మిత్రులూ బాగా చదువుకున్న వారు. ముఖ్యంగా ప్రపంచ సినిమా మీద వారి పరిజ్ఞానం వికీపీడియా, గుగుల్ ఆధారిత ఉపరితల సమాచారజ్ఞానం కాదు. ఇంకా చెప్పాలంటే, తెర ముందు ఆర్మ్ చైర్లో కూర్చొని పాప్ కార్న్ తింటూ off the cuff రిమార్కులు పాస్ చేసే వారు కానేకాదు. ఆశ్రిత పక్షపాతంతో అర్హత లేనివాటిని భుజాన మోసే తత్వం లేదు. తెలుగు సినిమాకి కాంట్రిబ్యూట్ చేయటానికి వాళ్ళ lucrative careers ని ఫణంగా పెట్టి తపించే యువకులు. అటువంటి స్థాయి ఉన్న వారికి నచ్చే అంశాలు ఏమున్నాయా అని తీవ్రంగా ఆలోచించాను.
    (నా దృష్టిలో కనీశం అర్థ శతాబ్దిగా అత్యంత హీన దశలో ఉన్న) తెలుగు సినిమాకి ఏదో మరమత్తు చేయాలని శక్తికి మించి ఎదురీదుతున్న ఈ మిత్రుల ఆరాట మే, బహుశా ఈ ‘మల్లెలతీరంలో....’. సినిమా బాగుందని వారిచేత అనిపించిందేమో. ఒక ఆలోచన ఒక సమష్టి ప్రయత్నమై, ఒక సినిమా గా రూపం తీసుకోవడంలో ఉన్న అన్ని సాధకబాధకాలు తెలిసి, ఆ ఆలోచన run-of-the-mill లాంటి, రొడ్డకొట్టుగా కాకుండా ఏదో తమకి తిలిసిన పరిధిలో నిజాయితీగా తీయాలని అనిపించి, తీసి, వీటన్నిటికీ మించి, కొన్ని mafia కుటుంబాలుగా చెప్పుకునే సినీ పెద్దల monopoly ని దాటుకొని, దానిని విడుదల ఫేజ్ కి లాక్కు వచ్చిన దర్శకుడి కష్టం తెలియడమే, వారి బలం, బలహీనత అయ్యి ఉండవొచ్చు.
    ఈ మధ్య వస్తున్న సినిమాలలో అంటూ కొన్ని సర్దుబాట్లు చేసుకోని, కొంత soft corner అరువు తెచ్చుకో వలసిన అగత్యం నాబోటి సామాన్యమైన ప్రేక్షకుడికి ఎంత మాత్రం లేదు. కాబట్టి, వారికి ఎందుకు నచ్చిందో అర్థమయ్యింది కొంతలో కొంత.
    ఇంత మాట్లాడేశాక`, ఇక నాకు ఎందుకు నచ్చ లేదో విధిగా చెప్పాలి కానీ, దానికి నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.
    వదులైన అల్లికవంటి కథ- కథనాలతో సాగిన ఈ సినిమాని చూస్తూ పోతున్నప్పుడు సహజంగానే చాలా ఖాళీలు ఏర్ప డుతూనే ఉంటాయి. సినిమా ముగిసాక ఖాళీలన్నీ ఏకమై ఒక అసంతృప్తిగా ముక్తాయించి, సినిమా బాగాలేదని సర్దిచెప్పుకొని బైటపడొచ్చు. కానీ, ఏమిటా ఖాళీలు అంటే మాత్రం, చెదురుమదురుగా పడి ఉన్న సన్నివేశాలని పూసలుగా గుచ్చుకోవాలి. Rhetoric దిశగా అడుగులు వేస్తున్న సినిమాలో, డైలాగుల్లో ఎక్కడో ఆ ఖాళీలకి అతుకు మాసికలు వేసే పాచ్ వర్క్ జరిగి ఉండొచ్చు. గాఢమూ, కవితాత్మకమూ అని భ్రమపెట్టే ఆ మాటలు ఒక పక్క; పూలూ, దీపాలు వంటి కంటికి కనిపించే objects, మనసు, అద్వైతం, హృదయ సంగమం వంటి నైరూప్యమైన ప్రతిపాదనలు కలగలిపి మరో పక్క బారులు తీరి, సినిమా మంచి చెడుల్ని ఆలోచించే సావకాశం ఇవ్వకుండా ఇదొక సున్నితమూ, సౌకుమార్యమూ అయిన కళాత్మక ఉత్పత్తి అని మెత్తగా బ్లాక్ మెయిల్ చేస్తున్నా తట్టుకొని, ఆ ఖాళీల గురించి మాట్లాడాలి. దానికి కొంచెం వ్యవధి ఉండాలి, ఇలా spontaneous గా చెప్పడం కుదరదు.

