| Artist: Mohan |
చూస్తుండగా ఎంత ఎదిగి పోయింది అమ్మాయి. ఒకప్పుడు "అమ్మా.." అంటూ ప్రతి చిన్న విషయానికి తన చుట్టు తిరిగేది కదా అని అనుకుంటూ అమ్మాయి రూం నుంచి వచ్చేసరికి తనకి వేడి వేడి గా తినటానికి వడ్డిస్తూ,ఎదురుగా కుర్చీలో కూర్చుని,"ఏమయ్యిందిరా ఈ రోజు స్కూల్ లో" అని అడిగాను. "నథింగ్" పొడిగా జవాబు."హోం వర్క్ ఎక్కువగా ఉందా"అని అడిగాను."ఆ మరి ఉండదా?అన్ని సబ్జెక్ట్స్ లో హోంవర్క్ ఉంది,పైగా రేపు రెండు పరీక్షలు కూడా ఉన్నాయి.నాకు నిద్రపోడానికి కూడా టైం ఉండదు" అని చెప్పింది అమ్మాయి."సరే తొందరగా తినేసి సమయం వృద్ధా చెయ్యకుండా వర్క్ చేసుకో,అలా అయినా ఒక నాలుగు గంటలు పడుకోవచ్చు అని అన్నాను అమ్మాయితో."నువ్వు చెప్పక్కర్లేదు,నాకు తెలుసు"అని విసురుగా వచ్చింది సమాధానం.వెంటనే కోపంతో "అలాగేనా అమ్మతో మాట్లాడేది?నువ్వు చదువుకున్నా,చదువుకోకపోయినా నాకు ఫర్వాలేదు కాని, పెద్దవారితో మాట్లాడే పద్దతి మాత్రం నేర్చుకోవాలి.నీ ఇష్టం వచ్చినట్టు ఎంత మాట పడితే అంత మాట అనేస్తావా?" కోపంగా అడిగాను.ఆ మాటకి అమ్మాయి కూడా ఊరుకోకుండా"నేనేమన్నా పాపాయిననుకున్నావా?నువ్వు అన్నీ చెపితే కాని నాకు తెలీదా?"అనేసి తన రూం లోకి వెళ్ళిపోయింది అమ్మాయి.మనస్సు చివుక్కుమన్నా,పద్నాలుగేళ్ళకే వయస్సుకి మించి చదువులు, ఒక్క నిమిషం తీరిక లేకుండా ఒక దాని తరువాత మరోక యాక్టివీటీస్ తో సతమతమవుతున్న మూలాన ఉన్న స్ట్రెస్స్ అని సరిపెట్టుకుని పనిలో మునిగిపోయాను.
రెండు వారాల్లో కొత్త ఉద్యోగం లో చేరాలి నేను.ఈ రెండు వారాలు అమ్మాయికి నాకు మధ్య ఎన్నో వాగ్యుద్దాలు.ప్రతి చిన్న విషయానికి విస్సుకోవడం, ఎదిరించటం,మళ్ళీ వచ్చి "I did not mean it, sorry అని చెప్పటం.Stop treating me like a baby"అనటం..ఇలా ఎన్నో ఎన్నేన్నో.. ఒకప్పుడు అమ్మని నిమిషం వదిలిపేట్టకుండా,స్కూల్ కి ఎప్పుడన్నా వెళితే "My mom" అని ఫ్రెండ్స్ అందరిని పరిచయం చేసే తన గారాల పట్టేనా ఇది అని అనుకునేదాన్ని.ఇప్పుడు పొరపాటున ఎప్పుడన్నా, స్కూల్ కి వెళితే, "ఎందుకొచ్చావు అమ్మా?You are embarrassing me"అని నన్ను తప్పించుకుని వెళ్ళడం లాంటి పనులు చేసినప్పుడు విపరీతంగా బాధ పడేదాన్ని. శ్రీవారు చాలా తేలిక గా "అబ్బా, నీ పని నువ్వు చేసుకోవోయి,అది మంచి అమ్మాయి,బుద్ధిగా చదువుకుంటుంది కదా,అంతకంటే ఏమి కావాలి నీకు,కాస్తా దాని గురించి పట్టించుకోవడం మానేస్తే బెట్టర్." అని సలహా ఇచ్చేసి ఆ టెన్నిస్ రాకెట్ ఊపుకుంటూ వెళ్ళిపోయారు.
