Monday, March 11, 2013

లేడీ బాస్-1




పరాయి దేశంలో ఉద్యోగం లో చేరిన మొదటి సంవత్సరం అది.పనే దైవంగా,తిండి,తిప్పలు కూడా పట్టించుకోకుండా,కంప్యుటర్ ముందు ఉదయాన్నే దించిన తల బాస్ తో మాట్లాడుతున్నప్పుడు,మీటింగ్స్ లో తప్ప ఎత్తకుండా,రాత్రి,పగలు తేడా లేకుండా పని చేసిన రోజులవి.చేతిలో ఉన్న పని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకోకపొతే,తట్టా,బుట్టా సర్దుకోమని చిరునవ్వుతో మర్యాదగా చెప్పేస్తారని తెలుసు కాబట్టి,చిన్నప్పుడు చదువుకున్న సంత్/సాధువు కబీర్ గారు రాసిన "కల్ కరే సో ఆజ్ కర్,ఆజ్ కరే సో అబ్"అన్న దోహా/కవితాసారం అనుక్షణం గుర్తుకు తెచ్చుకుని ఆ విధంగానే నడుచుకునేదాన్ని.

తను చెప్పిన పని కంటే రెట్టింపు పని చేసే గాడిద దొరికిందన్న సంబరం తో మా (తెల్ల) లేడి బాస్ తెగ మెచ్చుకునేది నన్ను ఆ రోజుల్లో.మెచ్చుకోవడం వరకేనా...అంటే అబ్బే,కాదండోయి..ఆవిడ నాతో పాటు పని చేస్తున్న ఒక ఫిలిఫెన్స్ అబ్బాయికి ఒక రోజు తట్టా,బుట్టా సర్దుకోమని చెప్పేసింది.నేను చేసిన తప్పేంటి,నువ్వు చెప్పిందల్లా చేసా కదా అని బేలగా అడిగాడు మా లేడి బాస్ ని."చెప్పిన పని మాత్రమే చేస్తున్నావు,అదే అదే పాయింట్"అని నవ్వింది మా బాస్.ఆ నవ్వులో అంతరార్ధం ఏమిటో అర్ధం కాక,బిక్క మొఖం వేసుకుని అందరి దగ్గరా సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు నా సహుద్యోగి.
 
మా టీంలోనే నాకంటే ఉద్యోగానుభవం ఉన్న తోటి భారతీయునికి మాత్రం విషయం అర్ధమయ్యి,నన్ను ఒక రూం లోకి లాకెళ్ళి,"ఇదిగో అమ్మాయి,కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్న సామెత విన్నావా?"అని అడిగాడు.బిక్క మొఖం వేసుకుని తల అటు,ఇటు తిప్పాను."ఛల్ విసుగు తెప్పించకుండా చెప్పు,అర్ధం అయ్యిందా లేదా?అలా అడ్డంగా తల ఊపితే అర్ధం అయ్యిందనా,లేదనా?"అని గద్దించాడు.అయ్యిందన్నాను."నువ్వు ఉద్యోగం చేసుకో తప్పు లేదు.తోటి ఉద్యోగుల ఉద్యోగాలతో ఆడుకోకు,ఎంత పని చెపితే అంత పని చేసి ఇంటికి ఛల్!అంతే కాని తగుదునమ్మా అని నీ బాస్ చెప్పని పనులన్ని చేసావో,మర్యాద దక్కదు.నువ్వు గాడిదలా పని చేస్తున్నావని,అందరూ అలాగే చెయాలని లేదు కదా?ఇలా ఇంకోసారి ఇంకొకరి ఉద్యోగం తో ఆడుకోకు"అని ఇచ్చాడు వార్నింగ్.చిన్నప్పటి నుంచి చెప్పిన పని చెయ్యకపోతే తిట్ట్లు తినడం అలవాటు కాని,ఇలా మా బాస్ నోరు ఎత్తకుండానే రేపు నాకేమి పని చెపుతుందో తెలుసుకుని పని చెయ్యడం తప్పు అన్న ఆతోటి భారతీయుడంటే బొలెడంత కోపం ముంచుకొచ్చేసింది నాకు.అలా ఎందుకు చెప్పాడో ఆ పెద్దమనిషి అని కొద్దిగా అలోచించి ఉంటే గీత బోధిస్తున్న శ్రీ కృష్ణుడిలా అతను కనిపించేవాడేమో..కాని ఆ రోజుల్లో అందరి వలస పక్షుల్లాగే నా గూడు మాత్రమే నాకు ముఖ్యం అనుకుని,పెద్దగా అతని మాటలు నేను పట్టించుకోలేదు.