    ReplyDelete
    Replies
    1. visleshanatmaka maina mee reply/response baavundi.

      Delete
    2. నరేష్ గారు, మీరు మీ స్పందనను పంచుకున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. మీకు నచ్చకపోవటం పెద్ద విషయమేమి కాదు.connect అవ్వలేకపోయారు అంతే! I agree..not everyone can like this movie.. బ్లాగ్లోకం లో చాలా మందికి మాత్రం నచ్చవచ్చు అని మాత్రం అనుకున్నాను. నాలుగు చెత్త డైలాగులు, నాలుగు ఫైట్లు, అర్ధం పర్ధం లేని వెర్రి సినిమాలు చూసాక విరక్తి చెంది...తెలుగు సినిమాలే చూడడం మానేసిన తరుణం లో ఇలాంటి ఒక గొప్ప భావుకత తొ కూడిన సినిమా రాగానే ఆనందం అంతే!

      అదేంటండి...మీరు మీ ఇల్లు విజయవాడ పక్కనే ఉన్న దిల్ షుక్ నగర్ అని వ్రాసారు?:)))

      Delete
    3. dilsukh nagar , vanasthalipuram mari vijayawada pakkana unnayi ani rayaali prastutam 4 way/ 6 way vacchaaka hyd- vij max 5hrs lo veltunnamu kaani panjagutta to dilsukh nagar maatram 1 hour easyga padutundi andukani.

      Delete
    4. ధన్యవాదాలు మీ వాఖ్యకి వినయ్ భాస్కర్ గారు.

      Delete
  11. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. కమల్ గారు, మీ కామెంట్ ఎందుకు తీసేసారు? ఎవరి అభిప్రాయం వారిది కదా? ఈ సినిమా నచ్చని స్త్రీలు ఉండరు అని నేను అనుకోవడం లేదండి. :)

      Delete
  12. Replies
    1. తప్పకుండా చూడండి..మీ అనుభూతిని, స్పందనను తెలియచెయ్యడం మరచిపోకండే!ధన్యవాదాలండి

      Delete
  13. మీరు అన్నాకైనా మాది సున్నిత హృదయమని నిరూపించుకునేందుకు చూస్తానండీ...:-)

    ReplyDelete
    Replies
    1. 200% certify చెయ్యగలనండి...మీరు సున్నిత హృదయులండి వర్మ గారు.మీరు వెంటనే చూసెయ్యండి. మీకు నచ్చుతుంది సినిమా..ధన్యవాదాలండి మీ వాఖ్యకి

      Delete
  14. నేను కూడా ఎదురుచూస్తున్నానండి ఈ సినిమా చూడటం కోసం! ఈ మద్యకాలంలో బాగా నచ్చి పదే పదే వింటున్నవి కూడా ఈ సినిమా పాటలే.

    ReplyDelete
    Replies
    1. వరూధిని గారు , మీరు చూడటమే కాదు. ఒక టపా రాసెయ్యండి..మీ స్పందనను తెలియచేస్తూ. ధన్యవాదాలండి

      Delete
  15. మీ బ్లాగ్ తెరవగానే ఒక రక మైన ప్రశాంతత మనసునావరించింది. చాలా బాగుంది. కొత్తగా..
    తప్పక చూస్తాను ఆ సినిమా!