అమ్మాయి రూం గురించి ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పాలి.శనివారం నాడు రూం క్లీనింగ్ అని మొదలుపెట్టి చక్కగా అద్దం లా సర్దుకుంటుంది. ఆదివారం తను పడుకునే మంచం ఖాలీగా ఉండటం మూలాన,హాయిగా పడుకుంటుంది.ఇక సోమవారం నుండి అమ్మాయికి మంచం మీద పడుకునే చోటు క్రమేనా తగ్గిపోతు ఉంటుంది.అలాగే సర్దుకుని,రోజు రోజుకి ఎంత వీలైతే అంత తక్కువ చోటులో పడుకుంటూ,శుక్రువారం రాత్రి అయ్యేసరికి,ఒక మూలగా మంచం మీద ముడుచుకుని ఏ నిమిషంలో అయినా పడిపోతుందేమో అని భయపడేలా పడుకుంటుంది.ఆ మంచం మీద 90% పుస్తకాలు,ఇంకా మిగతా వస్తువులతో మునిగి పోయి ఉంటుంది.ఇదెక్కడి చోద్యం, ఆ పుస్తకాలు తీసి టేబల్ మీద పెట్టి,సరిగ్గా పడుకోవచ్చుగా అంటే "నాకు టైం లేదు,నీకెందుకు?"అనేస్తుంది ఫట్ మని.పోన్లే కదా అని ఒకరోజున నేనే బుధవారం నాటికి మంచం పుస్తకాలతో మునిగిపోయి ఉంటే, చక చక అవన్ని తీసేసి, టేబుల్ మీద పెట్టి నీట్ గా పక్క సర్దేసాను.
ఆరోజు అమ్మాయి "నువ్వెందుకు నా పుస్తకాలు సర్దావు,నాకు ఏ పుస్తకం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలీదు"అంటుంటే,విస్తుపోయి,అన్ని పుస్తకాలు ఆ టేబుల్ మీదేగా పెట్టా..అంటే,అయినా వినకుండా నా మీద విరుచుకు పడిపోయింది.చేసిన తప్పు ఏమిటో అర్ధం కాక బిక్క మొఖం వేసి, నీ రూం వైపు కాని,నీ జోలికి గాని వస్తే మళ్ళీ చూడు అని బాధగా అక్కడ నుంచి వచ్చేసాను.సరిగ్గా అప్పట్లో రెండు సంవత్సరాల క్రితం రేవతి దర్శకత్వంలో ఒక సినిమా వచ్చింది."Mitr" అని.ఆ సినిమాలో కూడా ఇలాగే తల్లి చిందరవందరగా ఉందని కూతురు రూం సర్దితే,చెడా మడా తల్లిని తిడుతుంది కూతురు.పాపం శోభన(తల్లి పాత్రధారి) తను చేసిన తప్పేమిటో తెలియక కుమిలిపోతుంది.మరీ శోభన లెవల్ లో కాకపోయినా, చాలా బాధ పడ్డాను నేను కూడా.మళ్ళీ శ్రీవారి సలహా.."అస్సలు నీకెందుకోయి?హాయిగా రెస్ట్ తీసుకోక,దాని రూం సర్దాల్సిన అవసరం నీకేంటి? అదే సర్దుకుంటుంది, ఇబ్బందైతే తనకి తెలుస్తుంది కదా" అని చిద్విలాసం గా ఒక నవ్వు.ఒళ్ళు మండిపోయింది ఆయన అలా నవ్వుతూ ఇచ్చిన సలహాకి.
చూస్తుండగానే రెండు వారాలు గడచిపోయాయి.కొత్త ఉద్యోగం లో జాయిన్ అయ్యాను.కొత్త వాతావరణం,కొత్త మనుషులు,అంతా కొత్తే.నాకు బాస్ మాత్రం ఈ సారి కూడా ఒక లేడీ. కొత్త లేడీ బాస్ పేరు జేన్. ఇంక రెండు సంవత్సరాలలో రిటైర్ అయ్యే వయస్సు ఆవిడ. శ్రద్దగా పని నేర్చుకుంటూ, చేసుకుంటూ, కొద్ది రోజులలోనే దగ్గరయ్యాను ఆవిడకి.ఇంతకు ముందు ఉన్న అనుభవంతో అసలు వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడం కాని,అడగటం లాంటివేవి జరగలేదు మా మధ్య.అలా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక శుభముహుర్తాన ఆవిడ నాతోనే కాక నా ఇద్దరి కొల్లీగ్స్ తో అన్న మాటలకి నేను విస్తుపోయాను.అసలు ఈ తెల్ల వాల్లందరు ఒకటేనా?వీళ్ళందరి అలోచనలు ఇలాగే ఉంటాయా?ఏదో పోడిచేద్దామని ఈ దేశం పరిగెట్టుకుని వచ్చింది ఇలాంటి వారి మధ్య జీవించడానికేనా లాంటి ప్రశ్నలు వేసుకున్నాను నన్ను నేనే!
(ఆఖరి భాగం రేపటి పోస్ట్ లో!)
(ఆఖరి భాగం రేపటి పోస్ట్ లో!)
వాఆఅ ఈ రోజు కుడా సస్పెన్సేనా ఈ తెల్ల బాసిణులు ఏమంటున్నారండీ అసలు.. త్వరగా చెప్పేయండి.
ReplyDeleteమిత్ర్ చాలా మంచి సినిమా అండీ నాకు ఇష్టం. తల్లీ కూతుళ్ళ మధ్య ఇలాంటి తగవులు ప్రతి ఇంటా సహజమేనేమో. మా ఇల్లూ ఎక్సెప్షన్ ఏం కాదు.
