ఈ రోజు ఉదయం నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే,ఒక విషయం చర్చకు వచ్చింది. అది నన్ను అలోచనకు గురిచేసింది.ఆఫీస్ లో పనిచేస్తున్నా, మధ్యాన్నం లంచ్ చేస్తున్నా,మీటింగ్ లో ఉన్నా అలోచిస్తూనే ఉన్నాను. చివరకు నా అలోచనలు తెగేటట్లు లేవు అని ఈ భారమంతా మీ అందరి మీద కొద్దిగా వేద్దామా అని ఒక కుట్ర పన్ని, ఇలా ఈ పోస్ట్ రాసేస్తున్నా..
ఇంతకీ మా చర్చాంశం ఏమిటంటే బ్లాగ్స్ లో అందరికీ ఉపయోగపడే విషయాలు కాని, కొద్దో గొప్పో మన బ్లాగ్స్ చదివిన వారికి మన ప్రతి పోస్ట్ ఎదో ఒక సందేశం కానీ, మంచి విషయం కాని, తెలియని విషయాలను తెలిపేటట్లు కాని ఉండాలి అనీ,లేదా కనీసం అలోచింపచేసేది గా ఉండాలని, మనమందరమూ బ్లాగ్స్ లో పోస్ట్ లు రాసేటప్పుడు ఒక స్టాండర్డ్ మెంటెయిన్ చెయ్యాలని చర్చ! ఇక కామెంట్స్ విషయానికి వస్తే కూడా "నాం కె వాస్తే" (ఎదో కామెంట్స్ రాయలని రాయడమే కాని, ఇంకేమికాదు అన్నట్టు) లా కాక మనం రాసే ప్రతి కామెంట్ లో కూడా అర్ధవంతం గా ఉండాలి అని.
ఈ చర్చ అయ్యాక, నాలో ఒక రకమైన గుబులు మొదలయ్యింది. ఏదో ఆ రోజు మనసులో ఏముంటే అది రాయడమే కాని, ఎప్పుడు..ఈ పోస్ట్ కి అర్ధం ఉందా, ఎవరికన్నా ఉపయోగపడుతుందా, ఇప్పుడు ఈ పోస్ట్ రాయడం వల్ల నేను ఎమన్నా సందేశం ఇస్తున్నానా అన్న అలోచన నాకు ఇంతవరకు రాలేదు.నా పోస్ట్ లో ఒకటో, రెండో తప్ప ఎవరికి ఉపయోగపడే పోస్ట్ లైతే లేవు. పోస్ట్ లన్నిటికీ కామెంట్స్ వస్తుంటే, హమ్మయ్య చదువుతున్నారు కదా అని సంబడం తప్ప,పెద్దగా అలోచించలేదు. నా మటుకు నేను నిజంగానే సరదా/fun కోసమే రాసుకుంటాను. ఎవరిని నొప్పించకుండా రాస్తే చాలు అని మాత్రం అనుకుంటాను. ఎప్పుడన్నా నేను చూసిన, ప్రభావితమయిన సంఘటనలు ఉంటే వాటి గురించి కూడా రాస్తాను. రాజకీయలలో , సినిమాలలో, లేదా పురాణాలలో, కవిత్వంలో,అధ్యాత్మికం గా కూడా ఉన్నది మిడి, మిడి జ్ఞానమే! కొంతమంది బ్లాగ్ మిత్రులు రాసేవి చూసి అబ్బురపడుతూ ఉంటాను. ఎంత జ్ఞానవంతులో కదా అని.అలాంటి వారి బ్లాగ్స్ చూసినప్పుడు నిజమే ఏదో నేర్చుకున్నాము, తెలియని విషయాలు తెలుసుకున్నాము అని అనిపిస్తుంది, చాలా సంతృప్తిగా ఉంటుంది కాని, నేను కూడా అలాగే రాయలనుకున్నా రాయలేనే!!
ఇప్పుడు ఇంక ఒకరకమైన సందిగ్ధం లో పడ్డాను.ఒకవేళ నిజంగా బ్లాగ్స్ లో పోస్ట్స్ కూడా జాగ్రత్తగా రాయాలి, ఏదో సరదాగా రాయకూడదు అన్నది నిజమైతే, నేను రాంగోపాల్ వర్మ లా అలోచిస్తున్నానా? ఎవరేమనుకుంటే నాకేంటి...నాకు నచ్చింది, నా మనసులో అనిపించింది మాత్రమే రాయాలి అన్న అలోచన తప్పా? సరదాగా కాలక్షేపానికి చదువుకుంటున్న, రాస్తున్న పోస్ట్స్ అన్నీ ఆపెయ్యాలా?అసలు నిజంగా బ్లాగ్స్ లో ఏమి రాయాలి? బ్లాగింగ్ మీద సరైన అవగాహన లేకుండా బ్లాగింగ్ మొదలుపెట్టానా ...ఏంటో,అంతా అయోమయం...కొంచెం మీ అందరి అభిప్రాయలు తెలియచెయ్యండి...బ్లాగింగ్ మీద... నా బ్లాగింగ్ మీద కాదండోయి.! అసలు బ్లాగ్స్ రాసేటప్పుడు మనకి మనం స్టాండర్డ్స్ ఇంపోస్ చేసుకోవాలా అన్న విషయం మీద!!!!!

బ్లాగులో ఇదే వ్రాయాలి అని నియమం నాకు తెలిసి ఎక్కడా లేదు. ఎవరికి నచ్చినది వారు రాసుకుంటూ పోతారు. అది ఉపయోగపడేది వ్రాయటమో లేక మరోటి వ్రాయటమో వ్రాసేవారి మీద ఆధార పడి ఉంటుంది. ఎవరిష్టం వారిది కదా! ఎవరికి నచ్చినది వారు వ్రాసుకుంటూ పోవడమే!
ReplyDeleteమీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు రసజ్ఞ గారు.
Deleteడైరీ రాసేటప్పుడు దానివలన సమాజానికి ఉపయోగం ఉందా? లేదా? అని ఆలోచిస్తారా?....ఇదీ అంతే. మీ మనసుకి నచ్చింది నచ్చినట్టు రాసుకోడమే. ఇది మీ బ్లాగ్. ఎవరికోసమో రాయటం లేదుకదా. మీ మనసుకి తృప్తి ఇచ్చిందా లేదా అన్నదే పాయింట్.
ReplyDelete(నా కామెంట్ అర్ధవంతంగా ఉందాండీ? :)) )
నేను ఇలానే అనుకున్నానండి మొదలుపెట్టినప్పుడు.మీ అభిప్రాయాన్ని తెలియచేసినందుకు ధన్యవాదాలండి!
Deletevennela gaaru,
ReplyDeleteI think most of the blog posts will be on things which have really touched the bloggers and unknowingly will carry some inner message or information. There are some exceptions at times where people want to share the knowledge, culture, news, etc.
But I believe when you start thinking too much on what to write, it will loose the natural flow and become an essay ( again expert/professional writers are exceptional)
Surabhi
Very true Surabhi gaaaru! I have experienced this recently. When I started thinking too much about what to post, I realized I could not write anymore...So I will just try to be natural without having the thought that someone would judge me for everything I write here...Let them judge and interpert in their own way..I need to have satisfaction that I was able to exprerss my feelings the way I like.And thanks for the wonderful advice.