ఇక్కడ మా లేడి బాస్ గురించి కొంచెం చెప్పాలి.ఆవిడ పేరు డోన్నా-అమెరికన్, పెళ్ళి చేసుకున్నది జెర్మన్ని.ఆవిడకు ఇద్దరు కూతుళ్ళు.ఇద్దరు టీనేజర్లు-హైస్కూల్ లో చదువుకునే వారు.అద్భుతమైన అందగత్తె ఆవిడ.నలభయి ఐదు సంవత్సరాల వయసున్నా అలా కనిపించేది కాదు.ఎంతో చక్కగా డ్రెస్స్ చేసుకునేది.మేకప్ ఆవిడ అందాన్నిరెట్టింపు చేసేది.ఆవిడను ఆరాధనాపూర్వకం గా చూస్తూ,ఇలా హుందాగా చక్కగా ఉండాలి అని ఆ రోజుల్లో లెక్కలేనన్ని సార్లు అనుకునేదాన్ని.నాకు,ఆవిడకు కొద్ది రోజులకు చనువు పెరిగి,అప్పుడప్పుడు మధ్యానం లంచ్ కి కలిసి వెళ్ళడం జరిగేది.ఆఫీస్ లో,వర్క్ విషయంలో ఎంత కటువుగా ఉండేదో,ఆఫీస్ పార్టిస్ లో,లంచ్ కి వెళ్ళినప్పుడు అంతే సరదాగా ఉండేది.

అప్పుడే కిండర్గార్డెన్ లో అడుగుపెట్టిన నా కూతురి గురించి మురిపెంగా సమయం దొరికినప్పుడల్లా డొన్నా తో చెప్పేదాన్ని.నా కూతురు ఒక పిచ్చి గీత గీసినా,ఒక్క కొత్త పదం నేర్చుకున్నా,ఒక స్నేహితురాలి  గురించి మాట్లాడినా,ఆఖరికి స్కూల్ కి తీసుకెళ్ళిన లంచ్ బోక్ష్ లో లంచ్ మొత్తం తినేసినా అబ్బురమే నాకు.ఆ రోజుల్లో "అమ్మా,అయి లవ్ యు సో మచ్"అన్నప్పుడుల్లా మురిసిపోయేదాన్ని.డోన్నా తో లంచ్ కి వెళ్ళినప్పుడల్లా అవే కబుర్లు చెప్పేదాన్ని.పాపం చెప్పినవన్ని ఓపికగా వినేది, అప్పుడప్పుడు "lovely"," so cute" అని కూడా అనేది.తను మాత్రం భర్త గురించి అప్పుడప్పుడు కొన్ని విషయాలు చెప్పేది కాని,ఎప్పుడు తన కూతుళ్ళ గురించి మాట్లాడేది కాదు.ఎప్పుడన్నా నేను అడిగినా...నిట్టూర్చేది,కాని ఎక్కువగా ఏమి మాట్లేది కాదు వారి గురించి.

అలా ఒక మూడు సంవత్సరాలు గడిచిపోయాయి.ఒక శుక్రువారం రోజున డోన్నా లంచ్ కి వెలదామా అని అడిగింది,సరే అని ఇద్దరము వెళ్ళాము.ఆవిడ ఎప్పుడు తినే గడ్డి గాదం (salad) తెచ్చుకుని తింటూ,మాట్లాడసాగింది. ఆ రోజు మా సంభాషణ పూర్తి ఆయ్యాక,నాకు నోట మాట రాలేదు.మొదటి సారి నేనెంతో ఆరాధించే డోన్నా మీద అస్సయం వేసింది.అప్పటి వరకు ఆవిడకు మనస్సులో వేసిన పెద్ద పీట ని తీసేసాను.ఇచ్చిన పనులు చెయ్యడం తప్ప,నెమ్మదిగా ఆవిడతో మిగతా ఇంటెరాక్షన్ తగ్గించేసాను.