వేణు గారు, సస్పెన్స్ పెద్దగా ఏమీ లేదండి.నెక్ష్ట్ పోస్ట్ లో చదువుదురు గాని.
Deleteపోస్ట్స్ చదివి వాఖ్యని వదిలినందుకు ధన్యవాదాలు.
ఆఖరి భాగం కూడా చదివి అభిప్రాయం తెలుపగలరు.
మొదటి భాగం...సస్పెన్స్...సస్పెన్స్...సస్పెన్స్
ReplyDeleteరెండో భాగం....పాపం: అయినా పిల్లలింతే లెండి:)
అవునూ, ఆ లేడీబాసూ ఇదే కష్టాలు పడిందేమో!!! తెలిసింది...దీనికీ మూడో భాగానికి చాలానే సంబంధం ఉందిలెండి:)))
జయగారు, ముందుగా రెండు భాగాలు చదివిన మీకు థాంక్ యు.
Deleteసస్పెన్స్ మీకు విడిపోయినా అలా చెప్పకూడదండి...గప్ చిప్..అంతే!
అయినా మీరు ఊహించినదానికంటే భిన్నంగా ముగింపు ఉంటే?
ముగింపు చదివాక అభిప్రాయం తెలుపండి.
మానవ మనస్తత్వం ఎక్కడయినా ఒకటే :)
ReplyDeleteనిజం చెప్పారు శర్మ గారు.ధన్యవాదాలు మీ స్పందనకి.
Deleteఈ భాగం కూడా బాగుంది. మీ అమ్మాయి మంచం కృష్ణపక్షచంద్రబింబంలా క్రమంగా చిక్కిపోవటం తమాషాగా అనిపించింది. టీనేజ్ అమ్మాయిలు తల్లులతో అకారణంగా తరచుగా పోట్లాడటం సర్వసాధారణమైన విషయమే. మూడోభాగం కోసం వేచి ఉన్నాం.
ReplyDelete"అమ్మాయి మంచం కృష్ణపక్షచంద్రబింబంలా" పోలిక భలేగా చెప్పారండి శ్యామలీయం గారు.
Deleteమీకు నచ్చిందంటే ఆనందమేనండి.రెండు భాగాలు చదివి వాఖ్యని వదిలినందుకు ప్రత్యేక ధన్యవాదాలండి.
పిల్లలందరూ బహుశా మీ పాప లాగానే ఉంటారు . చదువుల ఒత్తిడి, టైం మేనేజ్మెంట్ చేసుకోలేక ఆ చిరాకుని ఇంట్లో చూపిస్తారు. వాలా రూం లోకి రావడం కూడా ఇష్టం ఉండదు. ఫస్త్రేషన్ లో వాళ్ళు ఏమన్నా సర్దుకు పోయేది, బిడ్డల ప్రవర్తన ఎందుకు అలా ఉందొ తల్లడిల్లిపోయేది తల్లి మాత్రమే !
ReplyDeleteమరి ఇలాంటి మనస్థత్వమే ఉన్న ఉన్న స్త్రీ మూర్తులు కారా.. మీ లేడీ బాస్ లు . మళ్ళీ సస్పెన్స్ లో పెట్టారా ! వేచి చూస్తాం మేడం, (సీరియల్స్ చూస్తున్నంత సస్పెన్స్ తో మాత్రం కాదు.
ఈ రోజు పోస్ట్ చాలా సహజంగా వ్రాసారు ఎక్కడా తెచ్చిపెట్టుకున్న బేషజం లేదు . గుడ్ నాకు బాగా నచ్చింది .
వనజగారు, ఆఖరి భాగం చదవండి. అప్పుడు తెలుసుకోండి మా లేడీ బాసుల గురించి..నచ్చిందన్నారు...సంతోషం.
Deleteప్రొత్చహిస్తూ వాఖ్య వదిలిన మీకు ధన్యవాదాలు.
ఆడ పిల్లలు ఉండటం మీ అదృష్టం..పిల్లలు మీతో కలసే ఉండడం చాలా అదృష్టం...మాలాగా, పిల్లలు ఏళ్ళ తరబడి హాస్టళ్లలో...మేం ఇక్కడా..ఆ నరకం అనుభవిస్తే తెలుస్తుంది..ఆడ పిల్లలు విసుక్కున్నా చివరివరకు చూసుకునేది వాళ్లే నండీ బాబూ...ఈ మగ పిల్లల్ని ఏ అందాల రాక్షసులో ఎత్తుకు పోరా?
ReplyDeleteఆడపిల్లలైనా, అబ్బాయిలైనా ఒకటేనండి. నిజమే! పిల్లలు దూరం గా ఉండటం నిజంగానే చాలా బాధ.ఆడపిల్లలు మాటలతో , చేతలతోను ప్రేమను వ్యక్తపరుస్తారు. ఆబ్బాయిలు ఎక్కువ సాతం, వారి చెతలతో మాత్రమే ప్రేమను వ్యక్తపరుస్తారు. తల్లితండ్రులను ఇద్దరు చూసుకుంటారు లెండి. Exceptions are there both in men and women ప్రసాద్ గారు.
ReplyDelete