Thursday, March 14, 2013

లేడీ బాస్-3


క్రమంగా నాకు  ఉద్యోగ బాధ్యతలు పెరిగి, జేన్ తో  రోజుకి కనీసం ఆరు గంటలు,ఒక్కోసారి ఏడు గంటలు కలిసి పనిచెయ్యాల్సివచ్చేది.జేన్ భర్తకి కేన్సర్ అని ఒక రోజు నాతో చెప్పింది.అతను క్రిటికల్ గానే ఉన్నాడని తను ఎలాంటి వార్త వచ్చినా నిలదొక్కుకోడానికి  సిద్దంగానే ఉన్నట్టు చెప్పింది.ఆ వార్త విన్న రోజు నాకు చాలా దిగులు వేసింది.మనస్సులో ఎంత బాధ ఉన్నా,ఎప్పుడు నవ్వుతూ,ధైర్యంగా కనపడే జేన్ ని  చూసి చాలా నేర్చుకోవచ్చు అనిపించింది.

25, 27 సంవత్సరాల కొడుకు, కూతురు ఉన్నారు జేన్ కి.జేన్ కొడుకు కూడా మా ఆఫీస్ లోనే పనిచేసేవాడు.వారివురూ ఎక్కువగా మాట్లాడుకునే వారు కాదు.వాళ్ళ లాస్ట్ నేంస్ కలవడం చూసి నేను ఒక రోజు జేన్ తో నీ లాస్ట్ నేం ఫలానా అబ్బాయికి ఉంది కదా అని అడిగితే,అతను నా కొడుకు అని చెప్పింది.ఆశ్చర్యపోయాను.ఈ విషయం తను నాతో ఎప్పుడు ప్రస్తావించకపోవడం కొద్దిగా వింతగా అనిపించింది.కూతురు గురించి అడిగితే,భర్త నుంచి విడాకులు తీసుకుందని న్యూయార్క్ లో ఉద్యోగం చేస్తుందని చెప్పింది.నన్ను కూడా అప్పుడప్పుడు నా కూతురి గురించి అడిగేది."టీనేజ్ అమ్మాయి ఇంట్లో ఉందంటే నువ్వు అనుభవించే మానసిక సంఘర్షణ నేను అర్ధం చేసుకోగలను"అని ఒక రోజు అంది.ఒక్క నిమిషం ఉల్లిక్కిపడి "అలాంటిదేమి లేదే ...నాకూతురుకేంటి బంగారం"అని మాట దాటేసాను.లేడీ బాస్ లు(డొన్నా,జేన్)ఇద్దరిని చూసి నేను స్పూర్తి చెంది నేర్చుకున్నది ఎంతో ఉన్నా,కొన్ని సంధర్భాలలో వారితో సంభాషించినప్పుడు వారు వ్యక్తపరిచిన కొన్ని అభిప్రాయాలు విన్నాక నాకు వారి మీద ఒక రకమైన విముఖత కలిగింది.
ఎవ్వరి కోసము నేను ఆగనంటూ కాలచక్రం గిర్రున తిరిగింది.అమ్మాయి కాలేజ్ కి వెళ్ళాల్సిన రోజు దగ్గరపడింది.మనస్సులో అంతులేని దిగులు,ఒక రకమైన గుబులు.రోజు ఉదయాన్నే స్కూల్ బస్ వెళ్ళిపోతుంది అని హడావిడి పడటం ఉండదు.నాతో చీటికి మాటికి ప్రతిదానికి వాదనకు దిగేవారు ఉండరు.చేసిన వంట తినకుండా ఇంకేదో కావాలని అడిగే వారు ఉండరు.పిక్కప్ లు,డ్రాప్ లు  ఉండవు,రాత్రిళ్ళు తనతో పాటు మెలుకుని ఉండాల్సిన రోజులు ఉండవు.ఒక్కసారిగా ఎన్నో సంవత్సరాలుగా అలవాటైన దినచర్య పూర్తిగా మారిపోతుంది అన్న ఊహే భరించడానికి కష్టం గా ఉండేది. కొద్ది రోజులు సెలవు పెట్టి అమ్మాయితో నెల రోజులు గడిపాను.