అలా కొన్ని సంవత్సరాల తరువాత,ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఇంకో ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి నిశ్చయించుకుని అదే విషయం డోన్నాకి చెప్పాను.సహజంగానే బాధపడింది,ఉండిపొమ్మని అడిగింది...లేదు, నిర్ణయించుకున్నా..ఇక్కడ పెద్ద ఎదుగుదల లేదు అని చెప్పాను.సరే అంది,ఫేర్వెల్ల్ లంచ్ కి వచ్చింది.అప్పుడు కూడా పొడి పోడిగా మాట్లాడాను తప్ప,అసలు డోన్నా తో సరిగ్గా మాట్లాడకలేకపోయాను.ఆ రోజు ఒక కోలీగ్ అడిగింది."ఒకప్పుడు నాలుగు మాటలు మాట్లాడితే అందులో మూడు నీబాస్ గురించి మాట్లాడేదానివి,ఇప్పుడు ఏమయ్యింది? డోన్నా  నిన్ను  మెత్తగా చివాట్లు పెట్టిందా?"అని కూపీ లాగాలని ప్రయత్నించింది. విషయం దాటేసి,గుడ్ బై చెప్పి ఆ ఆఫీస్ తో రుణం తీరిపోయింది అనుకుని ఇంటి ముఖం  పట్టాను.

(తరువాయి నెక్ష్ట్ పోస్ట్ లో)

23 comments:

  1. ఏమైందో సీక్రెట్ గా చెప్పేయ కూడదూ . రేపటి పోస్ట్ దాకా ఆగాలా?

    అయినా అంత బుద్దిగా పని చేస్తారా? అన్నేళ్ళు? హమ్మా ! :)

    ReplyDelete
    Replies
    1. వనజగారు, అబ్బ ఆగుదురూ...తరువాయి పోస్ట్ కోసం.
      ఏదో కూటి కోసం కోటి తిప్పలు అంటారు కదా..బుద్ధిగా పని చెయ్యకపోతే సర్దుకుని వెళ్ళమంటారేమో అని.. :)
      అయినా అప్పట్లో ఒక రకమైన బెరుకు, భయ్యం ఉండేవి లెండి..ఇప్పుడు అంతా "Take it easy" పోలసి. మీ వాఖ్యకి , స్పందనకి ధన్యవాదాలు.

      Delete
  2. enduku asahyam vesindi me boss meda secret entandi?

    ReplyDelete
    Replies
    1. తొందరెందుకండి వజ్రం గారు? త్వరలో తెలుసుకుందురు ఆ కారణం.
      మీ స్పందనకు ధన్యవాదాలండి.

      Delete
  3. అమ్మో నా వైరస్ ని అయినా భరించగలను కాని ఈ సస్పెన్స్ భరించడం కష్టం .
    ఆమె చూపిన రెండో కోణం మీరు మొహమాట పడకుండా అవిష్కరించగలరు .
    కొంపతీసి ఆవిడ కూతుర్లకి తండ్రి పోలిక రాకపోవడం వెనక దాగి వున్న నిఘుడ రహస్యం
    ఏదన్నా మీకు చెప్పడం జరిగిందా?

    ReplyDelete
    Replies
    1. హా హా హా.. అంత సస్పెన్స్ ఎమీ లేదు లెండి.
      మీరు చెప్పినట్టే మొహమాట పడకుండా రాస్తాను.
      మీరు ఊహించిన కోణం చూసి నవ్వుకున్నాను.ఇలా ఊహించడం రవిగారికి మాత్రమే సాధ్యం... :) వేచి చూడండి మరి. స్పందించిన మీకు ధన్యవాదాలు రవిగారు

      Delete
  4. కథనం బాగుంది. తరువాయి పోస్ట్ కోసం.....