Deleteజలతారువెన్నెల గారు, మీ సందేహం మిలియన్ డాలర్ల ప్రశ్నలా వుంది నాకు. సో కొలబద్దలు అక్కరలేదండి. నా వోరకు మీ బ్లాగ్ లో చాలా మంచి టపాలు వున్నాయి. Don't worry, Please just keep it up.
ReplyDeleteఅంతేనంటారా రాం గారు. సరే అండి..ధన్యవాదాలు మీకు.
Deleteమన మనసుకు నచ్చినట్లుగా వ్రాసుకున్నా నలుగురికి ఉపయోగపడే విషయమేమైనా తెలిసినప్పుడు అందరికీ తెలియజేయడం కూడా ముఖ్యమైనదే!
ReplyDeleteమంచి మాట చెప్పారు. ధన్యవాదాలండి!
Deleteజలతారు వెన్నెల గారూ,
ReplyDeleteమనలో ఏదో వ్యక్తీకరించాలి అని ఉన్న తపనకు లేదా ఇష్టానికి ఒక మాధ్యమం కలిగిస్తాయి బ్లాగులు. వ్రాసే కొద్దీ మనకే తెలుస్తుంది మనం ఏం రాస్తే మనకి సంతృప్తి కలుగుతోందో అని. స్వతంత్రంగా ఎప్పుడు ఏ ఆలోచన, వార్త, విషయం, సంఘటన మనను కదిలించి మనం స్పందించేలా చేస్తే అది వ్రాసుకోవడానికే బ్లాగులు. కొంత సభ్యత, కొంత సున్నితత్వం, కొంత ఇతరుల అభిప్రాయాల పట్ల గౌరవం ఉంటే చాలు. ఇంకే నియమాలూ అక్కర్లేదు. ఇది నా ఉద్దేశ్యం. మీ బ్లాగు మీకు తోచినట్టు వ్రాస్తున్నారు. అదే బావుంది. అభిప్రాయాలు మీరు చదివిన ప్రతి టపాకూ వ్రాస్తాను అన్నారు. అది నేను చెయ్యగలిగే పని కాదు కానీ నేను admire చేస్తాను. నేనేదైనా ఆ విషయం మీద బ్లాగరూ, వ్యాఖ్యాతలూ అప్పుడే చెప్పిన దానికి add చెయ్యగలను అనుకున్నప్పుడే నేను వ్రాస్తుంటాను. లేదా నా ఆలోచనకి ఏదైనా చదివినప్పుడూ స్పష్టత కలిగినా, లేదా ఏదైన విషయం నాలో ప్రశ్నలు రేకెత్తించినా కూడా వ్రాస్తాను, తీరిక దొరికినప్పుడు. అది నా బట్టే కానీ టపాని బట్టి కాదు. ఎన్నో మంచి టపాలు చదువుతాను, ఆస్వాదిస్తాను కానీ వ్యాఖ్యానించలేను ప్రతిసారీ.
లలిత గారు, ఎంత చక్కగా చెప్పరండి! మీరు చెప్పినవన్నీ నాకు బాగా నచ్చాయి , పూర్తిగా
Deleteఏకీభవిస్తున్నాను మీతో. You have this amazing skill of writing so well in telugu and great analyzation skills.We disagreed on few things before but I guess we both agree to disagree at times.Thank you so much lalitagaaru for the kind words and also for expressing your opinion.
తికమ మకతిక తికమకా....
ReplyDeleteఅందుకే కదండి, పోస్ట్ రాసింది.... మళ్ళీ మీరు ఇలా తిక మక తిక అంటే ఎలాగండి?
Deleteతెలుగు పాటలు తెలుగులో వ్రాయాలి అని నా బ్లాగ్ స్టార్ట్ చేశాను...
ReplyDeleteనెట్ లో ఎక్కడ అయిన ఆగ్లంలో సాహిత్యం ఉంటుంది..
సో నేను అలా స్టార్ట్ చేశాను... హాహాహ...
ఇంకో బ్లాగ్ సరదాగా బ్లాగర్స్ ని క్షణం అయిన నవ్వించుదామని క్రియేట్ చేశాను...
సో నాకు తెలిసి నచ్చింది వ్రాస్తూ ఉంటాము...
కాని ఇదే వ్రాయాలి అదే వ్రాయాలి రూల్ మాత్రం క్రియేట్ చేయకండి....
అలా పెడితే మేము రాయటానికి ఏమి ఉండదు..:(
క్రియేట్ చెయ్యటం లేదు..అలా రూల్ పెట్టుకోవాలా అని ఒక సందేహం అంతే! ధన్యవాదాలు తమ్ముడు
Deletethis may be the fourth stage of bloging. ( arya 2 brmhanandam)
ReplyDelete1.edo okati writing.
2.deking(hindi)for comments.
3.feeling satisfaction.
4.to do some thing between the lines.
ha, ha stages bhgunnaya, nadinka 2nd stage lendi.
keep writing, a happy writing.
a good heart, always write good.
thank you
naadi first stage! just writing lendi...thank you so much andi!
Deleteవెన్నెల గారు! మీకో పెద్ద సమస్య వచ్చి పడిందే!
ReplyDeleteహాయిగా మీకు నచ్చినవి రాసుకోండి.
బ్లాగ్ పోస్ట్ లు చదివి మీ స్పందనని బట్టి,తీరికని బట్టి కామెంట్ చేయండి. నిజంగా అందరికి ఈ కామెంట్స్ పెట్టడం సాధ్యపడక పోవచ్చు.అది అంత ప్రాధాన్యం కాదు.
ముందుగా మీరు మీ కోసమే బ్లాగ్ వ్రాసుకుంటున్నారు.అది మీకు తృప్తి కల్గిస్తే..చాలు. వేరొకరు నచ్చారా!మెచ్చారా?అని వద్దు. నచ్చితేనే కదా ..ఓ.లుక్ వేసి వెళతారు
మనిషి అయినా,మనసు అయినా ఒక చట్రంలోకావాలని బంధించుకుంటే..ఎదుటి వారిలో ఏమి చూడలేరు.ఏమి చెప్పలేరు. అలాంటి చట్రం లోకి మీరు వెళ్లి ఎందుకు మీ పరిధిని కుంచింపజేసుకుంటారు ?
ఇక్కడికి ఎంటర్ అయి మీరు బోలెడు తెలుసుకున్నాను,నేర్చుకున్నాను అనుకుంటే.. ఇకపై ఎవరి మాటలు పట్టించు కోకండి. హాపీ బ్లాగింగ్ ....................................................................................
బెస్ట్ అఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్ !!!!.
నిజమే వనజ గారు, మీరు చెప్పినవన్నీ తు చ తప్పకుండా ఫోల్లో అయిపోతాను. డియర్ ఫ్రెండ్ అని అప్యాయంగా పలకరించారు.ధన్యవాదాలు మీకు.
Deleteదురదస్య దురదః 'బ్లాగ్' నామ్యా దురదః !