చిత్రంగా మా మధ్య గొడవలు చాలా మటుకు తగ్గిపోయాయి.అలా అని పూర్తిగా కాదు,కాని తను నవ్వుతూ,ఆనందంగా ఉండటం,ఇంతకు ముందులా ధుమ ధుమ లాడుతూ ఉండటం చాలా మటుకు తగ్గింది.నెలరోజుల తరువాత తను కాలేజీకి వెళ్ళిపోయింది.నా దినచర్యలో ఎంతో మార్పు.ఒకప్పుడు ఊపిరి పీల్చుకోడానికి కూడా సమయం ఉండేది కాదు,ఇప్పుడు అంతా తీరికే!రోజు అమ్మాయి ఒక టెక్ష్ట్ మెస్సేజ్ ఎప్పుడు పంపిస్తుందా,ఎప్పుడు ఫోన్ చేస్తుందా అని ఎదురుచూసేదాన్ని.
ఒక రోజు అమ్మాయి ఫోన్ చేసి రెండు రోజులయ్యిందని దిగులుగా ఉందని జేన్ తో చెప్పాను.తను నాతో "పిల్లల మీద విపరీతమైన ప్రేమను పెంచుకుంటాము మనము.రక్త సంభంధమే కాకుండా,వారు చిన్నతనంలో మన పట్ల వ్యక్తపరిచే ప్రేమను చూసి కూడా జీవితంలో ఇంతకంటే మధుర క్షణాలు ఉండవు కదా అనిపిస్తుంది.కాని నెమ్మదిగా వారు పెరుగుతున్న కొద్దీ,వారిలో చాలామార్పు వస్తుంది.దేవుడు టీనేజ్ అన్నది సృష్టించి,పిల్లల ఇంకో రూపం చూపుతాడు మనకి.ఆ మార్పు మనల్ని నెక్ష్ట్ స్టేజ్ కి బాగా ప్రిపేర్ చేస్తుంది.వాళ్ళు ఇల్లు వదిలి పైచదువులకని వెళ్ళిపోవడం-నెక్ష్ట్ స్టేజ్.ఒకవేళ వాళ్ళు మారకుండా చిన్నప్పుడు ఉన్నట్టే కనక ఉంటే,వారి దూరాన్ని/యడబాటుని తట్టుకుని తల్లులు జీవించలేరు.They make it so easy for us.."అని చెప్పింది. ఎందుకో ఈ సారి తను చెప్పింది నిజమే అనిపించింది.అయినా సరే,అంతకు ముందే జేన్,డోన్నా పట్ల నేనేర్పరుచుకున్న అభిప్రాయం మాత్రం మారలేదు.
కొన్ని సంవత్సరాలు అక్కడ పని చేసిన తరువాత,నేను మళ్ళీ ఉద్యోగం మారాను.కొత్త ఉద్యోగం,కొత్త మనుషులు,కొత్త వాతావరణం.నా బాస్ మాత్రం ఈ సారి లేడి కాదు."మొత్తానికి ఇన్నాళ్ళ తరువాత నీకు ఒక మగ బాస్ ..భలే!"అని శ్రీవారు నన్ను ఆటపట్టించారు."అయితే ఏంటట?ఇప్పుడు ఈ కొత్త ఉద్యోగంలో నేనయ్యాను కదా,కొంతమందికి లేడీబాస్" అని నవ్వుతూ సమాధానమిచ్చాను.
(ఎంత కుదించి రాయాలన్నా వీలుకాక,టపా పెద్దదైపోవడం వలన ముగించలేక పోయాను.ముగింపు తప్పకుండా తరువాయి పోస్ట్ లో)

20 comments:

  1. suspense alane unchesaaraa ?
    waiting for next post..
    :venkat

    ReplyDelete
    Replies
    1. సస్పెన్స్ నిజంగానే ఇంకా ఉందంటారా వెంకట్ గారు? :)))
      ఆఖరి భాగం లో తెలిసిపోతుంది లెండి.
      మీరు ఎక్కడ ఉన్నా, చదివి స్పందిస్తున్న మీకు ధన్యవాదాలు.