    ReplyDelete
    Replies
    1. మీకు నా బ్లాగ్ కి స్వాగతం. ఉదయం నేను లేవగానే చూసిన మొదటి కామెంట్ మీదే! మీకు బ్లాగ్ నచ్చినందుకు చాలా చాలా థాంక్స్!చూడండి,మీకు నచ్చుతుందని ఆసిస్తూ..

      Delete
  16. తెలుగులో సున్నితమయిన భావుకత్వంతో కూడిన సినిమా అంటుంటే ఇది కళా(లా ) నిజమా,నా కళ్ళు సరిగ్గానే పని చేస్తున్నాయా,నేను బ్లాగు అను టపా బాగానే కూడబలుక్కొని చదువుతున్నానా అని అనుమానం వచ్చి ఒకసారి నన్నునేను గిల్లిచూసుకున్నాను!

    ReplyDelete
    Replies
    1. నేను ఈ టపాల చెప్పినవన్ని అక్షర సత్యాలండి సూర్యప్రకాష్ గారు.తప్పకుండా సినిమా చూడండి. నచ్చకపోతే మనస్సులో నాకు కొన్ని అక్షింతలెయ్యండి , ఫర్వాలేదు..

      Delete
  17. నా స్నేహితుడొకడు పాటలు బాగున్నాయి అని సజెస్ట్ చేస్తే విని ఆ మొదటి శ్రవణంలోనే వాటితో ప్రేమలో పడిపోయి నెలరోజులుగా విని విని విని ఇంకా వింటూ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దా ఎప్పుడు చూస్తానా అని ఎదురుచూశా...కాని బాధాకరంగా నిన్న కేవలం రెండు థియేటర్లలో రిలీజ్ అయింది. అయినా పర్లేదని నా ఫ్రెండ్స్ ఇంకోఇద్దరిని బ్రతిమాలి బెదరగొట్టి తీసుకువెళ్ళాను అరగంట గడిచాక ఒకడేమో తలపట్టుకున్నాడు ఒకడేమో దోమలు తోలుతూ నిద్రపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు :) వాళ్ళకు నచ్చలేదేమో అనుకున్నా కాని చిత్రంగా, సినిమా మధ్యలో, ఎవరో చెత్తగా అరుస్తుంటే అన్నారు ’వీళ్ళు మారరు... ఇది అలాంటి సినిమా కాదురా’ అని. సో... సినిమా బాగోలేదని కాదు కాని గ్రిప్పింగ్ గా లేదు. లక్ష్మి పాత్ర, తన అంతరంగం, ఆమె మాటలు చాలా నచ్చాయి ఎటొచ్చి ఆమె ఇష్టపడిన క్రాంతి లోనే Kranthi's character could have been more expressive more intense. సినిమా నిడివి కూడా ఓ 30-40 నిముషాలు తగ్గించొచ్చు అనిపించింది but despite all these 'లక్ష్మి' కోసం మరోసారి చూడొచ్చు :) :)

    ReplyDelete
    Replies
    1. నాగార్జున గారు, నాకేందుకో క్రాంతి కారక్టర్ బాగా నచ్చింది. లక్ష్మికి వివాహిత స్త్రీ అన్న విషయం అతను ఎప్పుడు విస్మరించలేదేమో! అందుకని అతని పాత్రని ఎంతో సంస్కారవంతం గా అలా మలచాడేమో దర్శకుడు. ఈ రోజు నేను మళ్ళీ చూడడానికి వెళుతున్నాను. :) మొదటిసారి చూసినప్పుడు 300 మంది పట్టే ధియటర్ లో ఉన్నది నలుగురు మాత్రమే, మాతో కలిపి..చూడాలి, ఈ రోజు ఎంత మంది వస్తారో! ధన్యవాదాలు మీ వాఖ్యకి. అవును వేణు గారు ఎక్కడ? వారి రివ్యు కోసం నేను ఇక్కడ waiting అండి.