ReplyDeleteమొదలయ్యిన్దండీ , దురదగొంటాకు ఎఫ్ఫెక్ట్! అల్ ది బెస్టు !
చీర్స్
జిలేబి.
జిలేబీ గారు.. దురద మీకు అంటుకుందని అనుకుంటున్నాను అందుకే నా బ్లాగ్ లో ప్రత్యక్షం అయ్యారు.కామెంట్ రూపంలో..:)))
Deleteభలేవారే, అందరూ ఇంత సీరియస్ గా తీసుకుని సలహాలు ఇచ్చేస్తున్నారేమిటి.
ReplyDeleteవెన్నెల గారికి తెలియదనే అడిగారనుకుంటున్నారా కొంపదీసి.
ఉత్తినే , సరదాగా అడిగారు. అంతేనా వెన్నెల గారు?
అన్ని కామెంట్స్ వచ్చాక అందరి అభిప్రాయాలు తెలుసుకున్నాక అందరికి రిప్లై
Deleteఇద్దామని అనుకున్నాను. కాని మీరు ఎదో నేను సరదాగా అడిగానని అన్నారు అందుకని వెంటనే మీకు మాత్రం instant రిప్లై అండి లక్ష్మీ దేవి గారు. సరే మీకు కొద్దిగా చరిత్ర చెపుతాను, ఇలా ఎందుకు పోస్ట్ రాసానో..నిన్న నేను ఒక కవిత (అని నేను అనుకుంటున్నాను,అప్పుడప్పుడూ అలా గీకుతూ ఉంటాను) రాస్తే, ఫ్రెండ్స్ మధ్య ఇలా సంభాషణ లో నా కవిత చిక్కుకుని..చిత్రవధకు గురై, కొన్ని లైన్స్ సరిగ్గా రాసానని, కొన్ని లైన్స్ బాలేవని, కొన్ని లైన్స్ లో పదాలు అటు, ఇటు తడబడ్డాయని వారి వారి స్పందన తెలియచేసారు. నేనన్నాను కదా...ఎదో సరదాగా, నాకు చేతనైనట్టు రాసుకున్నాను అని చిన్నబుచ్చుకున్నాను. అప్పుడు వారు పోస్ట్ లో ఏమి చెప్పదల్చుకున్నావు...అని అడిగితే తెల్ల మొహం వేసి...ఎమో, ఎమీ అనుకోలేదు అంటే..నాకు వారు చెప్పిన దేమిటి అంటే..రాసిన ప్రతి పోస్ట్ లో ఎదో ఒకటి చెప్పలి, పోస్ట్స్ అన్నిట్లోను minimum standards ఉండాలి అంటే ఖంగు తిని ఈ పోస్ట్ రాసేసాను.నిజంగానే సందేహం వచ్చే అడిగానండి. సరదాకి అసలు కాదు. మీరు నమ్మాలి.
వనజగారి స్ఫందనతో ఏకీభవిస్తున్నాను.
ReplyDeleteనాగేంద్ర గారు, ధన్యవాదాలండి!
Deleteవెన్నల గారు,
ReplyDeleteమంచి అలోచన చాలమంది బ్లాగు మొదలు పెట్టినప్పుడు ఎమీ అలోచనరాదు, కాని ఒకసారి మీకు కామెంట్స్ వచ్చిన తరువాత, మీరె మంచి విషయాలు రాయటానికి ప్రయత్నిస్తారు.
Few good/great blog websites i follow:
http://teluguyogi.blogspot.com/
http://trainerudaykumar.blogspot.com/
http://sarasabharati.wordpress.com/
ఆలోచన అనేది ఒక్కొకరికి ఒక్కక విదంగా ప్రబావితం అవుతుంది ( కొంచెం బారిగ రాసాను). few weeks back i read a quote on book reading..whenever you read any book, your thoughts will keep changing (like river)..if you read same book again after some time, you may experience different thoughts..
When you are writing these blogs..think like you are provoking some new idea ( or feeding new thought in someones mind)..it's all interconnected, sometime we think, whatever i am writing is not usefull..but it may reach someone who can take his thoughts from there...
We need to bring some standards on these blog writings :-) if possible.....we don't have stones to built nice statues..this generation spend their most valuable time infront of internet...at least we need to spread some good thoughts to next generation through internet...
(Just a thought)
--Krishna
Btw..in the good blog list..i forgot to include your blog name....one of the blog i follow after america chaduvulu post..
DeleteLet me first thank you for kind words. I agree with you that this generation spends hell lot of time infront of internet. I have one at home too..:)) and yes, we need to spread good thoughts to next generation...very well said...Thanks for expressing your opinion.
Deleteకిటికీలో నుండి బయటకు చూస్తూ ఒక వ్యక్తి తన దృష్టికి వచ్చిన విషయాల పట్ల తనకు తోచినట్లు అనుకుంటాడు. తప్పు యేమీ లేదు.
ReplyDeleteతనకు తోచినది బయటకు మాట్లాడితే కూడా తప్పు లేదా అంటే చాలా ఆలోచించవలసిన విషయం.
ఆ గదిలో ఎవరూ లేకపోతే? ... ఇబ్బంది లేదు.
ఆ గదిలో ఎవరైనా ఉన్నా, వారికి వినబడనట్లయితే? .... ఇబ్బంది లేదు.
ఇతరులు వింటె తన మీద తేలిక అభిప్రాయం కలిగే అవకాశం ఉంటే ఎవరైన ప్రకాశంగా మాట్లాడాలంటె కొంత జాగ్రత వహిస్తారు కదా.
నా మనసు లోని భావం నా యిష్టం అనుకోవటం సరి కాదు.
సాంఘిక మర్యాద లేదా సభ్యత అనేది కూడా దృష్టిలో పెట్టుకోవటం అవసరమే.
బ్లాగింగు విషయంలోకూడా ఇదే పధ్ధతి వరిస్తుందని నా అభిప్రాయం.
కామెంట్ల విషయంలో కూడా అని వేరే చెప్పనవసరం లేదనుకుంటాను.
నిజమే, బ్లాగర్లు తమకు తోచినది వ్రాస్తారు. చదువరుల స్పందన ఎలా ఉంటుందో చెప్పలేం. బాతాఖానీ కబుర్లకు బోలెడు స్పందన రావచ్చును. ఆలోచింపజేసే టపాలకు యేమీ స్పందన రాకపోవచ్చును. చదువరుల స్పందన కోసం కాక చెప్పదగినది అనేది చెప్పామన్న తృప్తి కోసం బ్లాగర్లు వ్రాస్తుంటారు. సకృత్తుగా కేవలం స్పందనల కోసం మసాలా దట్టించి వ్రాసేవారు కూడా కొందరుంటే ఆశ్చర్యం లేదు.
మనం తరచు అదివే బ్లాగులు మనకు నచ్చటానికి యెటువంటి ప్రమాణాలు గమనిస్తున్నామో అటువంటి విధంగానే మనమూ తగిన ప్రమాణాలతో బ్లాగింగ్ చేయటం ఉత్తమం అని నా అభిప్రాయం.