      Delete
  2. మానవ మనస్తత్వం ఎప్పుడూ ఎక్కడా ఒకటే అనేది మరొకసారి చెబుతున్నా. అలాగే మానవుల అభిమానం,తెలుగులో వెంటనే చెప్పలేక ఇంగ్లీషు మాట వాడేను క్షమించంచండి, ఎమోషన్స్ ఎక్కడా ఎప్పుడూ ఒకటే, మారవుగాక మారవు. పిల్లల మీద మనం పెంచుకునే మమకారం ఉంది చూడండి, ఛ! కాదనుకుంటాం,కోసేసుకుందాం అనుకుంటాం, ఉండలేం, మన తల్లి తండ్రులు అలాగే ఉన్నారు, మనతో, రేపు మన పిల్లలూ వారి పిల్లలతో అంతే. దూరం పెరిగితే దగ్గరవుతాం, దగ్గరగా ఉంటే దూరమవుతాం, ఇది సర్వ సహజం. మనసుకు దగ్గరగా వచ్చినవారు పిల్లలు, బంధువులూ కాకపోయినా మనసు చిత్రంగా స్పందించి, బాధ పడుతుంది.ఇదే మానవత్వం.కాదనుకున్నా, వద్దనుకున్నా నిత్యం వారినే స్మరిస్తుంది. వ్యాఖ్య పెద్దదయిపోయింది. నా ఎమోషన్ ఆపుకోలేకపోయా! క్షమించండి.

    ReplyDelete
    Replies
    1. శర్మ గారు, నిజంగానే చాలా ఎమోషనల్ అయ్యారు. కాని పోస్ట్ ని బాగా అర్ధం చేసుకున్నారు. మానవ మనస్తత్వం ఎప్పుడూ ఎక్కడా ఒకటే అనేది అన్నది సత్యమే అయినా నా అనుభవంలో నేను దగ్గరగా ఇక్కడి వారిని చూసి తెలుసుకున్న విషయాలు గురించి చెప్పాలనే ఇన్ని టపాలు....
      పిల్లల విషయం లో మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజమేనండి. మనస్పూర్తిగా స్పందించిన మీరు నన్ను క్షమించమని అడగకూడదు. ఇంకెప్పుడు ఆ పదం మీరు అసలు వాడకండి నా బ్లాగ్లో.. మీ వాఖ్య ఎంత పెద్దది అయితే అంత ఆనందం. ధన్యవాదాలు మీకు.

      Delete
  3. Replies
    1. More of a leader than a boss , I guess...వనజ గారు, చూస్తున్నా, చూస్తున్నా.. ఆట పట్టిస్తున్నారు. స్నేహపూర్వక స్పందనకు థాంక్ యు సో మచ్!

      Delete
  4. suspense alane pettesaru...waiting waiting

    ReplyDelete
  5. బాగుంది మీ లేడీ బాస్ ,నెక్స్ట్ దాని కోసం ఎదురు చూపులు.
    మీ ఈమెయిలు తెలిస్తే నా కధ scanned copy మీకు పంపిస్తాను. లేదా ముఖపత్ర చిరునామా అయిన సరే

    ReplyDelete
    Replies
    1. కథా రచయిత్రి మెచ్చినందుకు మిక్కిలి ఆనందం. ఆర్జంట్ గా మీ ఇమైల్ నా బ్లాగ్ లో ఇవ్వండి కామెంట్ రూపేనా..మీకు ఇమైల్ పంపుతాను, ఆ కథ తొందరగా చదవాలని ఎంతో వెయిటింగ్ ఇక్కడ. థాంక్ యౌ పూర్వ ఫల్గుణి గారు.

      Delete
  6. హహహహ మీరే లేడీ బాస్ అయ్యారనమాట బాగు బాగు :-) ఈ బాస్ గారు చెప్పిన టీనేజ్ లాజిక్ బాగుందండీ.. చాలా పాజిటివ్ గా ఆలోచించారు తను.