      Delete
    2. జలతారు వెన్నెల గారు, ఈ వేణు నేనేనని అనుకుంటున్నాను థాంక్సండీ మీకామెంట్ ఇపుడే చూశాను :-) ఈ సినిమా నేను విడుదలైన రోజే చూశానండీ కానీ రివ్యూ రాసే ధైర్యం చేయలేకపోయాను. తెలుగుదనం ఉట్టిపడేలా చిత్రీకరించారు కానీ సబ్జెక్ట్ విషయమై నాకు ఉన్న అభ్యంతరాలకు తోడు స్లో పేస్, పాత్రల చిత్రణలో అస్పష్టత నన్ను విసిగించాయి, దర్శకుడు నన్ను పూర్తిగా కన్విన్స్ చేయలేకపోయాడు. ఒక వారంలో విశ్లేషణలాంటిదేమైనా రాయడానికి ప్రయత్నిస్తాను. పాటలు, ఆర్ట్ డైరెక్షన్, లక్ష్మి చీరలు మాత్రం నాకు చాలా చాలా నచ్చేశాయి :)

      Delete
    3. మీరే నండి నేను పైన అడిగిన వేణు గారు.
      మీకు అంతగా కథాపరం గా ఈ సినిమా తృప్తి నివ్వలేదనమాట.నిజమే, కథాపరం గా పెద్ద గొప్ప కథ కాదు.మీ రివ్యు కోసం ఎదురుచూస్తాను.

      Delete
  18. అవునా? సున్నితమైన తెలుగు సినిమా చూసి (వచ్చి) చాలా కాలం అయ్యింది. ఇది చదివాక ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది. మీ అనుభూతి పంచుకున్నందుకు ఇలా ఈ సినిమా గురించి తెలిసినందుకు చాలా సంతోషం.

    ReplyDelete
    Replies
    1. చిన్ని ఆశ గారు, సినిమా అంతా paintings అండి. మీలాంటి కళాకారులు అసలు మిస్సవకుండా చూడాల్సిన సినిమా...తొందరగా చూసెయ్యండి.ధన్యవాదాలు మీకు.

      Delete
  19. miru cheppinantha goppaga ledhu. melaga matladatam, sickga vundatam, frames assallu kadalakapovadam, paatha maatalu, asalu navvakapovadam, melaga nadavatam- naakaithe sickga anipinchindhi. slowga, sickga vundatam goppa, manchi cinima qualificationsa?

    ReplyDelete
    Replies
    1. పోన్లేండి...ఎన్ని చెత్త సినిమాలు చూడలేదు మీరు? ఇదొకటి అనుకోండి రవి గారు. మీరు ఎందుకో బాగా చీన్నవారయి ఉంటారని, తెలుగు సాహిత్యాని ఇష్టపడతారని అనుకోవడం లేదు. తప్పేమి లేదు లెండి...

      Delete
  20. స్ఫైడర్ మాన్...బాట్ మాన్...ట్రాన్స్ఫార్మర్స్ లాంటి సినిమాలు పదుల సార్లు చూసే.......ఇంటర్ పాసయిన....మా పెద్దబ్బాయ్.. సీతమ్మ వాకిట్లో....సినిమా...మొదటి రెండు రోజుల్లో...మూడు సార్లు చూశాడు...ఇంటర్ లో జాయిన్ అయిన ,మా చిన్నబ్బాయ్...డీవీడి ..వైజాగ్ నుంచి వస్తూ...షాపు వెతుక్కుని వెళ్ళి..మరీ కొనుక్కుని తెచ్చుకుని...ఇంట్లో మరోసారి చూసాడు...
    ఎవరిని... ఏ ఎలిమెంట్...మనసును టచ్ చేస్తుందొ...చెప్పలేం...
    @సున్నితమైన మనసున్న మగవారు చాలా తక్కువ కదండి?
    హాహ్హా...సినిమాల్లో నో...పుస్తకాల్లో నో...వెతుక్కోవలసిందే...మగవాళ్లకు మనసెక్కడ?అందులో సున్నితమయిన మనసు.....నటిస్తారేమో..
    ..మగాళ్లకు అనాటమీ నే తెలుసు...క్షమించాలి..భగవంతుడిచ్చిన మనస్సు...ఎప్పటకీ చూడలేరు......
    మంచి సినిమాను పరిచయం చేసారు...మంచి డిస్కషన్ కూడా....