కొంచెం చాదస్తంగా వ్రాసినట్లు అనిపిస్తే మన్నించగలరు.
ముందుగా మీలాంటి పెద్దవారు మన్నించమని అడగకూడదు. నిస్కర్ష గా మీ అభిప్రాయం తెలుపవచ్చు. మీ సంస్కారానికి వందనం. నిజంగా మీరు ఉదహరించి చెప్పిన విధానం చాలా బాగుంది. మీరు చెప్పినవన్ని అక్షర సత్యాలు. తప్పకుండా పాటించాల్సినవే! మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, ఇంత విపులంగా , అర్ధం అయ్యేట్టు వివరించిన మీకు ధన్యవాదాలండి!
Delete/నాం కె వాస్తే" (ఎదో కామెంట్స్ రాయలని రాయడమే కాని, ఇంకేమికాదు అన్నట్టు) లా కాక మనం రాసే ప్రతి కామెంట్ లో కూడా అర్ధవంతం గా ఉండాలి అని./
ReplyDeleteమీరు పెట్టే ప్రతి కామెంట్ ISI నాణ్యత వుందా లేదా అని పరిశీలించే కామెంట్ చేస్తారా!! ఇకపై మీ కామెంట్లు గమనించాలి. :)
Snkr
అయ్యో SNKR గారు! మీరు నన్ను తప్పుగా అర్ధం చేసుకున్నారు. నాకు సలహా ఇచ్చిన వారు నేను అలా అర్ధవంతమైన కామెంట్స్ పెట్టాలని , ఎదో "నాం కె వాస్తే" కామెంట్స్ పెట్టరాదని అన్నారని చెప్పాను నా పోస్ట్ లో. నాకు తెలిసినంతవరకు, నేను చాల బాగుందనో, బాగుందనో తప్ప కామెంట్స్ లో పెద్దగా రాయనండి, అంటే రాయాలన్నా నిజంగా ఆ నిమిషంలో ఏమి రాయలో తెలీదు నాకు. ఇంకా మీరు ISI మార్క్, నాణ్యత అంటే, ఇక్కడే డమాల్ నేను.... :)) అసలు అంత సీనే లేదు.
Deleteనాదే పొరపాటేమోనండి. వెనక్కు తీసుకుంటున్నా...
Deleteఒకటిమాత్రం అబ్సర్వ్ చేశా... ఫ్రెండ్స్ మొహమాటంగా బాగుంది అంటారేమో కాని బూచాళ్ళు (అజ్ఞాతలు) మాత్రం మెచ్చుకుంటే నిజంగా మెచ్చుకుంటారు. బూచాళ్ళ మెచ్చుకోళ్ళు ISI మార్క్ అనుకోవచ్చు. :))
Snkr
అజ్ఞాతలు = ISI మార్క్ అంటారు! Point noted అండి...ధన్యవాదాలండి!
Deleteమీరెలా ఉంటారు= మీలా, ఔనా! సింపుల్, మీ బ్లాగ్ మీలా ఉంటుంది అంతే!
ReplyDeleteఒక్కా ముక్కలో తేల్చి చెప్పటం అంటే ఇదేకదండి!! కాని కర్రెక్ట్ గా చెప్పారు! ధన్యవాదాలండి.
Deleteఎవరీనా వారి బ్లాగ్ని వారికోసం రాసుకోవాలనేది నా అభిప్రాయమండి. కామెంట్లకోసమో, హిట్లకోసమో రాసుకోవాల్సిన అవసరంలేదు, మిగతావాళ్ళందరూ మెచ్చి,మేకతోలు కప్పాలనుకొనో, "we-are-okay-with-the-content"అననుకోవాలనో రాయడం అనవసరమని నా అభిప్రాయం. మనం ఇలాంటి egotistic tendencies నుంచి బయటపడాల్సిన అవసరం చాలావుంది. అసలలాంటి రాతలనవసరంకూడా.
ReplyDelete"ఎందుకు బ్లాగు రాయాలి?" అనే ప్రశ్నకి నేనిచ్చే సమాధానాలు ప్రస్తుతానికి ఇవీ
1)One should write one's blog to track one's evolution of thoughts
2)One should write one's blog for one's reference.
మీ ప్రశ్నమీద ఒక పోస్ట్రాయాలనిఉంది :D
మీప్రశ్నకిగానూ బోల్డన్ని ధాంకులు.
Your summarization is very impressive. Totally agree with both of your bullet points. If we worry too much about comments or feedback or hits may be its' not right. However cannot deny the fact that sometimes the same comments /feedback would ispire us to write too!!! (I am a simple human being , who sometimes get flattered by comments!At the same time I agree that there should not be any excpectation that someone should comment on every post or any post of mine.) Thank you so much for sharing your valuable opinion.
Deleteహ హ మీ గుబులు కి ఖచ్చితం గా fullstop పెట్టేయోచ్చు . చక్కగా విషయాన్ని present చేసే బ్లాగుల్లో మీది ఒకటి . కొద్ది గా కవితలు అవీ నాకు పడవు కాబట్టి వాటి గురించి నేను ఏమి చెప్పలేను కానీ , మిగిలిన పోస్టుల విషయం లో మాత్రం ఖచ్చితం గా మీరు చక్కగా రాస్తారు అలాగే ఆలోచింపచేస్తారు .
ReplyDeleteఇక రాసే ప్రతి విషయం సందేశాన్ని ఇవ్వనక్కరలేదు ఏమో నా అభిప్రాయం , మామూలు గా మన జీవితం లో సరదా అన్నది లేకపోతే ఎంత బోరు కొడుతుందో బ్లాగు కూడా అంతే కదా. కాబట్టి సరదా విషయాలకి కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి .
సరదా సరదా గా నచ్చిన వాటి మీద తోచిన విధంగా రాసెయ్యమంటారు. శ్రావ్య గారు,అలాగేనండి, గుబులు ఇప్పటికే సగం పైన పోయింది..మీ చక్కటి వాక్యతో...ధన్యవాదాలు మీకు.
Deleteనేను బ్లాగ్ మొదలు పెట్టిన కొద్ది రోజులకే మా అమ్మాయి , నీ అనుభవాల తో నలుగురికి ఉపయోగ పడేవి రాయి , కామెంట్స్ రాక పోవచ్చు కాని కొందరికైనా ఉపయోగపడతాయి కదా అని . ఏమో నేనైతే ఆ సలహా పాటించలేదు :) నాకు తోచినవి ఏవో నా టైం పాస్ కోసం రాసుకుంటూ వుంటాను అంతే :)
ReplyDeleteమీ అమ్మాయి ఎంత చక్కగా చెప్పిందో కదండి.నేను కూడా టైంపాస్స్ గానే తీసుకుంటానండి! మీ అభిప్రాయాన్ని తెలియచేసినందుకు ధన్యవాదాలు మాలా గారు
Deleteజలతారువెన్నెల గారూ..
ReplyDeleteమీ బ్లాగింగ్ సందేహాలే అప్పుడప్పుడూ నాకు కూడా వస్తుంటాయి..
నేనైతే "రసజ్ఞ" గారిలాగే అనుకుంటాను.