    ReplyDelete
    Replies
    1. వర్మ గారు, కథనం మీకు నచ్చినందుకు చాలా సంతోషం.
      వాఖ్య రాసి స్పందించిన మీకు ధన్యవాదాలు.

      Delete
  5. నాకు నచ్చింది మీరిచ్చిన బ్రేక్..

    ReplyDelete
    Replies
    1. మొత్తనికి మీరు మాత్రం ఇచ్చిన బ్రేక్ నచ్చిందన్నారు:))
      ధన్యవాదాలు ప్రసాద్ గారు

      Delete
  6. last part ayina tharuvata comment raadaamanukunnaa..kaani appudu ekkaduntaano theliyaka...ippude raastunnaa..
    ee suspense entandi babu
    :venkat

    ReplyDelete
    Replies
    1. "అప్పుడు ఎక్కడుంటానో తెలియక" అని రాసారు...??? చదివి వాఖ్య రాయాల్సిందే వెంకట్ గారు ఎక్కడున్నా..అంతే మరి! ధన్యవాదాలు మీకు.

      Delete
  7. జల 'తాజా' వెన్నెల గారు,

    ఈ కథ ఇంతకు మునుపే మరొక్కరు రాసినట్టున్నారే ?

    కథనం బాగుందండోయ్ !

    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. అవునాండి జిలేబి గారు?
      ఐటి లో సామన్యం గా లైఫ్ ఇలాగే ఉంటుంది కదా? అందుకని అలాగనిపించి ఉండొచ్చు మీకు.
      అయినా ముందు భాగాలు చదివేదాకా ఆగండి.
      ఆపై మీ కామెంట్ల కత్తి కి పని చెప్పండి! :))
      ఏది ఎమైనా మీ రాక నాకు సంతోషమే సుమండి. ధన్యవాదాలు.

      Delete
  8. ఈ వేళ తప్పక చెబుతారు కదా! గుప్పెడ మూస్తేనే ఉత్సుకత :)

    ReplyDelete
    Replies
    1. భలే మాట చెప్పారండి.గుప్పెడ మూస్తేనే ఉత్సుకత :)
      అందుకని ఇంకొన్ని భాగాల దాకా ఆగుదాములేండి.
      శర్మ గారు,ధన్యవాదాలండి మీ స్పందనకు, మరియు వాఖ్యకి

      Delete
  9. మీ‌ కథాకథనాలు రెండూ బాగున్నాయి. నిజానికి రెండవ భాగం టపా కనిపించి, మొదటి భాగం చదివాను తొలుత.
    రెందవభాగం కూడా బాగుంటుందని ఊహిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు మీరు పోస్ట్ చదవడమే నాకు ఎంతో ఆనందం. నచ్చిందని చెపితే ఇంక అవధులుండవు ఆనందానికి. ధన్యవాదాలండి.

      Delete
  10. Jalatharu vennela Frist time chusanu....ledy boss-1 episode Vakya nirmanam,bhavukatha,saili chala bavundhi,Khandantharaallonunde me vanti varu Telugu lo usulu cheppatam Chala Santhosham.................Gangadhar

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు గంగాధర్ గారు.

      Delete
  11. Jalatharu vennela Frist Time chusanu...Posts Chala bavunnai,
    Ledy boss-1 Kallamundhu Jariginatlu Anpistundhi,Chala offices lo jarindhe Ainaa Vakya Nirmanam,Shaili,Bhavukatha Prathyekam.

    Khandantharallo unde me vanti vallu ila usulu cheppatam,Mammalandarini Alarinchatam Chala goppa vishayam.....

    ReplyDelete
  12. జలతారు వెన్నెల గారు
    శుభోదయం.మీ పోస్ట్ చాలా బాగుంది.అభినందనలు

    ReplyDelete
    Replies
    1. ఉమాదేవి గారు, బాగున్నారా? చాలా రోజులకి మీ పలకరింపు.
      పోస్ట్ మీకు నచ్చినందుకు సంతోషం. ఈ శీర్షికలో అన్ని పోస్ట్స్ చదవండి మీకు వీలు కుదిరితే. ధన్యవాదాలు.

      Delete