    ReplyDelete
    Replies
    1. వేణు గారు,నిజమేనండి, ఆవిడ చెప్పిన లాజిక్ ఇన్ని సంవత్సరాలైనా అలా గుర్తుండి పోయింది నాకు సమయం తీసుకుని స్పందించిన మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు.

      Delete
  7. ఆ రోజు మా సంభాషణ పూర్తి ఆయ్యాక,నాకు నోట మాట రాలేదు.మొదటి సారి నేనెంతో ఆరాధించే డోన్నా మీద అస్సయం వేసింది.అసలు కధ అక్కడ మొదలయ్యింది . కధ ముగింపు కొచ్చినా ఆ రోజు లంచ్ టైం లో ఆమె ఏమి మాట్లాడితే మీకు అంత అసహ్యం వేసిందో యింత వరకు చెప్పలేదు .

    ReplyDelete
    Replies
    1. రవి గారు, మీరు నన్ను ఈ ప్రశ్న అడిగారు అంటే మీరు బాగా ఎక్ష్పెక్టేషన్ పెట్టుకున్నారు నా నెక్ష్ట్ పోస్ట్ మీద. "ఓవర్ రియాక్షన్ ఇన్ ఫస్ట్ పోస్ట్" అని మీరు నాలుగు అక్షింతలెయ్యకుండా ఎలా రాయాలా అని నేను ఇక్కడ డీప్ థింకింగ్. నా మెదడుకు ఇంత పని పెట్టిన మీకు ధన్యవాదాలండి. (పోస్ట్ చదివి స్పందించినందుకు కూడా)

      Delete
  8. ఇన్ జనరల్ 'మనుషులంతా ఒకటే' అనే ఏకాభిప్రాయమున్నా , తూర్పు - పడమరల తేడాలు తప్పని సరి కదా!
    ఇదే కథకు ముగింపేమో!

    ReplyDelete
    Replies
    1. మాష్టారు, చాలా చాలా సంతోషం కలిగింది మీ వాఖ్య చూడగానే. క్షేమమేనాండి? కథకి అదే ముగింపో కాదో..? ఆఖరి భాగం కూడా చదివి అభిప్రాయం తెలుపగలరు. ధన్యవాదాలు మాష్టారు.

      Delete
  9. ఏదొ యధాలాపంగా మీ బ్లాగు చూసి మీ "లెడీ బాస్" టపాలన్నీ చదివేసాను. చదివాక ఒక విషయం అర్థం అయ్యింది. ఈ "బాసిజం" ఉంది చూడండి. మన ఉద్యోగానే కాకుండా అప్పుడప్పుడు మన జీవితాన్ని కూడా శాసిస్తుంది. మీ అఖరి టపా కొరకు ఎదురు చూస్తూ ...

    ReplyDelete
    Replies
    1. బాసిజం అన్నది ఇక్కడ టాపిక్ కాదు లెండి.సరదాగా బాస్ అన్న పదం వాడానే కాని, బాసిజం అంటూ పెద్దగా ఏమీ ఉండదు లేండి. ధన్యవాదాలు.

      Delete
  10. ఇంటి విషయాలైనా కానీండి.. చక్కగా అన్ని విషయాలూ ఓపెన్ గా రాసేస్తారు...ఏమిటో ...ఒక కామెంట్ పెట్టటానికి వంద సార్లు ఎడిట్ చేస్తా...ఏం తప్పుగా అనుకుంటారో అనీ!!

    ReplyDelete
    Replies
    1. మరీ వ్యక్తిగతమైనవి రాయటం లేదండి.కొన్ని అనుభవాలు పంచుకుంటాను అంతే.కామెంట్ విషయం లో సభ్యతగా ఉంటే చాలు కదండి? దానికి అంత అలోచన ఎందుకు? మీ అభిప్రాయం నిర్మొహమాటం గా తెలియచెప్పటం లో తప్పు లేదు.

      Delete