కానీ "శ్యామలీయం" గారు చెప్పినట్లు
"నా మనసు లోని భావం నా యిష్టం అనుకోవటం సరి కాదు.
సాంఘిక మర్యాద లేదా సభ్యత అనేది కూడా దృష్టిలో పెట్టుకోవటం అవసరమే"
మీ సందేహం,దానికి మన బ్లాగర్ల కామెంట్స్ అన్నీ బాగున్నాయి..
రాజి గారు, ధన్యవాదాలండి!
Deleteనేను ౨౦౦౫ లో Blogger లో చేరాను. నాకు అప్పుడు తెలియదు ఏమి రాయాలో అప్పుడు ఏదో వ్రాసాను అది ఇప్పుడు లేదు.
ReplyDeleteతరువాత తరువాత నాకు నేను కొన్ని నిభందనలు పెట్టుకున్నాను
౧. నాకు ఉపయోగ పడింది ఇంకొకరికి ఉపయోగ పడవచ్చు అని వ్రాయడం లేకపోతే పంచడం.
౨. కొన్నాళ్ళు మనం రాజకీయ నాయకులను విమర్శించి వీక్షకులను తెచ్చుకుందాము అనుకున్నాను అప్పుడు నాకు ఋషి వేటగాడు కధ గుర్తుకు వచ్చి ఆపాను(కొన్ని వ్రాసాను)
మంచి విషయం మనకు నచ్చిన విషయం ఏదైనా ఇక్కడ వ్రాస్తే చాలు, జీవితం లో అన్నీ పంచె విషయాలే ఉండవు కాబట్టి మీ ఇష్టం. కానీ ఇంకో చోట ఉన్న దాని లంకే మాత్రం పెట్టడం ఉత్తమం ఎందుకంటే మనం అనవసరంగా ఇంకొకరికి అవసరమైన దాన్ని మింగ కూడదు అని నా అభిప్రాయం.
మీ బ్లాగింగ్ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియపరిచినందుకు ధన్యవాదాలండి ఫణీంద్ర గారు.
Deleteవెన్నెల గారు,
ReplyDeleteఅయితే సరే, నమ్మామండి. :))
కవిత కానీ వ్యాసం కానీ బాగా వ్రాయగలిగే వాళ్ళకి వాళ్ళ మనసుని బట్టే భావవ్యక్తీకరణ జరుగుతుంది.
ఏమంటారు?
ఒక్కొక్కరి మనసులో స్పందించే మనస్తత్వం ఒక్కో స్థాయిలో ఉంటుంది. సంతోషానికైనా, దుఃఖానికైనా, ప్రకృతినైనా, పరాశక్తి విషయంలోనైనా.
మీ కవితలు అప్పుడప్పుడూ చదువుతుంటాను. చదివినవి బాగున్నాయని అనిపించింది. ఒక్కోసారి వ్యాఖ్య పెట్టటానికి వీలు కుదరదు. బ్లాగ్ మొదలుపెట్టిన కొత్తలో వ్యాఖ్యలు పెట్టేందుకు ఉన్న ఓపిక కొన్ని రోజులకు తగ్గిపోతుంది. ఏ విషయంలోనైనా అంతే కదా!
హమ్మయ్య! నమ్మారు కదా. అంతే చాలు నాకు. మీరు చెప్పినది నిజమేనండి! వాఖ్యలదేముందండి..అభిప్రయాన్ని తెలుపండి , అంటే అందరు మంచి మనసుతో తెలిపారు కదండి. అదే పది వేలు . ధన్యవాదాలు మీకు.
Deleteవెన్నెల గారూ.....
ReplyDeleteబ్లాగ్ అనేది.. రోజు డబ్బులు పెట్టి కొనుక్కునే పత్రిక కాదు... సమాజానికి.. అందరికీ వుపయోగ పడేలా వుండటానికి...
ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో.. ఓ పదేళ్లుగా పిచ్చోడిలా తిరుగుతున్న వాడిని...
బ్లాగ్ పుట్టిందే.. ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు రాసుకోవడానికి..
ఇష్టం అయితే వచ్చి చూస్తారు. నచ్చితే.. ఓ కామెంట్ పెడతారు.. లేదా.. వెళ్ళిపోతారు... సో.... :)
కాకపోతే... ఇక్కడ మన బ్లాగ్ ప్రపంచంలో.. చాలా మంది విజ్ఞానవంతులు .. తెలుగు భాషాభిమానులు...... కవులు, కవయిత్రులు.. ఇలా మన బ్లాగ్ దర్శించి .. మార్గదర్శం చేయడం.. మనకు ఒక విధంగా అదృష్టమే.!!!
వారు చెప్పేవి positive గా తీసుకుంటే... మనలో దాగివున్న.. కళను... తెలుగును మరింత అభివృద్ధి చేసుకునే అవకాసం వుంది.
:) నేను అనుకుంటాను.. రసజ్ఞ గారిలా.. ఓ మంచి పోస్ట్ రాద్దామని.. నావల్ల కాదే!! :) నా జ్ఞానం అంతే....!!!
మీరు అనుకున్నట్లు "ఎవరిని నొప్పించకుండా రాస్తే చాలు అని మాత్రం అనుకుంటాను" అదే మంచిది.. పనిలో పనిగా.. అసభ్యకరంగా రాయకుండా వుంటే చాలు. (FYI: online లో బాగా పాపులర్ అయ్యే website లు అసభాకరంగా వుండేవే.)
(ఇది నా అభిప్రాయం మాత్రమే..)
నిజమే మానసగారు..కామెంట్స్ ని +ve గానే తీసుకోవాలి, తీసుకుంటాను.
Deleteవ్యంగ్యం మాత్రం అంతగా నచ్చదు నాకు. మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు .
మొదటిది: మీరు తెలుగులో రాస్తున్నారు. తెలుగు భాషను చులకనగా చూస్తున్న ఈ రోజుల్లో, దీనికిదే పెద్ద ప్రయోజనం.
ReplyDelete.
రెండు: చాలా మంది పాఠకులు, కొత్త విషయాలగురించి తెలుసుకోవాలని మాత్రమే బ్లాగులను సందర్శించరు. 'ఏదో కాలక్షేపం' అంటూ తెలుగులో రాసినవి చదవాలన్న కుతూహలంతో పరిభ్రమించే వారు చాలా మంది ఉంటారు.
.
మూడు: 'అక్షరం పరబ్రహ్మ స్వరూపం' అన్న నిజాన్నెరిగి, సమాజంలో విషం చిమ్మకుండా ఏమి రాసినా తప్పులేదు.
.
ఈ విషయంపై, ఇవి నా అభిప్రాయాలు.