    ReplyDelete
    Replies
    1. ప్రసాద్ గారు,బాగున్నారా? తెలుగు సినిమాల చూడాలంటేనే భయపడే ఈ రోజుల్లో , ఇలాంటి సినిమా చూడగలిగానే అన్న ఆనందం నన్ను నిలవనీయలేదు. అందరికీ చెప్పెయ్యాలన్న తాపత్రయంతో, ఎక్కడ ఈ సినిమా అందరు చూడడం మిస్స్ అవుతారో అని, ఈ టపా చాలా హడావిడిగా రాసేసాను. నా టపాకి ఎప్పుడు రాని హిట్స్ ఒక్క రోజులో 700 పైగా వచ్చాయి. ఆశ్చర్యపోయాను. నాకైతే ఈ సినిమా బోక్ష్ ఆఫీస్ కల్లక్షన్స్ ఎలా ఉంటాయా అని ఆసక్తి గా ఉంది. మగవారికి సున్నితమైన మనసు ఉండదేమో అని రాసి, కొందరికి మనస్తాపం కలిగించానని అనిపించింది. ధన్యవాదాలు మీ వాఖ్యకి.

      Delete
  21. ఇకపోతే ఈ సినిమా విజయవంతమయ్యే అవకాశం చాలా, చాలా తక్కువ. మగవారు 80% ఈ సినిమా లో ఎక్కువ సేపు కూర్చోలేర...ఎందుకంటే సున్నితమైన మనసున్న మగవారు చాలా తక్కువ కదండి""""-----ఎంత బాగాచెప్పారో..title వినగానే weekdays లొ నేను office వెళ్ళాక వెళ్ళు కావాలంటే అనేసారండి...hmmmm...

    ReplyDelete
    Replies
    1. :) నిరు గారు...:) మీరు చూసారా లేదా చెప్పండి. మీ వారికి బేబి సిట్టింగ్ పని పెట్టేసి మీరు వెళ్ళి చూసి రండి. You will not be disappointed at all! Thanks for the comment.

      Delete
  22. సినిమా విడుదలైనప్పటినుంచీ రివ్యూలు చదువుతుంటే.. సినిమా చూడాలన్న కోరిక పెరిగిపోతోంది. ఈలోగా పాటలు విందామని ఈరోజు డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక అప్పటినుంచి కంటిన్యూగా ఆ పాటలు వింటూనే ఉన్నాను వెన్నెలగారు... అంత బాగున్నాయి పాటలు...

    సినిమా మరింత బాగా ఉంటుందని మీ రివ్యూతో అర్థమవుతోంది. త్వరలో చూసేస్తాను... థ్యాంక్యూ ఇంత మంచి రివ్యూ అందించినందుకు :)

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా చూడండి శొభ గారు. పాటలు సినిమా లో సంధర్భోచితం గా చాలా బాగుంటాయి.కానీ విచారించదగ్గ విషయం ఎమిటంటే ఈ సినిమా మొదటి సారి చూసినప్పుడు నలుగురు మాత్రమే సినిమా హాల్ లో ఉన్నారు. రెండొసారి చూసినప్పుడు, కూడా నలుగురు మాత్రమే! నాకు తెలిసి అమెరికా లో విజయవంతం కానట్టే అనుకుంటానండి.ధన్యవాదాలు మీ వాఖ్యకి.

      Delete