వెన్నెల గారూ నేను ఇంత క్రితమే చెప్పను మీరు వెన్నెలంత స్వచ్చమని , బ్లాగ్ ని అందంగా కాదు అర్ధవంతంగా తీసుకోవాలని తెలుసుకున్నాను అన్నారు ఆ మాటలో ఎంత పసితనం ఉందొ, ఎక్కడా ఎవరినీ విమర్సించ కూడదు అనుకున్నారు కదా , కాని విమర్శ కూడా ముందుకు నడుపుతుందండి ,
Deleteతెలుగు భావాలు గారు..మీరు చెప్పిన వాటిలో మొదటి point ప్రేరణ నాకు అసలు బ్లాగ్ రాయడానికి. ("మీరు తెలుగులో రాస్తున్నారు. తెలుగు భాషను చులకనగా చూస్తున్న ఈ రోజుల్లో, దీనికిదే పెద్ద ప్రయోజనం.") మంచి విషయం తగిన సమయంలో గుర్తు చేసారు. దానికి మిమ్మల్ని అభినందించాల్సిందే! మీరు చెప్పిన రెండవ point కూడా బాగుంది. మూడవ point simply superb! ఇంత చక్కగా మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన మీకు ధన్యవాదాలు.
Deleteమీ చల్లటి మాటలకు, అభినందనలకు ధన్యవాదాలండి ఫాతిమ గారు
Deleteవెన్నెల గారూ!
ReplyDeleteమీరు వ్రాసిన విషయాలు అన్నే చదివాక ,
కొన్ని స్పందనలలో ఆ అభిప్రాయాలు కొన్ని కనిపించాయి.
శ్యామలీయం, రాజి గార్ల అభిప్రాయాలలో కొన్నిటితో
నా అభిప్రాయాలు ఏకీభవిస్తాయి.
మనకి నచ్చిన విషయం కథ, కవిత,
వ్యాసం, ఏదైనా మనం మన బ్లాగ్ లో పెట్టినప్పుడు
ఆ విషయానికి సంబంధిన నిపుణులు సద్విమర్శ చేస్తే స్వీకరించాలి...
మనం న్యూనతా భావాన్ని పెంచుకోకూడదు...
ఆ విమర్శలే మనకి ప్రశంసలుగా భావించి ముందుకు సాగి పోవాలి గాని ఆగిపోకూడదు...
చూడండి...కొంతమందికి వ్రాయడం రాకపోవచ్చు...కానీ మంచి పరిశీలన చేస్తారు...
స్పోర్టివ్ గా తీసుకోవాలి విమర్శలని.
'కాకి పిల్ల కాకికి ముద్దు' అని మనం వ్రాసినదాంట్లో మనకి తప్పు దొరకదు...
:)...:-))..
వేరే ఎవరైనా వ్రాసిన విషయం చూసి నచ్చిన విషయాన్ని కామెంట్ చేస్తాము...
కాని అందులో మనకి నచ్చని భావం ఉంటె నేనైతే ఇలా వ్రాస్తాను అనుకుంటాము చూడండి...
మన సరదా కోసం వ్రాసుకున్నా బ్లాగ్ అంటే పెర్సనల్ డైరీ కాదు...ఏది పడితే అది వ్రాసుకోవడానికి...
కాకుంటే వ్రాసిన ప్రతీ దానికీ ప్రయోజనం ఉండదు...
నేను కవిత అని అనుకునే నా భావాలని కొన్నిటిని నేను మూడు దశాబ్దాల క్రితం వ్రాసుకున్నవి
చిన్న సవరింపుతో మీ ముందుంచాను...
నా సరదా కోసం వ్రాసుకున్నవి... నాకు ఆనందాన్ని ఇస్తున్నాయి....
స్పందనల్లో నా కవితలకి సరైన అర్థాన్ని వెదుక్కుంటాను...
బ్లాగ్ లో కొన్నిటిని ఒకసారి చూసాక మళ్ళీ ఓపెన్ చేయను...
కొంతమంది బ్లాగర్స్ కొత్త విషయం ఎపుడు పోస్ట్ చేస్తారా? అని ఎదురు చూస్తుంటాను...
పోస్ట్ చేసేముందు కొన్ని మర్యాదలు మాత్రం పాటించాలి..
మనం మాట్లాడుతున్నప్పుడు పాటించేవి, వ్రాసేడప్పుడు ఎందుకు పాటించలేము?
ఇవి నా అభిప్రాయాలు సుమండీ!
ఒకటి మాత్రం చెప్తాను మనకి తెలీదని ప్రతీ విషయాన్ని అందరికీ తెలియజేప్పలనుకోకూడదు..
అలాగే పరిమితమైన వారికోసం తెలియజేయాలంటే...ఆ విషయాన్ని బ్లాగ్ లో పెట్టి అందరినీ ఇబ్బంది పెట్టక్కర లేదు...
:-))...మంచి చర్చకు తెర తీసారు...
మీ ఈ చర్చా విషయం బాగుందండీ వెన్నెల గారూ!
@శ్రీ
"ఒకటి మాత్రం చెప్తాను మనకి తెలీదని ప్రతీ విషయాన్ని అందరికీ తెలియజేప్పలనుకోకూడదు..
Deleteఅలాగే పరిమితమైన వారికోసం తెలియజేయాలంటే...ఆ విషయాన్ని బ్లాగ్ లో పెట్టి అందరినీ ఇబ్బంది పెట్టక్కర లేదు..."
ఈ లైన్స్ అర్ధం కాలేదు .మీ అభిప్రాయాలన్నిటిని మాతో పంచుకున్నందుకు, ఇంత చక్కగా స్పందించినందుకు మీకు ధన్యవాదాలు శ్రీ గారు
'మనకు తెలీదని' అంటే మనకు ఇప్పటి వరకూ తెలియని ప్రతీ చిన్న విషయాన్ని ఎవరైనా చెపితే అది మిగతా వాళ్లకి కూడా తెలియదేమో అనుకూకూడదు...
Deleteఅలాగే కేవలం కొద్దిమందికి తెలియజేయాలనే విషయాన్ని అందరికోసం బ్లాగ్ లో పెట్టి మిగతా వారికి ఆ బ్లాగ్ పట్ల అనాశాక్తిని పెంచేదిగా ఉండకూడదు అని...
నా భావాలు ఏ బ్లాగర్ ని నొప్పించాలని కాదండోయ్... :-)
కేవలం చర్చలో నా అభిప్రాయం మాత్రమే..
@శ్రీ
జలతారు వెన్నెల గారూ ,
ReplyDeleteకథలు , కవిత , లనుభవాలు , కబురులైన
ఏ టపా కైన పరమార్థ మేమిటన్న
“ రచనలకు సమాజ హితమె ప్రథమ గణ్య “
మదియె బ్లాగులోగూడ శ్రేయస్కరమ్ము .
నాకైతే ఆరు రుచులు ,
ఏకంగా నవ రసాలు – ఈ బ్లాగులలో
కోకొల్లలుగా దొరకును
చేకూరును ఙ్ఞాన లబ్ధి , చేతోముదమున్ .
వెటకారం కామెంటులు ,
కటువగు మాటలును వదలి , కడు హుందాగా
చటుల గతుల బ్లాగరులను
పటుతరముగ సాగనిండు బ్లాగు వనములో .
సుజన-సృజన
అలాగే మాస్టారు. "సమాజ హితమే ప్రధమ గుణము..." కొన్ని పోస్ట్ లన్నా ఉపయోగపడేవి రాయడానికి ప్రత్నించాలంటారు. ధన్యవాదాలండి
Deleteవెన్నెల గారు,
ReplyDeleteఆసక్తి కరమైన అంశంతో మళ్ళీ మీ నుంచీ మరొక post వచ్చినట్లుంది బాగుంది
అందరి ప్రతి స్పందనలు సమ పాళ్ళల్లో ఉన్నాయి
నాకు ప్రతి reply కి మరో reply ని జత చేయాలనిపించింది
ఇంతలో జ్ఞాపకం వచ్చింది ఇది వెన్నెల గారి blog నీది కాదు అని,
అయినా పర్లేదు అని చొరవ తీసుకుంటున్న ఏమీ అనుకోకండేం?
సరే !!
నాకు రెండు సమాధానాలు ఉన్నాయి వీటికి ప్రశ్నలు వెతికితే మీ సందేహానికి బదులు దొరుకుతుంది
వెన్నెల గారే కాదు ఈ సమాధానాలు ఇక్కడున్నవారందరికీనూ !!
(1) కొన్ని చోట్ల సీనరీస్ లలోనూ ఇంకా సముద్ర తీర ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు సాంతం నేలబారున పెరిగి చివరిలో పైకి ఎదిగినట్లు కనిపిస్తాయి కారణం?
(2) క్రోవ్వోత్తినో దీపాన్నో భూమి వైపుగా వంచినా సరే, దాని దీపపు శిఖ ఎప్పుడూ పైకే ఎందుకు ఉంటుంది?
నచ్చింది రాయమంటూ బయటకి నచ్చేలా మెచ్చేలా రాయటమే నాకు నచ్చుతున్దంటూ చెప్పకనే చెప్పారు ఎంతైనా @రసజ్ఞులు కదా సదా!
@మానస గారు comment ని మనసుతో మొదలు పెట్టి హృదయం తో end చేశారు బాగుంది,
@శంకర్ గారు blog ని dairy తో compare చెయ్యటం correct థింగ్ కాని ఇది open డైరీ అయినప్పుడు కూడా ఎలాంటి restrictions ఉండవంటార?
@రాం గారన్న ఈ మిలియన్ డాలర్ల సందేహానికి anonymous @సురభి గారు చెప్పిన సమాధానం లో point ఉంది.
@కష్టేఫలే వారు చెప్పిన తికమకని blogging లో 4 స్థాయిలు ఉన్నాయి ఈ స్థాయి వారో గుర్తించటం చేత తిక మక తీరుతుంది అని చక్కగా చెప్పారు
@the tree వారు బహుశా నిన్నటి zilebi వారి 33 cheers బాగా పని చేసాయనుకుంటా?
@వనమాలీ వారు మనసు చట్రంలోని వారమే మనమంతాను అలాంటి మనసుకి చట్రం ఏర్పాటు చెయ్యకపోతే పరిణితి ఎలా?
@zilebi जी ! Blogging ఖండూతి ని గూర్చిన మీ comment లో ఆంతర్యం బోధ పడింది ధన్యుడను
@ లక్ష్మీ దేవి గారు, గతం లో తెలియంది భవిష్యత్తు లో తెలిసేది అవుతున్నప్పుడు కాల వర్గీకరణ ల వలన ఏర్పడిన temporary మాటలే నాకు తెలియటం, తెలియక పోవటం అనేది
@ krishna గారు భారిగా కాదు బాగా రాశారు
@ శ్యామలీయం గారు simply gr8 view
@ again కష్టే ఫలే నిజమే మన blog మన మనో ఫలకమే కాని మనం మనల్నే చూసుకుంటున్నామా? మన యథార్థ స్వరూపమే చూపిస్తున్నామ?
@ Indian minerva నిజమే ఆలోచనల tracking బాగానే ఉంది మరొకరి reference అన్నప్పుడు ప్రతి post లో ఎంత కేర్ ఫుల్ గా ఉండాలి ?
@ సాదా సీదా తెలుగు అమ్మాయి, సందేశాన్ని ఇవ్వనక్కర్లేదేమో అంటూనే "మన జీవితం లో సరదా అన్నది లేకపోతే ఎంత బోరు కొడుతుందో బ్లాగు కూడా అంతే" అనే సందేశం ఇచ్చారు
@ ''మాలా కుమార్'' గారి అమ్మాయి చక్కగా చెప్పారు sir మీ blog post లో పాటించ లేదేమో ఈ blog comment లో 1st time పాటించారు మీ అమ్మాయి చెప్పిన అంశం ఇలా అవసరమైనప్పుడు సరైన విధంగా స్పందిన్చమనే !
@రాజి @నాగేంద్ర @ lalithag @ prince @ తెలుగు భావాలు sir, nice attitude
@ఫణీంద్ర & @ శ్రీ చక్కగా చాలా బాగుంది (thats why I mentioned in last)
@ ఎవరైనా miss అయితే వాళ్లకు sorry
ఇంతకు నా సమాధానాలకు ప్రశ్నలు దొరికాయ?
♥ ఏ నావదే తీరమో ॐ
Shiva
?!
http://endukoemo.blogspot.in
శివ గారు,
Delete"@ krishna గారు భారిగా కాదు బాగా రాశారు "
Thanks for your comment....but very good summary..overall we have to take these blogs to next level..(those who are good in article writings)..very few people have that skill..
If you are interested in reading old books..try million book project, below is the link.
http://archive.org/search.php?query=%28language%3Atel+OR+language%3A%22Telugu%22%29
I know that most of them wrote about, express their own opinions..i do agree with that..but writing good thoughtful articles will improve the blog community.
Don't take any thing wrong. Just advice..
Vennalu garu, keep writing on education related articles, esp america chaduvulu series..
Thank you all.
Thanks A lot krishna gaaru,for your valuable link, I have some books I kept those @
Deletehttp://sadhakudu.blogspot.in/p/blog-page_8311.html
I will also join in that million book project
thanks to you & Vennal garu too
?!
జలతారువెన్నెల గారూ, మీ సందేహం,దానికి ఇక్కడ బ్లాగర్ల అభిప్రాయాలు అన్నీ బాగున్నాయి కానీ ఇప్పుడు నాకొక సందేహం అసలు నేను బ్లాగులు ఎలా రాయాలి??
ReplyDeleteనా బ్లాగును హారం నుండి ఎందుకు తొలగించారు??
నేనేమైనా బూతు పోస్ట్లు పెట్టానా??
నేనెవరినైనా అవమానించి మాట్లాడానా??
నాకు తెలుసు నేను చేసిన తప్పు ఏమిటో నువ్వే గొప్ప అని ఇక్కడ సీనియర్ బ్లాగర్ల భజన చేయకపోవటమే అని.. అందుకే నా బ్లాగ్ హారం లొ రాకుండా చేశారని..
మీరు ఒక friend గా నేను ఈ సందేహం మిమ్మల్ని అడుగుతున్నాను
నా బ్లాగ్ హారం నుండి తొలగించటం తప్పా?? ఒప్పా??
//// Please publish this comment ////
సందీప్ గారు,This is a news to me! మీ బ్లాగ్ నేను హారం ద్వారానే చూస్తాను ఎప్పుడూ.నాకు private aggregators rules సరిగ్గా తెలియవు. ఒకసారి చూడాలి, వాళ్ళు మనల్ని చేర్చునేటప్పుడు ఎలాంటి terms and connditions మన చేత accept చేయించుకున్నారో.ఇక my personal opinion చెప్పమంటే,what attracted me to your blog was the funny and light comedy (brahmaanandam's emotions -I should add too) and some times very genuine criticism at times and తప్పు ని తప్పు అని మీ అభిప్రాయన్ని తెలుపడం. But in broad sense , people might have felt you targeted them in your posts which is kind of true. Is that right ot wrong...that is a different question.You are free to express your views in your blogs..in your own comical way..and people can totally ignore if they don't want to look at it and brand it as "Not a healthy blog". On the other hand if you have posted nasty comments in anyone's blog, then that is wrong in my opinion. Also you can't expect to find perfect Utopia here. మీ బ్లాగ్ ఇష్టపడేవారు హారం లో ఉన్నా చూస్తారు, లేకపోయినా చూస్తారు. బిందాస్ గా ఉండండి.
Deleteజలతారు వెన్నెల గారు,
ReplyDeleteపైన ఇండియన్ మినర్వ గారి అభిప్రాయం తో సంపూర్ణం గా ఏకీభవిస్తున్నాను. ఈ మధ్య ఒక బ్లాగర్ నాతో, 'కథ/నవల/కవిత/కథానిక/వ్యాసం' లాంటి వాటికి 'ఇదిగో ఈ విధం గా రాస్తేనే ఈ కాటేగిరీ లోకి వస్తుంది ' అన్న నిబంధనలుండవచ్చు కానీ..
బ్లాగు లో హాయిగా నచ్చినట్టు రాసుకోవచ్చు.. మన మానసిక స్థితి ని బట్టి ఒక్కోసారి సందేశం ఇవ్వటానికో, లేదా, సరదా కబుర్లు చెప్పటానికో, సందేహ నివృత్తి కోసమో, లేక విషయ జ్ఞానాన్ని పంచుకోవటానికో లేకపోతే ఒక్కోసారి జస్ట్ కామెంట్ల కోసమో..
ఏదైనా మనిష్టం :) కదా..
క్రిష్ణప్రియగారు,బాగా చెప్పారండి. "బ్లాగు లో హాయిగా నచ్చినట్టు రాసుకోవచ్చు.. మన మానసిక స్థితి ని బట్టి ఒక్కోసారి సందేశం ఇవ్వటానికో, లేదా, సరదా కబుర్లు చెప్పటానికో, సందేహ నివృత్తి కోసమో, లేక విషయ జ్ఞానాన్ని పంచుకోవటానికో లేకపోతే ఒక్కోసారి జస్ట్ కామెంట్ల కోసమో.. " Nice! totally agree with you అండి. ధన్యవాదాలు మీకు!
DeleteI don't care this Bloody Politics
ReplyDeleteఐనా పండగ చేసుకోనివ్వండి!!! ఎవడి పండగ వాడికి ఆనందం :) :)
http://sandeep-ohmyfriend.blogspot.in/2012/05/blog-post_24.html
Let it go Sandeep!
Deleteమీ పోస్టుకి కామెంట్లు చాలా బాగున్నయ్. ఇంత సీరియస్ గా బ్లాగ్స్ రాస్తున్నారని అనుకోలేదు. నేనయితే మాత్రం సరదాగానే రాస్తున్నాను. నిద్ర పట్టక రాస్తున్నాను. గొప్ప విషయాలేమీ చెప్పాలనుకోను (తెలిస్తేగా!). ఈ రాయడంలో నా తెలుగు ఇంప్రూవ్ అయ్యింది. పెద్దబాలశిక్ష, శంకరనారాయణ డిక్షనరీ ఎక్కువగా రిఫర్ చేస్తున్నాను. ఆ మేరకు నాకు గిట్టుబాటయ్యింది.
ReplyDeleteమీరు పోస్ట్ లు చాలామందిని నవ్విస్తాయి. సరదాగా ఉంటాయి.తెలుగు ఇంప్రూవ్ అవ్వడం అన్నది నిజమేనండి.ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు.
Deleteమీ మనసుని తృప్తి పరచుకోడానికి మీరు రాసేది బ్లాగ్గింగ్ . ఎవరి మెప్పు కోసమో రాస్తే నా లెక్కలో అది బ్లాగింగు కాదు . అది మన మనసుకి అవుట్ లేట్ .మనసులో బాధో సంతోషమో అక్షర రూపం లో బయటకు వ్యక్తం చెయ్యడమే . ఎదుటి వాళ్ళ యిష్ట యిస్టలతో దానికి పని లేదు . వోకోసారి మీరు వొకరి కోసమే రాయవలసిన పరిస్తితి ఉండొచ్చు . వాళ్ళు చదివి మీ ఆవేదన తెలుసుకుంటే అక్షరం పురుడు పోసుకున్నందుకు దాని జన్మ సార్ధకం అయినట్టే .ఎవరి మెప్పు కోసమో మనం రాస్తే వేరే వాళ్ళ కోసం పిండాన్ని మోసే సరోగాట్ మదర్ లా అయిపోతాం .గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చే భావానికి అక్షర రూపం పెట్టినప్పుడే ఆ రాత సాకారం పుచ్చుకుని వొక ఆకారం తయారవుతుంది . లేక పొతే వికారం లా వుంటుంది . ఫీల్ అయి రాస్తే జనాలు కూడా చదవడానికి ఫీల్ కారు సరిగ్గా రాయక పొతే వాళ్ళేమి ఫీల్ అవుతారో అనుకుంటే రాతలో ఆ ఫీల్ మిస్ అయ్యి రెంటికి చెడ్డ రేవడి అవుతుంది . సో మీ మనసు మాట విని అది చెప్పి నట్టే రాయండి .మిగత వాళ్ళ మనసులు కలిస్తే చదివి అనుభూతికి లోనవుతారు లేక పొతే బూతు గా భావించి పక్కకి జరిగి పోతారు .
ReplyDeleteఒక్కోసారి చిత్రం గా అనిపిస్తూ ఉంటుంది. బ్లాగింగ్ మొదలుపెట్టింది మనసులో భావలన్నిటికి రూపమివ్వడానికే! కాని నెమ్మదిగా చాలా విషయాల మీద పోస్ట్ లు రాయడం మొదలుపెట్టాను. ఎవరికోసమో అయితే రాయటం లేదు. స్నేహితులు academics గురించి రాయమంటే మాత్రం రాస్తున్నాను అప్పుడప్పుడు. మనసుకి తెర , ముఖానికి ముసుగు వేసుకుని చేసే బ్లాగింగ్ మాత్రం వద్దు..అని అనిపిస్తూ ఉంటుంది. ఎదైతే కాల్క్షేపం
Deleteబట్టానీయే కదా అని ఒక్కోసారి అనుకుంటాను. సరదాకి కొన్ని, ఫీల్ అయి కొన్ని, టైం కిల్ చెయ్యడానికి కొన్ని అలా రాసేస్తున్నాను.మన్స్పూర్తిగా మీరిచ్చిన సలహాకు ధన్యవాదాలు.